కలకలం : బీజేపీ నోట పాకిస్తాన్ కు మద్దతు !
‘అమెరికా - పాకిస్తాన్ ల మధ్య యుద్దం జరిగితే పాకిస్తాన్ మన పొరుగు దేశం కాబట్టి మనం దానికి మద్దతు ఇస్తాం.
‘అమెరికా - పాకిస్తాన్ ల మధ్య యుద్దం జరిగితే పాకిస్తాన్ మన పొరుగు దేశం కాబట్టి మనం దానికి మద్దతు ఇస్తాం. అదే భారత్ - పాకిస్తాన్ మధ్య సమస్య వస్తే మాత్రం దేశ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యత ఇస్తాం’ అని రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ మదన్ రాథోడ్ చేసిన వ్యాఖ్యలు అంటూ వస్తున్న వార్తలు తీవ్ర చర్చకు దారితీశాయి. బీజేపీ సీనియర్ నేత నోటి నుండి ఈ వ్యాఖ్యలు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
జైపూర్ లో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సంధర్భంగా ముస్లి కమ్యూనిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మదన్ రాథోడ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీ దేశభక్తిని ప్రశ్నిస్తూ తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి.
దీనిపై మదన్ రాథోడ్ స్పందిస్తూ ‘తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించారని, భారత్ - పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు భారత్ ఓడిపోతే టపాసులు కాల్చేవారు దేశభక్తులు కారని, ఒకవేల అమెరికా లాంటి వేరే దేశంలో పాకిస్తాన్ మ్యాచ్ ఆడితే అది వేరే విషయం అని, భారత్ తో ఆడినప్పుడు మన దేశానికే మద్దతు ఇవ్వాలి అనే ఉద్దేశంతో తాను మాట్లాడానని, కొందరు కుట్ర పూరితంగా చివరి వ్యాఖ్యలను కట్ చేసి, యుద్దం అనే కోణంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని’ వివరణ ఇచ్చారు.
అయితే ఈ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. పాకిస్తాన్ కు మద్దతు అని ఎలా అంటారన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ‘బీజేపీకి పాకిస్తాన్ పట్ల ఉన్న ప్రేమ బయటపడిందని, ఉగ్రవాద దేశానికి మద్దతు ఎలా ఇస్తారని’ కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. ఇదే వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ షేర్ చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టింది.
అయితే బీజేపీ ఈ విషయంలో అధికారికంగా పెద్దగా స్పందించలేదు. స్వయంగా వ్యాఖ్యలు చేసిన ఎంపీ మదన్ రాథోడ్ స్పందించాడు. అయితే ప్రతిపక్షాలు ఈ వ్యాఖ్యలను పాకిస్తాన్ విషయంలో బీజేపీ విధానంగా దాడి చేసేందుకు ఉపయోగించుకుంటున్నాయి. ఈ విషయంలో పూర్తి వీడియోను గమనిస్తే తప్పితే వ్యాఖ్యల విషయంలో స్పష్టత రాదు.