వైఎస్సార్ ప్రస్తావన పవన్ ఎందుకు తెచ్చినట్లు ?
తాను ఈ రోజున రాజకీయాల్లో లేనని ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వారి కంటే సీనియర్ ని అని చెప్పే ప్రయత్నంలో పవన్ రాజమండ్రిలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
వైఎస్సార్ దివంగతులు అయి ఇప్పటికి అక్షరాల పదిహేడు ఏళ్ళు కావస్తోంది. ఆయన ఉమ్మడి ఏపీకి కేవలం అయిదుంపావు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆయన గురించి ఈ రోజుకీ తెలుగు రాజకీయాల్లో ఏదో ఒక సందర్భంలో అంతా చర్చించుకుంటూనే ఉంటారు. వైఎస్సార్ పేరు మీద ఒక పార్టీని పెట్టి ఆయన కుమారుడు వైఎస్ జగన్ విజయవంతంగా నడుపుతున్నారు. ఆ పార్టీ తరఫున 151 సీట్లతో ఏకంగా ముఖ్యమంత్రి కూడా అయ్యారు. 2024 లో వైసీపీ ఓటమి పాలు అయినా 40 శాతం ఓటు షేర్ తో ఈ రోజుకీ బలంగా ఏపీ రాజకీయాల్లో నిలిచింది అంటే దాని వెనక వైఎస్సార్ చరిష్మా చాలానే ఉందని కూడా అంతా విశ్లేషిస్తారు. వైఎస్సార్ వారసత్వం వైసీపీ పూర్తిగా అందుకుంటోంది. కాబట్టి సందర్భాన్ని బట్టి వైఎస్సార్ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు సందర్భాలలో వైఎస్సార్ ప్రస్తావన తెస్తూ ఉంటారు. దాని వెనక వ్యూహం ఏమిటి అన్నది కూడా చర్చగా సాగుతోంది.
ఆనాడే తెగించి వచ్చా :
తాను ఈ రోజున రాజకీయాల్లో లేనని ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వారి కంటే సీనియర్ ని అని చెప్పే ప్రయత్నంలో పవన్ రాజమండ్రిలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా చూస్తే పవన్ 2008 లో వచ్చిన వారుగా చూడాలి. ఆయన యువ రాజ్యం పార్టీ అధినేతగా అరంగేట్రం చేశారు. ఆ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ వైఎస్సార్ ఉన్నపుడే తాను తెగించి రాజకీయం చేశాను అని అన్నారు. తన లైసెన్స్డ్ గన్ కూడా సరెండర్ చేసి మరీ రాజకీయాల్లోకి వచ్చాను అంటే ఎంత ధైర్యం ఉండాలో ఆలోచించుకోవాలని అన్నారు. అంతే కాదు 2009 ఎన్నికల తరువాత వైఎస్సార్ రెండోసారి సీఎం అయ్యారని అపుడు కూడా తాను హైదరాబాద్ లోనే ఉన్నాను అని అన్నారు. ఎక్కడికీ పారిపోలేదని కూడా ఆయన చెబుతూ తాను రాజకీయంగా అంతటి తెగింపుతో ఉంటాను అని చెప్పారు.
వైసీపీ కోసమేనా :
వైసీపీకి జనసేన అంటే ఒక గట్టి ప్రత్యర్థిగానే చూస్తుంది. అదే సమయంలో పవన్ వర్సెస్ జగన్ అన్నది ఉండనే ఉంది. ఇక లేటెస్ట్ గా ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన కామెంట్స్ లో జగన్ అరెస్టు కోసం జనసేన కోరింది అని విశ్లేషణ ఉంది. ఆ తరువాత ఆయన ఉప సంహరించుకున్నా దాని మీదనే జనసేన ఈ రోజుకీ మాట్లాడుతోంది. అందుకే రాజమండ్రిలో జరిగిన సమావేశంలో కూడా పవన్ భయం అన్నది తనకు లేదని చెబుతూ వైఎస్సార్ లాంటి వారితోనే రాజకీయ పోరాటం చేసిన తనకు ఇపుడు మరెవరి మీదనో ఆలోచించే పరిస్థితి ఉంటుందా అన్నది చెప్పే క్రమంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు అని అంటున్నారు. అంటే ఒక విధంగా వైఎస్సార్ కంటే బలమైన పోటీ కానీ ధీటైన రాజకీయం కానీ వైసీపీ కాదని అన్నట్లుగా కూడా భావించాలని అంటున్నారు.
పైగా తాను వైసీపీ కంటే సీనియర్ రాజకీయ నాయకుడిని అని కూడా గతంలోనూ ఇపుడూ పవన్ చెబుతూ వస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే వైఎస్సార్ తో పవన్ రాజకీయ పోరాటం అంటే 2009 ఎన్నికల సమయంలో ఆయన చేసిన ప్రచారం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఎన్నికల రాజకీయాల్లో భాగంగానే అంతా చూశారు.ఇక 2009 లో అధికారలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్ మరణించారు. అలా చూస్తే వైఎస్సార్ తో గట్టిగా పవన్ చేసిన రాజకీయం కొద్ది నెలలు మాత్రమే అని అది కూడా ఎన్నికల సందర్భమే అని అంటున్న వారూ ఉన్నారు. అయితే వైఎస్సార్ కంటే మీరు గొప్పా అని వైసీపీ వారిని ఎద్దేవా చేయడానికి పవన్ పెద్దాయన ప్రస్తావన అవసరమైన సందర్భాలలో తేవడం జరుగుతోంది అని అంటున్నారు.