మౌనమేల నోయి: పంచాయతీల్లో పనులకు బ్రేక్
ఇబ్బడి ముబ్బడిగా నిధులు వచ్చాయి. 15వ ఆర్థిక సంఘం నుంచి మరో 1800 కోట్ల రూపాయలు రాష్ట్రానికి చేరుకున్నాయి.;
ఇబ్బడి ముబ్బడిగా నిధులు వచ్చాయి. 15వ ఆర్థిక సంఘం నుంచి మరో 1800 కోట్ల రూపాయలు రాష్ట్రానికి చేరుకున్నాయి. ఇక, రాష్ట్రం ఇచ్చే 10 శాతంగ్రాంటును కలుపుకొంటే.. ఈ సొమ్ములు 2000 కోట్ల వరకు చేరతాయి. ఈ నిధులను పూర్తిగా పంచాయతీలకు మాత్రమే వెచ్చించాలని కేంద్రం ఆదేశించింది. గతం లోనూ 1000 కోట్ల రూపాయలకు పైచిలుకు నిధులు వచ్చాయి. వీటితో గ్రామీణ ప్రాంతాల్లో పనులు చేపట్టారు. ఇక, ఇప్పుడు వచ్చిన 1800 కోట్ల రూపాయలతో మరింతగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడింది.
అయితే.. ఎక్కడా ఆ ఊపు మాత్రం కనిపించడం లేదు. పంచాయతీల్లో పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇప్పటికే చేపట్టిన పనులు పూర్తి చేసి.. ఇక, చేయలేమని చెప్పేయాలన్న ఆలో చనలో చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎవరిలోనూ సంతోషం లేదు. ఎవరిలోనూ పనులు దక్కాయన్న ఆనందం కూడా కనిపించడం లేదు. దీనికి కారణం.. ప్రభుత్వం లెక్కలు చూసుకు ని, కేంద్రం చెప్పిన మేరకు, కేంద్రం ఇచ్చిన ప్రణాళిక మేరకు.. నిధులు వెచ్చించాలి.
ఇదే అసలు సమస్యగా మారింది. సాధారణంగా.. ప్రబుత్వ కాంట్రాక్టులు అంటే.. అధికారుల నుంచి నాయకుల వరకు ఎంతో కొంత కమీషన్లు, ముడుపులు ఇవ్వక తప్పదు. గ్రామీణ స్థాయిలో అయితే.. ఇది మరింత ఎక్కువగా ఉంటోంది. అయినా.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శాఖ కావడంతో ఈ బెడద అంతగా లేకపోయినా.. మరీ లెక్కలు చూసి.. గీసి గీసి.. నిధులు ఇస్తుండడంతో తమకు కనీసం కూలి కూడా పడడం లేదని కాంట్రాక్టులు వాపోతున్నారు. దీనిని సమీక్షించాలని కోరుతున్నారు.
కానీ, తమ చేతుల్లో ఏమీ లేదని.. కేంద్రం చెప్పినట్టు ఖర్చు చేయాల్సిందేనని.. పంచాయతీ రాజ్ అధికారులు వెల్లడిస్తున్నారు.ఈ వ్యవహారంపై పవన్ కల్యాణ్ మౌనంగా ఉన్నారు. మరోవైపు.. 1800 కోట్లను వచ్చే ఆరు మాసాల్లో వెచ్చించాలి. ఈలోగా రాష్ట్ర సర్కారు 200 కోట్లను తన గ్రాంటుగా అందించాలి. ఈ రెండు కనుక ఆరు మాసాల్లో పూర్తిచేయకపోతే.. ఆ నిధులు వెనక్కి పోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది పవన్ ముందు పెద్ద పరీక్షగా మారింది. ఏం చేస్తారో చూడాలి.