పుంగనూరులో హైటెన్షన్.. ఎంపీ మిథున్ రెడ్డి కేంద్రంగా రాజకీయం

అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా అధికార టీడీపీ, విపక్షం వైసీపీ మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

Update: 2026-10-16 10:39 GMT

అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా అధికార టీడీపీ, విపక్షం వైసీపీ మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇందులో పలువురు కార్యకర్తలు గాయపడ్డారని చెబుతున్నారు. ఇరుపార్టీల వారు ఒకేసారి నామినేషన్లు దాఖలు చేసేందుకు రావడంతో వివాదం మొదలైందని అంటున్నారు. వైసీపీ శ్రేణులకు మద్దతుగా ఎంపీ మిథున్ రెడ్డి రావడం, ఆయనను నామినేషన్ కేంద్రంలోకి వెళ్లనీయకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో గొడవ జరిగిందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇరుపార్టీల వారు పరస్పరం వాగ్వాదానికి దిగడంతోపాటు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారని అంటున్నారు.

మిథున్ రెడ్డి కారుపై రాళ్ల వర్షం

పుంగనూరులో వైసీపీ శ్రేణుల నామినేషన్ కార్యక్రమానికి ఎంపీ మిథున్ రెడ్డి హాజరుకావడంతో గొడవ పెద్దది అయిందని అంటున్నారు. వైసీపీ కార్యకర్తలు వచ్చే సమయానికి టీడీపీ శ్రేణులు భారీగా మోహరించినట్లుగా చెబుతున్నారు. టీడీపీ శ్రేణులు గేటు బయట ఉండగా, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ అభ్యర్థులు తమ వాహనాలతో లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారని అంటున్నారు. అయితే లోపల టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు వైసీపీ కార్లను అడ్డగించే ప్రయత్నం చేశారని అంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ వాహనాలు వేగంగా దూసుకుపోవడంతో టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసిరినట్లుగా ప్రచారం జరుగుతోంది. అదేసమయంలో వైసీపీ కార్యకర్తలూ ప్రతిఘటించడంతో వివాదం పెద్దది అయిందని అంటున్నారు.

నామినేషన్ కేంద్రంలో కారు విధ్వంసం

ఇక టీడీపీ కార్యకర్తల ప్రతిఘటన మధ్యే నామినేషన్ కేంద్రంలోకి వెళ్లిన ఎంపీ మిథున్ రెడ్డి దాదాపు ఐదు గంటలకు పైగా ఎన్నికల అధికారులు ఉన్న గదిలోనే ఉండిపోయారు. ఆయన గన్ మన్ కు గాయాలైనట్లు చెబతున్నారు. అదే సమయంలో ఎంపీ మిథున్ రెడ్డికి గాయాలు తగినట్లు ప్రచారం జరుగుతున్నా, అధికారికంగా ఎవరూ ధృవీకరించడం లేదు. మరోవైపు ఎంపీ మిథున్ రెడ్డి ఎన్నికల అధికారులు ఉన్న గదిలోకి వెళ్లిన తర్వాత ఆయనకు చెందినదిగా చెబుతున్న ఓ కారు టీడీపీ శ్రేణులపైకి దూసుకువెళ్లిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై ప్రభుత్వ వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇక ఎంపీ మిథున్ రెడ్డిపై హత్యయత్నం జరిగిందని, ఆయనకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సివుందని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తేల్చిచెప్పారు.

కర్ణాటక నుంచి గుండాలు

కాగా, పుంగనూరు ఘటనలపై టీడీపీ తీవ్రంగా స్పందించింది. ఘటనకు ఎంపీ మిథున్ రెడ్డి కారణమని ఆరోపించింది. నామినేషన్లు వేసేందుకు వచ్చిన వైసీపీ అభ్యర్థులు తమ కాన్వాయ్ లో పెట్రోల్ బాండులు, రాళ్లు, సోడా సీసాలు పట్టుకుని వచ్చారని శాప్ చైర్మన్ రవి నాయుడు ఆరోపించారు. అంతేకాకుండా మిథున్ రెడ్డి వెంట కర్ణాటక రిజిస్ట్రేషన్ తో ఉన్న కొన్ని కార్లు ఉన్నాయని, వాటిలో గుండాలు వచ్చారని ఆరోపించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలే తమపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. తాము ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో శాంతంగానే ఉన్నామని, తమపై వైసీపీ నేతలే ముందుగా దాడి చేశారని రవి నాయడు పేర్కొన్నారు.

పుంగనూరు విధ్వంసంపై సర్వత్రా చర్చ

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలైన తొలిరోజు చోటుచేసుకున్న ఉద్రిక్తతలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా రాయలసీమలోని పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకోగా, పుంగనూరులో రోజంతా హైడ్రామా నడుస్తోంది. భద్రతాపరమైన సమస్యతో ఎంపీ మిథున్ రెడ్డి నామినేషన్ కేంద్రంలోనే ఉండిపోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా చెబుతున్నారు. ఆయన బయటకు వస్తే దాడి జరిగే ప్రమాదం ఉందనే కారణంగా బయటకు రాకుండా పోలీసులు నిలిపివేసినట్లుగా చెబుతున్నారు. ఇక పుంగనూరు ఎపిసోడ్ కు చెందిన పలు వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటనలో రెండు వర్గాల వారు గాయపడటంతోపాటు పరస్పరం ఆరోపణలు, పోలీసు ఫిర్యాదులు చేసుకుంటున్నారు.




Tags:    

Similar News