ఆయన మాజీ కావాల్సిందే...అందుకే ప్రియాంక అక్కడికి !
కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఈ ఏడాది జరిగే ఎన్నికల మీద తీవ్ర స్థాయిలోనే మధనం చేస్తోంది.;
కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఈ ఏడాది జరిగే ఎన్నికల మీద తీవ్ర స్థాయిలోనే మధనం చేస్తోంది. గత ఏడాది కానీ 2024 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కానీ ఎక్కడా బోణీ కొట్టలేకపోయింది. నకిలీ ఓట్లు అని ఓట్ల చోరీ అని ఎంత అరచి గీ పెట్టినా బీహార్ లో సైతం ఎన్డీయేకు బంపర్ విక్టరీ దక్కింది. దాంతో కాంగ్రెస్ హైకమాండ్ కి ఏమీ పాలు పోవడం లేదు. చూస్తే కళ్ళ ముందు ఏకంగా అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరీ, కేరళ, అసోంలలో ఈ ఏడాది మధ్యలో ఎన్నికలు వరసగా జరగనున్నాయి. ఇందులో కాంగ్రెస్ సొంతంగా పోటీ చేసి గెలిచేది కేరళ అసోం లలో మాత్రమే. మిగిలిన చోట్ల మిత్రులతో కలసి నడవాల్సి ఉంది. అందుకే జాగ్రత్తగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది.
కేరళ ఎంపీగా ఉన్నా :
ఇక చూస్తే కాంగ్రెస్ లో నవతరం ప్రతినిధిగా ప్రియాంకా గాంధీ బాగానే దూసుకుని వస్తున్నారు. ఆమె పార్లమెంట్ ప్రసంగాలు కానీ ఆమె పంచులు కానీ అధికార పార్టీ మంత్రులతో కలసి మాట్లాడుతున్న తీరు కానీ ఇవన్నీ రాజకీయంగా ఆమెలోని విచక్షణ, లౌక్యం వ్యూహాలను బయటకు తెస్తున్నాయి. ఇక కాంగ్రెస్ లోనే చాలా మంది నేతలు ప్రియాంక అయితే కాంగ్రెస్ ని కాస్తుంది అని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఆమెకు ఒక బిగ్ టాస్క్ నే అగ్ర నాయకత్వం అప్పచెప్పింది. కేరళ లోని వయనాడ్ ఎంపీగా గెలిచిన ప్రియాంకకు అసోం రాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. ఇది నిజంగా విశేష పరిణామంగానే చూడాల్సి ఉంది.
అక్కడే టార్గెట్ :
అసోం లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఉన్నారు. ఆయన రాజకీయం ఎదుగుదల అంతా కాంగ్రెస్ నుంచే మొదలైంది అని చెప్పాలి. ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ లో విద్యార్థి నేతగా హిమంత బిశ్వ శర్మ రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆయనను 1996లో అప్పటి ముఖ్యమంత్రి హితేశ్వర్ సైకియా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన 2001లో జలుక్‌బరి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచాడు. తరువాత వరుసగా 2006, 2011, 2016 ఎన్నికల్లో గెలిచారు హిమంత బిశ్వ శర్మ 2004లో తొలిసారి తరుణ్ గొగొయి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు 2015లో తరుణ్ గొగోయ్‌తో విభేదాల కారణంగా 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరాడు. ఆ తరువాత హిమంత బిశ్వ శర్మ 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి 2021 మే 10న అసోం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
కాంగ్రెస్ ఓటమే అంటూ :
ఇక తన రాష్ట్రంలో కాంగ్రెస్ ని ఓడించడం వర్కూ ఓకే అనుకున్నా హిమంత బిశ్వ శర్మ పని గట్టుకుని వరసగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూలగొట్టారు అని కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి విపరీతమైన ఆగ్రహం ఉంది అని అంటారు. హిమంత బిశ్వ శర్మ అసోం అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడంతో మొదలెట్టి 2017లో మణిపూర్‌లో కూటమి ఏర్పాటు చేయడం ద్వారా కాంగ్రెస్ కి ఝలక్ ఇచ్చారు. అంతే కాదు మేఘాలయలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. అదే విధంగా నాగాలాండ్‌లో బీజేపీ, నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనల్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీలతో కూటమిని ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు.ఇలా ఈశాన్య రాష్ట్రాలలో కమలం వికసించడానికి కాంగ్రెస్ వాడిపోవడానికి హిమంత బిశ్వ శర్మ కారకుడు అని ఆ పార్టీ నమ్ముతోంది.
ఓడించాల్సిందేనా :
అందుకే ప్రియాంకను అసోం కి కాంగ్రెస్ అగ్ర నాయకత్వం పంపిస్తోంది. అక్కడ చూస్తే కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా అధికారం పంచుకున్నాయి. 2016లో తరుణ్ గొగోయ్ ప్రభుత్వాన్ని కూలగొట్టి హిమంత బిశ్వ శర్మ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం చేశారు. ఆ తరువాత మరో అయిదేళ్ళు ఆయన సీఎం గా ఉన్నారు. దాంతో బీజేపీ పట్ల వ్యతిరేకత బాగా ఉంటుందని అందుకే ఈసారి అక్కడ కాంగ్రెస్ జెండా పాతాలని ఆ పార్టీ చూస్తోంది. ఈ క్రమంలో ప్రియాంకా గాంధీ వర్సెస్ హిమంత బిశ్వ శర్మగా అసోం రాజకీయం సాగనుంది. మరి మాజీ కాంగ్రెస్ నేత హిమంత బిశ్వ శర్మ ని మాజీ సీఎం గా ప్రియాంకా గాంధీ చేస్తారా అంటే వెయిట్ అండ్ సీ.