అయితే 150..లేకపోతే 10.. ప్రశాంత్ కిషోర్ లెక్కలేంటో?
పీకే తన జన్ సురాజ్ యాత్ర ద్వారా బిహార్‌లో విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి కీలక సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు.;
దేశంలోనే అత్యంత పాపులర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ (వ్యూహకర్త)గా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ (పీకే) సొంత రాష్ట్రం బిహార్ రాజకీయాల్లో ఎదుర్కొంటున్న సవాళ్లు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. నరేంద్ర మోదీ, జగన్, స్టాలిన్, మమతా బెనర్జీ లాంటి ఎందరినో ప్రధానులను (మోడీని), ముఖ్యమంత్రులను చేసిన ఘనత ఆయనకు ఉంది. అలాంటి పీకే, తన జన సురాజ్ పార్టీ (Jan Suraaj Party)ని బిహార్‌లో అధికారంలోకి తెచ్చే విషయంలో మాత్రం ఆపసోపాలు పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
* 150 లేకపోతే 10... లెక్కల్లో మ్యాజిక్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పీకే చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయి. తమ పార్టీకి 150కి పైగా సీట్లు వస్తాయని, లేకపోతే 10 కంటే తక్కువ సీట్లకే పరిమితం అవుతామని ఆయన ప్రకటించడం వ్యూహాత్మకంగా కనిపిస్తోంది. మధ్యేమార్గం ఉండదంటూ ఆయన చేసిన వ్యాఖ్య... ఓటర్లను జన సురాజ్ వైపు మొగ్గు చూపేలా, దీర్ఘకాలంగా నెలకొన్న నిరాశను తొలగించేలా విశ్వాసాన్ని నింపే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రకటన పీకేకు ఉన్న లెక్కల మీద నమ్మకాన్ని సూచించినా, ఇది బిహార్ ఓటర్ల మనసును ఎంతవరకు ప్రభావితం చేస్తుందనేది చూడాలి.
* సొంత పోటీపై వెనుకడుగు ఎందుకు?
జన సురాజ్ పార్టీని స్థాపించినా, పీకే సొంతంగా పోటీ చేయకపోవడం కూడా విమర్శలకు కేంద్రబిందువైంది. ఒకానొక దశలో రాఘోపూర్ లేదా కర్గాహర్ నుంచి బరిలో ఉంటానని పీకే హింట్ ఇచ్చినా, తుది నిర్ణయంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయించిందని ప్రకటించారు. దీనిపై సోషల్ మీడియాలో 'పీకేకు తన ఓటమి భయం వెంటాడుతోందా?', 'అందరి జాతకం చెప్పే పీకేకు సొంత జాతకం అర్థం కావడం లేదా?' అన్న విమర్శలు వస్తున్నాయి. అయితే, తాను వ్యక్తిగతంగా పోటీ చేయకుండా పార్టీ నిర్మాణం, అభ్యర్థుల విజయంపైనే పూర్తిగా దృష్టి పెడతానని పీకే చెప్పడం వెనుక ఎన్నికల్లో ఓడిపోతే పరువుపోతుందన్న భయం వెంటాడుతుంది కావచ్చు అన్న చర్చ సాగుతోంది.
పీకే దృష్టిలో, తాను ఎక్స్-ఫ్యాక్టర్ కాదు, జన సురాజ్ పార్టీ గెలిచిన సీట్లే ముఖ్యమనే అభిప్రాయాన్ని బలంగా వినిపిస్తున్నారు. బిహార్‌లో మహాగఠ్‌బంధన్ లేదా ఎన్డీయేకు ప్రత్యామ్నాయం లేదన్న అభిప్రాయం కేవలం ఒక అభిప్రాయం మాత్రమే, వాస్తవం కాదని ఆయన వాదిస్తున్నారు. పార్టీ అభ్యర్థులు ఓడిపోతేనే, పార్టీ భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉంది. అందుకే, గెలుపు - ఓటమిని కేవలం పీకే పోటీ చేశాడా లేదా అన్నదానితో ముడిపెట్టకుండా, పార్టీ విజయాన్ని ఒక సమిష్టి కృషికే ఆపాదిస్తున్నారు.
*'పీకే' వ్యూహంలో దాగున్న లక్ష్యం
పీకే తన జన్ సురాజ్ యాత్ర ద్వారా బిహార్‌లో విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి కీలక సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఆయన ఏ కూటమితోనూ పొత్తు పెట్టుకోబోనని స్పష్టం చేయడం, బిహార్ ఓటర్లు కులం, కుటుంబ పాలనకు భయపడి ఓటు వేసే 30 ఏళ్ల రాజకీయ శకం ముగిసిపోతోందని పేర్కొనడం ద్వారా కొత్త, కులరహిత ప్రత్యామ్నాయంగా జన సురాజ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర పార్టీలు తమ అభ్యర్థులను భయపెట్టి నామినేషన్లు విత్‌డ్రా చేయిస్తున్నాయని ఆయన ఆరోపించడం కూడా, తమ పార్టీ బలం పట్ల ఉన్న అపనమ్మకాన్ని సూచిస్తుంది.
మొత్తంగా, బిహార్ రాజకీయాల్లోని పాత తరం (లాలు-నితీష్) నుంచి ప్రజల దృష్టిని మళ్లించి, నూతన తరానికి అండగా నిలబడాలన్నది పీకే ప్రధాన లక్ష్యం నెరవేరేలా కనిపించం లేదు.. బీహార్ లో ఓడిపోతే పరువు పోతుందని.. భవిష్యత్తు ఉండదని.. వ్యూహకర్తగానూ కొనసాగలేనన్న భయం ఆయన మాటల్లో వ్యక్తమవుతోంది.
తన ఎన్నికల విజయాలను ఓటర్ల మనోభావాలను అంచనా వేసి అందించిన వ్యూహకర్త.. సొంతంగా స్థాపించిన పార్టీ విషయంలో ప్రకటించిన 150 vs 10 సీట్లు అనే ఈ విపరీతమైన లెక్క బిహార్‌లో ఆయన ఓటమిని ముందే ఒప్పుకున్న చర్చకు దారితీస్తోంది.
ఎవరు నెగ్గుతారో .. ఎవరు ఓడుతారో ముందేచెప్పే ప్రశాంత్ కిషోర్ తన జాతకం ఏంటో చెప్పలేకపోతున్నాడా? అన్న డౌట్లు వస్తున్నాయి. అందరి జాతకం చెప్పే ప్రశాంత్ కిషోర్ తన జాతకం ఏంటో అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దేశంలోనే పాపులర్ వ్యూహకర్త.. సొంత బీహార్ లో ఏం ‘పీకే’లేకపోతున్నాడా? అన్న విమర్శలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.