ద్రౌపది ముర్ము రాకతో చారిత్రాత్మక పరిణామం

ఇదిలా ఉంటే తాను ఎక్కడైతే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారో అక్కడికి దేశాధ్యక్షురాలి హోదాలో ద్రౌపది ముర్ము వస్తున్నారు.;

Update: 2025-11-27 03:45 GMT

భారత దేశానికి అత్యంత గౌరవనీయమైన పదవి రాజ్యాంగం ప్రకారం అత్యున్నత మైన హోదా కలిగిన రాష్ట్రపతి పదవి ద్రౌపది ముర్ము చేపట్టారు. ఆమె 2022 జూలైలో ఈ పదవిని అందుకున్నారు. ఆమె అంతకు ముందు కీలక పదవులే చేశారు. ఆమె గవర్నర్ గా కొంతకాలం ఉన్నారు. దాని కంటే ముందు ఆమె రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా ఒడిశా ప్రభుత్వంలో పనిచేశారు. నిరాడంబరతకు మారు పేరు అయిన ద్రౌపది ముర్ము దేశానికే రాష్ట్రపతి కావడం అన్నది ఆమెకు దక్కిన ఒక అరుదైన గౌరవంగా చెబుతారు.

అది ఒక రికార్డు :

ఇదిలా ఉంటే తాను ఎక్కడైతే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారో అక్కడికి దేశాధ్యక్షురాలి హోదాలో ద్రౌపది ముర్ము వస్తున్నారు. అక్కడ ఆమె రాకతో ఒక చారిత్రాత్మకమైన సందర్భంగా నమోదు అవుతుంది ఇంతకీ ఏమిటి అన్నది చూస్తే ఆసక్తికరమే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశా శాసనసభ శీతాకాల సమావేశాల మొదటి రోజైన గురువారం ఆ రాష్ట్ర అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశ రాష్ట్రపతి హోదాలో ఇప్పటిదాకా ఎవరూ ఒడిశా అసెంబ్లీలో ప్రసగించలేదు. దాంతో ద్రౌపది ముర్ము ఈ విషయంలో ఒక రికార్డుని నమోదు చేస్తున్నారు.

నెగ్గిన చోట నుంచే :

అదే విధంగా ఒడిశా ఎమ్మెల్యేగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ద్రౌపది ముర్ము అదే సభలో రాష్ట్రపతి గా ప్రసంగం చేయడం చారిత్రాత్మక పరిణామంగా అంతా పేర్కొంటున్నారు. ఇలా ఎపుడూ ఎవరికీ ఈ చాన్స్ అయితే దక్కలేదు కానీ దానిని ద్రౌపది ముర్ము చేసి చూపిస్తున్నారు. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు శాసన సభలోని సభ్యులను ఉద్దేశించి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

అది ఆమెకు అపురూపం :

ఇక ఇదే పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాను శాసనసభ్యురాలిగా ఉన్న కాలంలో పనిచేసిన గది నంబర్ 11 ని స్వయంగా సందర్శిస్తారు. ద్రౌపది ముర్ము 2000 2004లో ఒడిశాలోని రాయరంగ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఒడిశా శాసనసభకు ఎన్నికయ్యారు. ఆమె బిజెడి-బిజెపి సంకీర్ణ ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. దాంతో ఆమె ఎమ్మెల్యేగా తనకు ప్రభుత్వం కేటాయించిన గది నుంచే తన విధి నిర్వహణ చేపట్టారు. ఇపుడు ఆమె అత్యున్నత హోదాలో ఆ గదిని తిరిగి సందర్శిస్తున్నారు. అలా ఆమెకు మరో మధురమైన జ్ఞాపకంగా ఉండబోతోంది అని అంటున్నారు. మొత్తానికి ద్రౌపది ముర్ము పర్యటన కోసం సర్వం సిద్ధమై ఆమె రాక కోసం ఒడిశా అంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తోంది.

Tags:    

Similar News