వంగవీటి బ్రాండ్ ఇక జనసేన సొంతం.. డిప్యూటీ సీఎం ద్విముఖ వ్యూహం!
విజయవాడ మేయర్ గా వంగవీటి రాధాకృష్ణను నిలపడం ద్వారా పవన్ రాజకీయంగా పట్టు బిగించే వ్యూహాన్ని అమలు చేశారని అంటున్నారు.
స్థానిక ఎన్నికల సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహాలు ఆసక్తి రేపుతున్నాయి. పార్టీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేసుకోవడంతోపాటు తన సొంత సామాజిక వర్గం మొత్తాన్ని తనవైపు తిప్పుకునేలా పవన్ పావులు కదుపుతున్నారని అంటున్నారు. స్థానిక ఎన్నికలు పార్టీ శ్రేణుల కోసమేనని గతంలోనే చెప్పిన పవన్, కేడర్ కు గుర్తింపు, గౌరవం ఇచ్చేలా కీలకమైన స్థానాలను దక్కించుకున్నారని చెబుతున్నారు. కార్పొరేషన్లు, మున్సిపల్ చైర్మన్ స్థానాలతోపాటు ఆయా పట్టణ సంస్థల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ పదవులలో గౌరవప్రదమైన సంఖ్యలో స్థానాలు తీసుకుని పార్టీని పూర్తిస్థాయిలో విస్తరించేలా పవన్ అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. ప్రధానంగా విజయవాడ కార్పొరేషన్ దక్కించుకున్న జనసేనాని ఆ స్థానంలో మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణను ఎంపిక చేయడంలో తిరుగులేని వ్యూహాన్ని రచించారని అంటున్నారు.
విజయవాడ, వంగవీటి పవన్ ద్విముఖ వ్యూహం
రాష్ట్రంలో కీలకమైన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ను పొత్తుల్లో భాగంగా దక్కించుకోవడం ద్వారా జనసేనాని వ్యూహం స్పష్టమవుతోందని అంటున్నారు. గోదావరి జిల్లాల తర్వాత కాపుల ప్రభావం ఎక్కువగా ఉండే విజయవాడ నగరంలో జనసేన జెండా ఎగరవేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఆ సామాజిక వర్గంపై బలమైన ముద్ర వేయాలని పవన్ భావిస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో వంగవీటి బ్రాండ్ ను సొంతం చేసుకోవడం ద్వారా కాపుల్లో తన ఇమేజ్ మరింత పెంచుకునే దిశగా అడుగులు వేశారని చెబుతున్నారు. దీనివల్ల కాపు సామాజికవర్గాన్ని పవన్ ఆకర్షించారని అంటున్నారు. ఇప్పటికే ఆ సామాజికవర్గంలో పవన్ పట్ల సానుకూల వైఖరి ఉందని, తాజా నిర్ణయాల వల్ల చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నప్పటికీ తొలగిపోయే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు.
వంగవీటి ముద్రపై శాశ్వత పట్టు
విజయవాడ మేయర్ గా వంగవీటి రాధాకృష్ణను నిలపడం ద్వారా పవన్ రాజకీయంగా పట్టు బిగించే వ్యూహాన్ని అమలు చేశారని అంటున్నారు. రాష్ట్రంలో వంగవీటి బ్రాండ్ కు పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్నారని, ఇన్నాళ్లు తమ నాయకుడు వంగవీటి మోహనరంగా వారసులకు సరైన గుర్తింపు లేదని వారిలో ఆవేదన ఉండేదని అంటున్నారు. ఈ కారణంగా నామినేటెడ్ పదవుల పందేరం జరిగిన ప్రతిసారి వంగవీటి వారసుడిగా మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ పేరు ప్రముఖంగా వినిపించేదని అంటున్నారు. అయితే రకరకాల సమీకరణాలతో వంగవీటి పేరు వెనక్కి వెళ్లిపోయేదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మేయర్ గా వంగవీటి రాధాకృష్ణ పేరు తెరపైకి తీసుకురావడమే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబును ఒప్పించారని చెబుతున్నారు. అదేసమయంలో వంగవీటిని టీడీపీ నుంచి జనసేనలోకి తీసుకురావడం కూడా పవన్ రాజకీయ చాణక్యానికి నిదర్శనంగా చెబుతున్నారు. దీనిద్వారా వంగవీటి బ్రాండ్ ను జనసేనాని సొంతం చేసుకున్నారని అంటున్నారు.
విజయవాడ నగరంపై పట్టు
రాష్ట్ర రాజకీయాల్లో విజయవాడ నగరం అత్యంత కీలకం. రాష్ట్ర రాజకీయాలకు విజయవాడే కేంద్రం. ఒకప్పుడు వ్యాపార, వాణిజ్య కేంద్రంగా విలసిల్లిన విజయవాడ రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర రాజకీయాలకు కేంద్రంగా మారింది. రాజధానికి సమీపంలో ఉన్న ఈ నగరంలోనే పెద్ద సంఖ్యలో నేతలు, ఉద్యోగులు నివసిస్తున్నారు. దీంతో విజయవాడ నగరానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రాముఖ్యత పెరిగింది. ఇలాంటి నగరంపై జనసేన జెండా ఎగురవేస్తే ఆ ప్రభావం రాష్ట్రం మొత్తం ఉంటుందని జనసేనాని పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారని అంటున్నారు. అందుకే తమ పార్టీ నేతలు ఎక్కువగా మచిలీపట్నం కార్పొరేషన్ కావాలని తొలి నుంచి హడావుడి చేసినప్పటికీ పవన్ మౌనంగా తన వ్యూహాన్ని అమలు చేశారని అంటున్నారు. పార్టీ అవసరాల రీత్యా విజయవాడ జనసేనకే దక్కాలనే ఆలోచనతో ముందుగా సరైన అభ్యర్థిని వెతికి ఆ తర్వాత ఆయన పేరుతో టీడీపీని ఒత్తిడి చేశారని అంటున్నారు. దీంతో వంగవీటి విషయంలో టీడీపీ అధిష్టానం వ్యతిరేకించలేక విజయవాడ కార్పొరేషన్ ను జనసేనకు అప్పగించిందని చెబుతున్నారు.