రూపాయికి ఖరీదైన షూ.. షోరూం ప్రకటనతో లాఠీ ఛార్జ్
మా షాప్ ఓపెనింగ్.. రూపాయి చీర.. రూపాయికి షర్టు.. ఫ్రీగా బిర్యానీ.. లాంటి వ్యాపార ఎత్తుగడలతో జనాల అటెన్షన్ ను తమవైపు తిప్పుకునే వ్యాపార సంస్థల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.;
ఫ్రీగా వస్తే పినాయిల్ తాగేస్తానంటూ గతంలో సరదాగా చెప్పుకునేటోళ్లు చాలామంది కనిపిస్తారు. రోజులు మారినా.. జనాల మైండ్ సెట్ లో ఫ్రీ మీద ఉన్న వ్యామోహం మాత్రం మారలేదన్న విషయం అప్పుడప్పుడు కళ్లకు కట్టినట్లుగా కనిపించటమే కాదు.. ఎంత ఫ్రీగా అయితే మాత్రం ప్రాణాల్ని పణంగా పెట్టేంత రిస్కు చేయాలా? అన్న భావన కలిగే పరిస్థితులు ఎదురవుతుంటాయి. తమ వ్యాపార సంస్థను పాపులర్ చేసుకోవటానికి కొందరు వ్యాపారస్తులు చేసే చౌకబారు చేష్టల కారణంగా శాంతిభద్రతల సమస్య ఎదురు కావటమే కాదు.. ప్రజల ప్రాణాల మీదకు తెచ్చే వరకు పరిస్థితులు వెళుతుంటాయి. ఇలాంటి వారి మీద పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే.
మా షాప్ ఓపెనింగ్.. రూపాయి చీర.. రూపాయికి షర్టు.. ఫ్రీగా బిర్యానీ.. లాంటి వ్యాపార ఎత్తుగడలతో జనాల అటెన్షన్ ను తమవైపు తిప్పుకునే వ్యాపార సంస్థల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేదంటే.. తాజాగా కేరళలోని కోళీకోడ్ లో చోటు చేసుకునే పరిణామాలే ఎదురవుతుంటాయి. తమ వ్యాపారాన్ని మరింత పాపులర్ చేసుకోవటానికి ఒక పాదరక్షల షాపు యజమానికి ఒక ఆకర్షనీయమైన ప్రకటనను జనం మీదకు వదిలాడు.
దాని సారాంశం ఏమంటే.. రూపాయి నోటు చూపించిన వారికి ఉచితంగా ఖరీదైన షూస్ ఇస్తామని. అయితే.. ఇక్కడో కండీషన్ కూడా పెట్టాడు. అదేమంటే.. ఖరీదైన షూస్ ఇచ్చేది మొదటి వంద మంది కస్టమర్లకే. సోషల్ మీడియాలో ఈ ప్రకటన పెద్ద ఎత్తున వైరల్ కావటంతో.. శనివారం అర్థరాత్రి రెండు గంటల నుంచే ఈ షాప్ ఎదుట జనాలు రూపాయి నోట్లతో పోటెత్తారు. ఉదయానికి ఈ జనప్రవాహం మరింత పెరిగింది. భారీ ఎత్తున వచ్చి పడ్డ జనాలతో షాపు యజమాని ఉక్కిరిబిక్కిరి కావటం ఒక ఎత్తు అయితే.. అనుకోనిది ఏమైనా జరుగుతుందున్న ఆందోళనలతో పోలీసులు తీవ్రమైన టెన్షన్ కు గురయ్యారు.
వారు అంచనా వేసినట్లే..రద్దీ తీవ్రం కావటం ఒక ఎత్తు అయితే.. తీవ్రమైన ట్రాఫిక్ జాంతో వాహనదారులు తీవ్ర అవస్థలకు గురైన పరిస్థితి. అంతకంతకూ పెరుగుతున్న జనాలతో పరిస్థితి అదుపు తప్పింది.దీంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఏర్పడిన తొక్కిసలాటలో పలువురికి గాయాలయ్యాయి. ఈ గందరగోళానికి కారణమైన షాపు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తరహా ఆఫర్లను ప్రకటించే వ్యాపార సంస్థల మీదా.. వ్యాపారస్తుల మీద కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.