తొంబై ఏట కూడా ఆయనే ప్రధానిగా !
ఇదిలా ఉంటే ఒక చానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నారు.;
మనది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రతీ అయిదేళ్ళకు ఒకసారి ఎన్నికలు జరుగుతూంటాయి. అయితే ఈ దేశంలో సెంటిమెంట్ బాగా ఎక్కువ. ఒక నాయకుడు కానీ ఒక పార్టీ కానీ నచ్చారే అనుకుంటే వారిని వరుసగా గెలిపించేస్తూంటారు. అలా సుదీర్ఘకాలం కాంగ్రెస్ ఈ దేశాన్ని ఏలింది. తరువాత బీజేపీ ఎక్కువ కాలం దేశాన్ని పాలించిన పార్టీగా రికార్డుకు ఎక్కింది. మొత్తం 78 ఏళ్ళ స్వాతంత్ర్య దేశంలో 55 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలించగా వాజ్ పేయ్ మోడీ కలుపుకుని ఇప్పటికి పదిహేడేళ్ళ బీజేపీ పాలన సాగినట్లుగా చెప్పుకోవాలి. 1977లో జనతా ప్రయోగం, ఆ 1989లో తరువాత నేషనల్ ఫ్రంట్ పాలన,1886లో యునైటెడ్ ఫ్రంట్ పాలన కలుపుకుంటే ఆరేళ్ళ పాలన అవుతుంది. ఈ లెక్కన కాంగ్రెస్ ఈ రోజుకీ అర్ధ శతాబ్దం పైగా దేశాన్ని పాలించింది అన్నది చరిత్ర చెబుతున్న సత్యం.
ఆ ఇద్దరి తరువాత మోడీనే :
ఇక ఈ దేశాన్ని అత్యధికాలం పాలించిన ప్రధానుల జాబితా చూస్తే 1947 నుంచి 1964 దాకా 17 ఏళ్ళ పాటు పండిట్ నెహ్రూ పాలిస్తే శ్రీమతి ఇందిరా గాంధీ మొత్తం మూడు సార్లు కలుపుకుని 16 ఏళ్ళ పాలించారు. ప్రస్తుతం మోడీ 11 ఏళ్ళ పాలనను ప్రధానిగా పూర్తి చేసుకున్నారు. 2029లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే అప్పటికి మోడీ అక్షరాలా 15 ఏళ్ల పాలన పూర్తి చేసిన వారు అవుతారు. అంటే గాంధీ వంశం ప్రధానుల సరసకు బాగా సమీపంలోకి వచ్చేసినట్లే.
మరో మూడు టెర్ములు అంటూ :
ఇదిలా ఉంటే ఒక చానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నారు. మోడీ 2029 లోనే కాదు 2039 లోనూ ప్రధానిగానే ఉంటారు అని రాజ్ నాధ్ చెప్పుకొచ్చారు. ఆయనకు బీజేపీలో కానీ బయట కానీ పోటీ సరి సాటి ఎవరూ లేరని కూడా రక్షణ మంత్రి నిబ్బరం ప్రదర్శించారు. అంటే ఇదే వరసలో మరో మూడు టెర్ములు మోడీ ప్రధానిగా ఉంటారని ఆయనకు అత్యంత సన్నిహితుడుగా ఉంటూ వస్తున్న రాజ్ నాధ్ సింగ్ స్పష్టం చేశారు అన్న మాట.
ధీమా ఓకే కానీ :
రాజ్ నాధ్ సింగ్ ధీమా ఓకే. అంతే కాదు మోడీ సమర్ధత కూడా ఓకే. ఆయన ఎన్నో సంక్లిష్టమైన సమస్యలకు పరిష్కారం చూపించారు అని అంటున్నారు. బలమైన నాయకత్వంతో ఆయన గత పదకొండేళ్ళుగా దేశానికి పాలన అందిస్తున్నారు. అయితే తాజాగా జరిగిన ఆయన పుట్టిన రోజు నాటికి మోడీకి 75 ఏళ్ళు నిండాయి. ఇక 2029 ఎన్నికల నాటికి మోడీ 80వ పడిలో అడుగుపెడతారు. ఈ లెక్కన చూసుకుంటే 2039 అంటే మోడీకి 90 ఏళ్ళు వస్తాయి. అఫ్ కోర్స్ మోడీ ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారు అనుకున్నా రాజ్ నాధ్ సింగ్ చెబుతున్నవి కొంత అతిశయోక్తిగానే ఉంది అని అంటున్నారు.
రికార్డు బ్రేక్ చేసినట్లే :
ఈ దేశాన్ని 80 ఏళ్ళ వయసులో పాలించిన వారు ఉన్నారు. మొరార్జీ దేశాయ్, వాజ్ పేయి, మన్మోహన్ సింగ్ వీరంతా 80లు నిండిన తరువాతనే ప్రధాని పదవిని అందుకున్నారు. అయితే 90వ పడిలోకి వచ్చిన తరువాత ఆ ఉన్నత పదవిని ఎవరూ అధిష్టించిన సందర్భం అయితే భారత దేశ రాజకీయ చరిత్రలో అయితే లేదు. అదే కనుక జరిగితే మాత్రం మోడీ రికార్డు బ్రేక్ చేసినట్లే అని అంటున్నారు. ఇక బీజేపీ కూడా ఇన్నేళ్ల పాటు అధికారంలో ఉంటే అది ఇంకా పెద్ద రికార్డు అవుతుంది. మరో వైపు చూస్తే బీజేపీ 2047 వైపు గురి పెట్టింది. వికసిత భారత్ అంటోంది. మరి 2039 లో కూడా మోడీ ప్రధానిగా బీజేపీకి నాయకత్వం వహిస్తూ ముందుకు సాగితే కాషాయం పార్టీ ఏకచత్రాధిపత్యం పరిపూర్ణం అయినట్లే. చూడాలి మరి రాజ్ నాధ్ ఆశలు ఏ మేరకు నెరవేరుతాయో.