బరువు పెరిగి, క్యారెట్స్ తగ్గిన నోబెల్ గోల్డ్ మెడల్ గురించి తెలుసా?
నోబెల్ బహుమతికి ఉన్న ప్రత్యేకత, గొప్పతనం గురించి దాదాపు చాలామందికి తెలిసిందే. తాజాగా ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడోను వరించింది;
నోబెల్ బహుమతికి ఉన్న ప్రత్యేకత, గొప్పతనం గురించి దాదాపు చాలామందికి తెలిసిందే. తాజాగా ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడోను వరించింది. అయితే గతంలో ఎన్నడూ లేని స్థాయిలో అన్నట్లుగా ఈ సారి ఈ బహుమతి హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం అమెరికా అధ్యక్షుడు ఈ అవార్డు తనను వరిస్తుందని, వరించాలని చెప్పడం!
అవును... ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి తనను మించిన అర్హులు ఇంకెవరంటూ తనకు తాను కితాబిచ్చుకున్నారు ట్రంప్. మరోవైపు అధ్యక్షుడు ట్రంప్ తన ఆరు నెలల పదవీకాలంలో సగటున నెలకు ఒక శాంతి ఒప్పందం లేదా సీజ్ ఫైర్ కు మధ్యవర్తిత్వం వహించారని.. ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేందుకు ఇదే సరైన అవకాశం అని ఆగస్టు నెలలో వైట్ హౌస్ నుంచి ప్రకటన వచ్చింది.
ఆ సంగతి అలా ఉంటే... నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలకు ఏమిస్తారు? అగ్రరాజ్యం అధినేత, ప్రపంచం పెద్దన్న డొనాల్డ్ ట్రంప్ ఆ స్థాయిలో ఈ బహుమతిపై ఎందుకు మనసు పడ్డారు? ఆ బహుమతి విశిష్టత ఏమిటి? మొదలైన విషయాలను ఇప్పుడు పరిశీలిద్దామ్..!
మొత్తం ఆరు రంగాల్లో బహుమతులు!:
నోబెల్ బహుమతులను మొత్తం ఆరు రంగాల్లో ప్రకటిస్తారు. ఇందులో భాగంగా.. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, శాంతి, సాహిత్యం విభాగాల్లో విశేష కృషి చేసినవారికి ఏటా ఈ బహుమతులను ప్రదానం చేస్తారు. ఆల్ ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న విజేతలకు అవార్డులను అందజేస్తారు. నోబెల్ ప్రైజ్ గ్రహీతలకు బంగారు పతకం, ప్రశంసా పత్రం తో పాటు నగదు బహుమతి అందజేస్తారు!
నగదు బహుమతి!:
నోబెల్ బహుమతి గెలుచుకున్నవారికి భారీగా నగదు అందిస్తారు. ఇందులో భాగంగా అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్ క్రోన్ లు అంటే.. భారత కరెన్సీలో సుమారు 10 కోట్ల రూపాయల నగదు అందుతుంది. ఒక్కోసారి నోబెల్ బహుమతికి ఒకరి కన్నా ఎక్కువ మందిని ఎంపిక చేసినప్పుడు ఆ డబ్బును సమంగా పంచుతారు.
ప్రశంసా పత్రం:
ఈ బహుమతి గెలుచుకున్నవారికి నగదుతో పాటు ఒక ప్రశంసా పత్రాన్ని కూడా బహూకరిస్తారు. దీన్ని పూర్తిగా చేతితోనే తయారు చేయగా.. ఇందులో అవార్డు గ్రహీత పేరు, రంగంతో పాటు అందులో వారు చేసిన కృషికి సంబంధించిన వివరాలు పొందుపరుస్తారు.
గోల్డ్ మెడల్:
ప్రధానంగా నోబెల్ బహుమతి పొందిన వారికి ఓ ప్రత్యేకమైన గోల్డ్ మెడల్ ను బహూకరిస్తారు. 18 క్యారెట్ల బంగారంతో తయారు చేయబడిన ఈ మెడల్ పై నోబెల్ ప్రైజ్ వ్యవస్థాపకుడు "ఆల్ఫ్రెడ్ నోబెల్" చిత్రం ఉంటుంది.
అయితే తొలుత ఈ పతకాన్ని 23 క్యారెట్ల బంగారంతో తయారు చేయగా.. దాని బరువు 192 గ్రాములుగా ఉండేది. ఆ తర్వాత 1980లో చేసిన మార్పుల్లో భాగంగా... 18 క్యారెట్ల బంగారంగా మార్చడంతోపాటు దాని బరువుని 192 గ్రాముల నుంచి 196 గ్రాములకు పెంచారు.
కాగా... 1896లో ఆల్ ఫ్రెడ్ నోబెల్ మరణించగా, 1901 నుంచి ఆయన జ్ఞాపకార్థం ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. అయితే... నోబెల్ శాంతి బహుమతిని నార్వే రాజధాని ఒస్లోలో బహుకరించగా.. మిగిలిన అవార్డులను స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ లో బహూకరిస్తారు.