దక్షిణాదికి నాది పూచీ.. మోదీ స్పష్టీకరణ
డీలిమిటేషన్ తో దక్షిణాదికి ఎలాంటి నష్టం జరగదని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.;
డీలిమిటేషన్ తో దక్షిణాదికి ఎలాంటి నష్టం జరగదని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని విపక్షాల ఆందోళనలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. దేశమంతా ఒక్కటే, ప్రాంతీయ భేదాలు ఉండకూడదు అంటూ స్పష్టం చేశారు. తనకు ఉత్తర, దక్షిణ భారత్ అన్న తేడాలు లేవని, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్నిప్రాంతాలు సమానమేనని వెల్లడించారు.
ఇక మహిళా రిజర్వేషన్ల బిల్లుపై తనకు క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పటికే ఆలస్యమైందని, 30 ఏళ్ల క్రితమే ఈ బిల్లును తీసుకురావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. దేశ చరిత్రలో ఇదో కీలక ఘట్టమని అభివర్ణించిన ప్రధాని కాలానుగుణంగా మనం కూడా మారాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. ఇప్పటికైనా ఈ బిల్లును ఆమోదించే సువర్ణావకాశం ఈ పార్లమెంటుకు దక్కింది" అని మోదీ వ్యాఖ్యానించారు.
మహిళా సాధికారతే లక్ష్యం
వికసిత్ భారత్ అంటే కేవలం మౌలిక వసతుల కల్పన మాత్రమే కాదని, మహిళలకు అధికారం కల్పించడం కూడా అని ప్రధాని నొక్కి చెప్పారు. మహిళలకు అధికారం అప్పగిస్తే దేశానికి కొత్త మార్గం చూపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని. దేశంలోని సగం జనాభాకు నిర్ణయాధికారాల్లో భాగస్వామ్యం కల్పించడం అద్భుతమైన ఘట్టమని అభివర్ణించారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో తమకు ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవని, కేవలం మహిళల సాధికారతే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
విపక్షాలపై విమర్శలు
ఈ విషయంలో మహిళలకు అడ్డుపడే వారిని ఎప్పటికీ క్షమించరని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీల్లో రిజర్వేషన్లకు అందరూ అంగీకరించారని, లోక్ సభలో మాత్రం అడ్డుకుంటున్నారని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బిల్లులకు మద్దతిచ్చే రాజకీయ పార్టీలకే మనుగడ ఉంటుందని ప్రధాని అన్నారు. మహిళల్లో చైతన్యం పెరిగిందని, అత్యున్నత చట్టసభల్లోనూ భాగస్వామ్యం కోరుతున్నారని ప్రధాని వెల్లడించారు. బిల్లును వ్యతిరేకించిన వారిని మహిళలు శిక్షిస్తారని ప్రధాని వ్యాఖ్యానించారు.