మలేషియాలో మోడీ - ట్రంప్ భేటీ లేనట్లే కానీ...!
అవును.. 47వ ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కౌలాలంపూర్ వెళ్లరని తెలుస్తోంది.;
మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో అక్టోబరు 26 నుంచి 28 వరకు 47వ ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గైర్హాజరు కానున్నట్లు తెలుస్తోంది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మోడీల మధ్య భేటీ లేనట్లేననే చర్చ మొదలైంది. షెడ్యూల్ సమస్యల వల్లే మోడీ పాల్గొనలేకపోతున్నట్లు తెలుస్తోంది.
అవును.. 47వ ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కౌలాలంపూర్ వెళ్లరని తెలుస్తోంది. బదులుగా, ఆయన వర్చువల్ గా శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. అంటే.. ఈ సంవత్సరం ప్రారంభంలో వాషింగ్టన్ భారతీయ వస్తువులపై 50% సుంకాలు విధించాలని నిర్ణయించిన తర్వాత మోడీ, ట్రంప్ ల మొదటి ఫేస్ టు ఫేస్ సంభాషణ లేనట్లేనన్నమాట.
మరోవైపు విదేశాంగ మంత్రి జైశంకర్ భారత్ కు నేరుగా ప్రాతినిధ్యం వహిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా... ఆన్ లైన్ లో ఈ కార్యక్రమానికి హాజరవుతానని ప్రధాని మోడీ తనకు తెలియజేసారని మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం ఇన్ స్టాగ్రామ్ లో ఒక ప్రకటనలో తెలిపారు. తాను ఈ నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని అన్నారు.
ఇదే సమయంలో... మలేషియా-భారతదేశం ద్వైపాక్షిక సంబంధాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలను చర్చించడానికి ఇద్దరం ఫోన్ లో మాట్లాడుకున్నట్లు అన్వర్ చెప్పారు. ఈ సందర్భంగా... సాంకేతికత, విద్య, ప్రాంతీయ భద్రతలో సన్నిహిత సహకారంతో పాటు వాణిజ్యం, పెట్టుబడిలో భారత్ తమకు ముఖ్యమైన భాగస్వామి అని ఆయన అభివర్ణించారు.
గత దశాబ్దంలో ప్రధాని మోడీ ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కాకపోవడం ఇది రెండోసారి. మరోవైపు కౌలాలంపూర్ లో జరగనున్న శిఖరాగ్ర సమావేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆసియాలోని భాగస్వామ్య దేశాల నుండి అనేక మంది నాయకులను మలేషియా ఆహ్వానించింది. అక్టోబర్ 26 నుండి రెండు రోజుల పర్యటన కోసం ట్రంప్ మలేషియా రాజధానికి చేరుకునే అవకాశం ఉంది.
వాస్తవానికి ఈ సదస్సు నేపథ్యంలో మలేసియాతో పాటు కంబోడియాలో కూడా పర్యటించాలని తొలుత మోడీ భావించినట్లు తెలిపారు. అయితే ఆయన తాజాగా సదస్సుకు వెళ్లనందున.. కంబోడియా పర్యటన కూడా వాయిదా పడినట్లయ్యింది! ఈ ఆసియాన్ లో మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్ లాండ్, వియత్నాం, మయన్మార్ వంటి 10 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి.