మాల వేసుకుంటే సెలవు తీసుకోండి.. టీపోలీస్ శాఖ ఉత్తర్వు

అయ్యప్ప మాలతో సహా ఇతర ఆధ్యాత్మిక దీక్షలు తీసుకునే వారి విషయంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ నుంచి వచ్చిన ఆదేశాలు ఇప్పుడు చర్చగా మారాయి.;

Update: 2025-11-26 09:50 GMT

అయ్యప్ప మాలతో సహా ఇతర ఆధ్యాత్మిక దీక్షలు తీసుకునే వారి విషయంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ నుంచి వచ్చిన ఆదేశాలు ఇప్పుడు చర్చగా మారాయి. అయ్యప్ప మాల వేసుకునే పోలీసులు విధుల నుంచి సెలవు తీసుకోవాలని తన సిబ్బందికి సూచన చేసింది. జుట్టు పెంచుకొని.. యూనిఫామ్ కు బదులుగా సాధారణ దుస్తులు ధరించి.. కాళ్లకు బూట్లు లేకుండా విధులకు వచ్చేందుకు అనుమతి లేదని పేర్కొంది. దీనికి సంబంధించిన ఉత్తర్వుల్ని జారీ చేసింది. అసలీ పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలంగాణ పోలీసు శాఖ ఈ ఉత్తర్వుల్ని ఎందుకు జారీ చేసింది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. విషయం హైదరాబాద్ పరిధిలోని కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి ఆగుతుంది.

కంచన్ బాగ్ ఎస్ఐ క్రిష్ణకాంత్ అయ్యప్ప దీక్ష తీసుకున్నారు. దీక్ష నియమాలను పాటిస్తూ విధులకు హాజరయ్యేందుకు అనుమతి కోరుతూ ఆయన ఉన్నతాధికారులకు ఒక వినతి పంపారు. ఆ వినతిని తిరస్కరించిన ఉన్నతాధికారులు నిబంధనలపై పోలీసు సిబ్బంది అందిరకి స్పష్టత ఇస్తూ ఒక మోమోను ఇటీవల జారీ చేశారు. అయ్యప్ప మాట సహా మరే అధ్యాత్మిక దీక్షలు తీసుకునే పోలీసులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు కూడా ఆ దీక్ష నియమాలు పాటించాలని భావిస్తే.. సెలవు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ అంశంపై తెలంగాణ పోలీసు శాఖ స్పందించిన తీరుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయ్యప్ప మాల దీక్ష సమయంలో ఇలా చేస్తున్నారని.. రంజాన్ సమయంలో ఈ నిబంధనలు ఎందుకు రావు అని ప్రశ్నిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. ఒక వర్గాన్ని మాత్రమే నిబంధనలు విధించి.. మరో వర్గం విషయంలో సానుకూలంగా ఉండటం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చ మొదలైంది.

Tags:    

Similar News