రామ మందిరంపై ఎగిరే ధ్వజంపై గుర్తులకు ఇన్ని అర్థాలు ఉన్నాయా..?
అయోధ్య రామ మందిరం శిఖరంపై ఎగురుతున్న కాషాయ పతాకం.. ఇది కేవలం ఒక జెండా కాదు.. శతాబ్దాల వేచి చూసిన భక్తి భావన, చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీక.;
అయోధ్య రామ మందిరం శిఖరంపై ఎగురుతున్న కాషాయ పతాకం.. ఇది కేవలం ఒక జెండా కాదు.. శతాబ్దాల వేచి చూసిన భక్తి భావన, చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీక. రామ మందిర నిర్మాణం యుగాంతర ప్రయాణాన్ని ముగించి, ఇన్నాళ్ల ఎదురు చూపులకు శాశ్వత చిహ్నంలా ఆకాశాన్ని తాకింది. ధ్వజారోహణ ఘట్టం ఆలయ నిర్మాణానికి ముగింపు పలికిన పవిత్ర క్షణం. ఈ క్షణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆలయ శిఖరంపై జెండాను ఎగరవేశారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వంటి ప్రముఖులు ఈ చారిత్రాత్మక ఘట్టానికి సాక్షులుగా నిలిచారు.
11 కిలోల బరువున్న జెండా..
అయోధ్యలోని రామమందిర శిఖరంపై కాషాయ జెండా రెపరెపలాడింది. 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో కుడి కోణ త్రిభుజాకారంలో ఉన్న ఈ పతాకం 11 కిలోల బరువు ఉంది. శ్రీరాముడి శౌర్యాన్ని ప్రతిబింబించేలా బంగారు వర్ణంలో సూర్యుడి చిత్రం, దాని పక్కనే ‘ఓం’ సంకేతం, వాల్మీకి రామాయణంలో ప్రస్తావించిన కోవిదార వృక్షం ఇవి అన్నీ ఈ జెండాపై కనిపిస్తాయి. ఆధ్యాత్మికతను మరింత లోతుగా ప్రతిధ్వనింపజేస్తాయి. కాషాయం రంగు స్వయం ధర్మాధికారం, త్యాగం, సంస్కృతికి చిరునామా. ఈ పతాకం రామరాజ్య ఆదర్శాల నిలువెత్తు అద్దం.
42 అడుగుల ఎత్తులో ధ్వజం..
రామమందిర శిఖరంపై 42 అడుగుల ఎత్తున ఉన్న స్తంభంపై ఈ జెండాను ఎగురవేశారు. ఇది సాధారణ రోజుల్లో జరిగే కార్యం కాదు. ‘అభిజీత్ ముహూర్తం’ అతి పవిత్రమైన ఈ సమయాన్ని ఎన్నుకుని ధ్వజారోహణ చేశారు. ఈ ముహూర్తం భగవంతుడి అనుగ్రహానికి సంకేతంగా భావిస్తారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన సన్యాసులు, సాధువులు, రామజన్మభూమి ట్రస్ట్ సభ్యులు, వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమానికి సాక్షులుగా నిలిచారు. ఇదే సందర్భంలో ఆలయంలోని 44 ద్వారాలు పూజలకు తెరుచుకోవడం ఒక ఆధ్యాత్మిక స్పర్శను కలిగించింది.
ధ్వజంపై గుర్తుల్లో అర్థం ఇదే..
ఈ జెండాకు కథ ఉంది. శ్రీరాముడు సూర్యవంశానికి ప్రాతినిధ్యం వహించినందున ఈ పతాకంపై సూర్యుడిని బంగారు కిరణాల్లా చిత్రీకరించారు. ‘ఓం’ వంటి ఆధ్యాత్మిక అక్షరం భారత సంస్కృతిని శతాబ్దాలుగా మోసుకొస్తున్న శక్తి. కోవిధార వృక్షం పవిత్రత, శ్రేయస్సు, రామరాజ్య స్థాపనకు సంకేతం. ఇవన్నీ జెండాలో ప్రతిబింబించడంతో అది ఒక సాధారణ పతాకం కాకుండా.. అయోధ్య ఆధ్యాత్మికతను ఆకాశంలోనూ ప్రతిధ్వనించే సార్వభౌమ చిహ్నంగా నిలిచింది.
తయారు చేసిన పారాచూట్ కంపెనీ..
ఈ పవిత్ర కాషాయ పతాకాన్ని అహ్మదాబాద్‌లోని ఒక పారాచూట్ తయారీ సంస్థ 25 రోజుల్లో రూపొందించింది. ఇది సాధారణ ఫాబ్రిక్ కాదు సూర్యరశ్మి, వర్షం, బలమైన గాలులను తట్టుకునేలా శక్తివంతమైన పారాచూట్ గ్రేడ్ ఫాబ్రిక్, ప్రీమియం సిల్క్ దారాలతో తయారైంది. 11 కిలోల బరువున్న ఈ పతాకం కోసం ఆర్మీ సీనియర్ అధికారుల సూచనలతోనే ఖచ్చితమైన స్పెసిఫికేషన్లు ఖరారయ్యాయి. రామ మందిర శిఖరంపై జెండా ఎగరవేయడం అంటే ఒక ఆధ్యాత్మిక యాత్రకు చివరి అధ్యాయం లాంటిది.
ఈ రోజునే ఎందుకు ఎగరవేశారంటే..
ఈ కార్యక్రమంలో మరో ప్రత్యేకత ఉంది. ఇది తండ్రి శ్రీరాముడు మాతా సీతాదేవి వివాహ దినోత్సవమైన వివాహ పంచమి సందర్భంగా ఎగురవేశారు. రాములోరి జంట పవిత్ర బంధానికి సాక్ష్యంగా నిలిచే రోజు రామమందిరం కూడా తన శాశ్వత చిహ్నాన్ని ఆకాశంలో ఎగురవేసింది. కార్యక్రమానికి ముందు ప్రధాని మోడీ ఆలయ ప్రాంగణంలోని కొత్తగా నిర్మించిన సప్తమందిరంలో పూజలు నిర్వహించారు. అయోధ్యలో ఎగిరిన ఈ కాషాయ జెండా ఇది కేవలం ఒక దృశ్యం కాదు. ఇది ఒక యుగం ముగింపు, మరో యుగం ఆరంభం. ఇది చరిత్ర గాయాలకు పరమశాంతి, భక్తి అంకితభావానికి మహాసమ్మానం. రామ మందిర నిర్మాణ ప్రయాణం అధికారికంగా ముగిసినా కాషాయ జెండా రెపరెపలాడేంతకాలం ఆధ్యాత్మికత, సాంస్కృతిక గర్వం, భారతీయత ఆకాశంలో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది.