పవన్ అంటే ప్రకటనలు.. విమర్శలే కాదు.. ఈ యాంగిల్ కూడా ఉంది

అయితే పవన్ ఆదేశాల ప్రకారం షిప్ ను సీజ్ చేసే అధికారం రాష్ట్ర అధికారులకు లేకపోవడంతో అప్పట్లో పవన్ లక్ష్యంగా విపక్షం పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసింది.;

Update: 2025-10-12 08:30 GMT

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పూర్తిగా అధికార బాధ్యతల్లో ఇమిడిపోతున్నారు. పార్టీ పెట్టి పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న పవన్.. గత 15 నెలలుగా అధికారంలో కొనసాగుతున్నారు. అయితే తొలినాళ్లలో అధికారిక విధుల్లో కాస్త తడబాటు ప్రదర్శించిన పవన్ ఇప్పుడు పూర్తిస్థాయి అడ్మినిస్ట్రేటరుగా మారిపోయినట్లు కనిపిస్తున్నారు. ఇతర రాజకీయ నాయకులు మాదిరిగా ప్రజలల్లోకి వెళ్లినప్పుడు హామీలు గుప్పించడం, ఆ తర్వాత విస్మరించడం అనే పద్ధతి పవన్ లో ఎక్కడా కనిపించడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ మాట ఇచ్చారంటే చేసి చూపిస్తారన్న టాక్ సొంతం చేసుకుంటున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలనపై అవగాహన పెంచుకుంటున్నట్లు ఇన్నాళ్లు చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్ ఇప్పుడు పూర్తిస్థాయి పరిపాలన దక్షతను ప్రదర్శిస్తున్నారు. ఉపముఖ్యమంత్రి హోదాలో ఎక్కడికి వెళ్లినా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న పవన్.. వాటి పరిష్కారానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా కాకినాడ జిల్లాలో సముద్ర కాలుష్యంపై క్షేత్ర స్థాయి పర్యటన చేసి వచ్చిన పవన్.. రెండు రోజుల్లోనే రంగంలోకి దిగారు. మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయంలో పీసీబీ అధికారులతో సమీక్షించి కాలుష్యం నివారణకు పకడ్బందీ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా ఉప్పాడ మత్స్యకారుల సమస్యను పరిష్కరించేందుకు రెడీ చేయబోయే నమూనా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కాలుష్యం నివారణకు కూడా వినియోగించుకునేలా ఉండాలని ఆయన దిశా నిర్దేశం చేశారు.

అధికారంలోకి వచ్చిన కొత్తలో క్షేత్రస్థాయి పర్యటనల్లో జోరు చూపించిన పవన్.. కాకినాడలో రేషన్ బియ్యం పట్టుబడిన సమయంలో సముద్రంలోకి వెళ్లి ‘సీజ్ ద షిప్’ అన్న ఆదేశాలతో అందరిని ద్రుష్టిని ఆకర్షించారు. అయితే పవన్ ఆదేశాల ప్రకారం షిప్ ను సీజ్ చేసే అధికారం రాష్ట్ర అధికారులకు లేకపోవడంతో అప్పట్లో పవన్ లక్ష్యంగా విపక్షం పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసింది. పరిపాలనా అనుభవం లేకపోవడం వల్లే విపక్షం ట్రోలింగుకు పవన్ దొరికిపోవాల్సివచ్చిందని అప్పట్లో అభిప్రాయపడ్డారు. అయితే ఆ తర్వాత పవన్ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించడం మొదలుపెట్టారు. విపక్షానికి మరో అవకాశం ఇవ్వకుండా అత్యంత అప్రమత్తత ప్రదర్శిస్తున్నారని అంటున్నారు.

తాజాగా మంత్రి వర్గ సమావేశంలో ‘లులు’పై తన అభ్యంతరాలను నిక్కచ్చిగా తెలియజేసిన పవన్.. ఆ వెంటనే తాను మాట ఇచ్చినట్లు ఉప్పాడ మత్స్యకారుల సమస్య పరిష్కారానికి 100 రోజుల ప్రణాళిక తయారు చేసేందుకు రంగంలోకి దిగారు. ఇవన్నీ పరిశీలిస్తే డిప్యూటీ సీఎం పవన్ లో ఎంతో మార్పు వచ్చినట్లు కనిపిస్తోందని అంటున్నారు. గతంలో సినిమా షూటింగుల కారణంగా కూడా పవన్ కొంతవరకు అందుబాటులో ఉండేవారు కాదన్న విమర్శలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఆయన సినిమా షూటింగులు కూడా పూర్తవడంతో ఇక ఫుల్ టైమ్ పాలిటిక్స్ పై ఫోకస్ చేయనున్నారని అంటున్నారు.

తాజా పరిణామాలు గమనిస్తే ఇక నుంచి పవన్ నుంచి ప్రకటనలు ఉండే అవకాశం చాలా తక్కువగా ఉందని అంటున్నారు. తన పనితనం చేతల్లో చూపించాలని భావిస్తున్న డిప్యూటీ సీఎం ఎక్కువగా అధికారిక విధులకు సమయం వెచ్చించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ పనితీరు రాజకీయ వర్గాలలో ఆసక్తి రేపుతోందని చెబుతున్నారు.

Tags:    

Similar News