ఐప్యాక్ ప్రశాంత్ కిశోర్.. ప్యాకప్!.. బిహార్ లో బొక్క బోర్లా పడిన వ్యూహకర్త

రాజకీయ వ్యూహాల్లో గండర గండడుగా.. అపర చాణుక్యుడిగా దాదాపు దశాబ్దాన్నర కాలం వెలుగొందిన ప్రశాంత్ కిషోర్ బొక్కబోర్లా పడ్డాడు.;

Update: 2025-11-14 07:42 GMT

రాజకీయ వ్యూహాల్లో గండర గండడుగా.. అపర చాణుక్యుడిగా దాదాపు దశాబ్దాన్నర కాలం వెలుగొందిన ప్రశాంత్ కిషోర్ బొక్కబోర్లా పడ్డాడు. తన సొంత రాష్ట్రం బిహార్ లో ఆయన వేసిన పాచికలు అస్సలు ఏ మాత్రం పారలేదు. బిహార్ లో తాజాగా జరిగిన ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జనసురాజ్ పార్టీ కనీసం ఒక్కచోట కూడా గెలుపొందలేదు. సరికదా ఏ స్థానంలోనూ ప్రశాంత్ కిషోర్ పార్టీకి డిపాజిట్ దక్కలేదు. 2012లో గుజరాత్ లో ప్రస్తుత ప్రధాని మోదీకి ఎన్నికల వ్యూహాలు రచించినట్లు చెప్పుకుని బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ప్రశాంత్ కిషోర్ అనంతర కాలంలో దేశంలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. తనతో గంట మాట్లాడి తనతో సలహాలు చెప్పించుకుంటే రూ.ఐదు కోట్లు వసూలు చేసినట్లు స్వయంగా చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్ ను బిహారీలు రాజకీయ వ్యాపారిగా చూశారే తప్ప, రాజకీయ నాయకుడిగా అంగీకరించలేకపోయారని ఎన్నికల ఫలితాల బట్టి అర్థమవుతోందని విశ్లేషిస్తున్నారు.

2012లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి వ్యూహాలు అందించిన ప్రశాంత్ కిషోర్ అనంతరం పలు రాష్ట్రాల్లో పనిచేశారు. ఇందుకోసం ఐ-ప్యాక్ అనే సంస్థను ప్రశాంత్ కిషోర్ ఏర్పాటు చేశారు. 2012 ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రశాంత్ కిషోర్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. దీంతో 2013లో "సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్" (CAG) అనే పేరుతో ఓ సంస్థను ప్రశాంత్ కిషోర్ ప్రారంభించాడు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ప్రధానిగా మోదీని గెలిపించడానికి ఈ సంస్థ ద్వారా ప్రశాంత్ కిషోర్ పనిచేశాడు. ఈ ఎన్నికల్లోనూ మోదీ ఆధ్వర్యంలో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో ప్రశాంత్ కిషోర్ ఓవర్ నైట్ స్టార్గా మారిపోయాడు. ఆ తర్వాత కాంట్రాక్టు బిహార్ లో మహాఘట్‌బంధన్ నుంచి దక్కించుకున్నాడు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి ఏర్పాటు చేసిన ఈ కూటమికి ఆ ఎన్నికల్లో గెలిచింది. దీంతో తన సంస్థ పేరును ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC)గా మార్చాడు ప్రశాంత్ కిషోర్. ఇక వరుసగా మూడు ఎన్నికల్లో ఆయన వ్యూహాలు పనికిరావడంతో ప్రశాంత్ కిషోర్ కి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది.

బిహార్ ఎన్నికల తర్వాత పంజాబ్ లో కాంగ్రెస్ కు, ఏపీలో వైసీపీ, ఢిల్లీలో ఆప్, తమిళనాడులో డీఎంకే, బెంగాల్ లో టీఎంసీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు అందించాడు. తన ప్రతి వ్యూహానికి కోట్ల కొద్ది డబ్బు వసూలు చేశాడు. తెలంగాణలో కూడా కొంతకాలం బీఆర్ఎస్ కి వ్యూహకర్తగా పనిచేయడానికి కాంట్రాక్టు దక్కించుకున్నాడు. అయితే ఆయన అతిని పసిగట్టిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కన పెట్టేశాడు. ఇదే సమయంలో వైసీపీని గెలిపించడంతో ఆ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కు అధిక ప్రాధాన్యం ఇచ్చారని చెబుతారు. 2019లో జగన్ గెలిచిన కొత్తలో ఆయన పక్కనే ప్రశాంత్ కిషోర్ కి కుర్చీ వేసి మరీ అందరికీ పరిచయడం చేయడాన్ని ఈ సందర్భంగా అంతా ప్రస్తావిస్తున్నారు. ఇక 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ ఐ-ప్యాక్ నుంచి వైదొలిగారు.

రాజకీయాలపై ఆసక్తితో తన స్వరాష్ట్రం బిహార్ లో జేడీయూలో చేరారు. కొన్నాళ్లు ఆ పార్టీలో పనిచేసిన ప్రశాంత్ కిషోర్ నైజం నచ్చక ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పక్కన పెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరతానన్నా, రాహుల్ అంగీకరించలేదు. దీంతో జనసురాజ్ అనే రాజకీయ సంస్థను ప్రారంభించి దాన్నే పార్టీగా మార్చారు. పార్టీ తరఫున బిహార్ లో మూడు వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశాడు. కానీ, ఆయనను ప్రజలు ఆదరించలేదని తాజా ఎన్నికల్లో తేలిపోయింది. ఇదే సమయంలో ఆయన వ్యూహాలపైనా అనేక రకాలుగా చర్చ జరుగుతోంది. ఎన్నికల వ్యూహాకర్తగా ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలకు అంతా ఇన్నాళ్లు మోసపోయారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే, ప్రశాంత్ కిషోర్ పనిచేసిన పార్టీలు అన్నీ ఆయా ఎన్నికల్లో గెలుపు గుర్రాలే అన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఆయన వ్యూహాలే పనికొస్తే బిహార్ లో కనీసం ఒక స్థానంలో అయినా డిపాజిట్ తెచ్చుకునే పరిస్థితి ఉండేదని అంటున్నారు.

గుజరాత్ లో కానీ, బెంగాల్, తమిళనాడు.. చివరికి ఏపీలో ఆయన పనిచేసినప్పుడు ఆయా రాష్ట్రాల్లో విజయం సాధిస్తారన్న పార్టీల పంచన చేరి వారి క్రెడిట్ ను ప్రశాంత్ కిషోర్ కొట్టేసినట్లు అర్థమవుతోందని అంటున్నారు. ఆ సమయంలో ప్రశాంత్ కిషోర్ పనిచేయకపోయినా, ఆయా పార్టీలు గెలిచేదే అంటున్నారు. ఇదే సమయంలో ప్రశాంత్ కిషోర్ జోక్యం వల్ల రాజకీయాల్లో నైతిక విలువలు పతనమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. తప్పుడు ప్రచారం, కులాల మధ్య కుంపట్లు, నాయకుల వ్యక్తిత్వ హననం వంటి కుసంస్కారం ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాతే మొదలైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజంగా ఆయన వ్యూహాల్లో మేజిక్ ఉంటే.. బిహార్ లో ఇంతటి దారుణ పరిస్థితి ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News