ఫ్రెండ్ తో రీల్స్.. అడిగితే భర్తను ఏసేసింది
అనుబంధాల బంధం అంతకంతకూ తగ్గుతోంది. అనురాగాల మధ్య అక్రమ సంబంధాలు బంధీలవుతున్నాయి.;
అనుబంధాల బంధం అంతకంతకూ తగ్గుతోంది. అనురాగాల మధ్య అక్రమ సంబంధాలు బంధీలవుతున్నాయి. మూడు మూళ్లు వేసిన భర్తను ఏసేసేందుకు సైతం వెనుకాడని అమ్మాయిల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇటీవల కాలంలో ఈ తరహా ఉదంతాలు తరచూ తెర మీదకు వస్తున్నాయి. ఇప్పుడు చెప్పబోయేది కూడా ఇదే కోవకు చెందిన దుర్మార్గం. తమిళనాడులో వెలుగు చూసిన ఈ దారుణం ఇప్పుడు షాకింగ్ గా మారింది.అసలేం జరిగిందంటే..
తిరువణ్ణామలైకు దగ్గర్లోని సేతుపట్టు సమీపంలో ఉండే ఇడయాన్కొళత్తూరు గ్రామానికి చెందిన 27 ఏళ్ల విజయ్.. షర్మిలను ఐదేళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వీరి దాంపత్యానికి గుర్తుగా నాలుగేళ్ల కుమార్తె.. మూడేళ్ల కొడుకు ఉన్నాడు. లారీ డ్రైవర్ గా పని చేసే విజయ్.. పనికి వెళితే పది-పదిహేను రోజుల పాటు ఇంటికి వచ్చేవాడు కాదు. ఈ క్రమంలో షర్మిలకు మరో వ్యక్తితో స్నేహం ఏర్పడింది.
వీరిద్దరూ తరచూ రీల్స్ చేసేవారు. ఈ అంశంపై అనుమానం కలిగిన విజయ్.. చుట్టుపక్కల వారిని విచారించి.. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్నాడు. ఫ్రెండ్ తో కలిసి షర్మిల చేస్తున్న రీల్స్ ను ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అది కాస్తా పెద్దదైంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన షర్మిల కర్రతో విజయ్ తలపై బలంగా కొట్టటంతో అతను మరణించాడు.
ఈ నిజాన్ని కప్పి పుచ్చుకోవటానికి తన తల్లి ఫాతిమా సాయాన్ని తీసుకుంది షర్మిల. ఆమెతో కలిసి చనిపోయిన భర్తను కిటికీకి వేలాడదీసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులకు షర్మిల తీరుపై సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో ప్రాథమిక విచారణ జరిపిన వారు.. తమదైన శైలిలో విచారించగా ఆమె తాను చేసిన నేరాన్ని అంగీకరించింది. షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించి.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. క్షణికావేశంతో భర్త ప్రాణాలు తీసి.. ఇద్దరు పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేసిన ఆమె తీరు స్థానికంగా షాకింగ్ గా మారింది.