కర్నూలుకు మరో వరం.. రిలయన్స్ తాజా నిర్ణయం
రిలయన్స్ తో పాటు దేశంలోని మూడు కోలా బాట్లింగ్ సంస్థలు సైతం పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.;
దేశీయ దిగ్గజ కంపెనీల్లో ముందు ఉండే రిలయన్స్ సంస్థ ఏపీలోని కర్నూలుకు ఒక తీపికబురు చెప్పింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ విభాగమైన రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తాజాగా జరుగుతున్న వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సులో తన నిర్ణయాన్ని ప్రకటించింది. కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖతో రిలయన్స్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా రూ.40వేల కోట్ల పెట్టుబడితో సమీక్రత ఆహార తయారీ కేంద్రాల్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.
ఆహార ఉత్పత్తులు.. శీతల పానీయాల కోసం ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా ఏపీలోని కర్నూలు.. మహారాష్ట్రలోని కటోల్.. నాగపూర్ లలో వీటిని ఏర్పాటు చేస్తారు. ఈ విభాగాన్ని స్టార్ట్ చేసిన మూడేళ్లలోనే రూ.11వేల కోట్ల టర్నోవర్ ను సాధించింది. దీన్ని మరింత విస్తరించేందుకు రిలయన్స్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా.. తాజా విస్తరణ ప్లాన్ ను తెర మీదకు తీసుకొచ్చింది.
రిలయన్స్ తో పాటు దేశంలోని మూడు కోలా బాట్లింగ్ సంస్థలు సైతం పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. వాటిలో ఎస్ఎంఎంజీ బెవరేజస్.. హిందుస్థాన్ కోక-కోలా బెవరేజెస్.. కాంధారి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా తమ విస్తరణ ప్రణాళికల్ని వెల్లడించాయి. ఈ కంపెనీలు సైతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టనున్నాయి. రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్.. కోకకోలా.. ఇతర సంస్థలతో కలిసి రూ.65 వేల కోట్ల విలువైన ఒప్పందాల్ని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కుదుర్చుకుంది. మొత్తం 30 వేల మందికి ఉద్యోగాలు మాత్రమే కాదు.. 3 లక్షల మందికి ఉపాధి లభించనుంది. రిలయన్స్ ఏర్పాటు చేస్తున్న ప్లాంట్.. కర్నూలు పట్టణానికి ఒక వరంలా మారుతుందని మాత్రం చెప్పక తప్పదు.