అవిశ్వాసం తీర్మానంలో లోపాలు...తిరస్కరిస్తారా ?

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మీద అవిశ్వాసం తీర్మానం విపక్షాలు పెట్టాయి. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత లోక్ సభ స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నారు.;

Update: 2026-02-12 03:52 GMT

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మీద అవిశ్వాసం తీర్మానం విపక్షాలు పెట్టాయి. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత లోక్ సభ స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నారు. చివరిగా చూస్తే రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉండగా ఆనాటి లోక్ సభ స్పీకర్ బలరాం జక్కడ్ మీద విపక్షాలు అన్నీ కలసి అవిశ్వాసం పెట్టాయి. ఆ తీర్మానం వీగిపోయింది. కానీ అది చరిత్రలో నిలిచిపోయింది. మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత ఓం బిర్లా మీద అవిశ్వాస తీర్మానం పెట్టే పరిస్థితి వచ్చింది.

ఓం బిర్లా రికార్డు :

లోక్ సభ స్పీకర్ గా వరసగా రెండు సార్లు కొనసాగడం ఒక రికార్డుగా ఓం బిర్లాకు ఉంది. ఆయన 2019 నుంచి 2014 వరకూ ఒక టెర్మ్ లో విజయవంతంగా పనిచేశారు. దాంతో ఆయనకే మరోసారి చాన్స్ ఇవ్వాలని బీజేపీ అనుకుంది. అలా 2024 నుంచి మరోసారి ఆయన లోక్ సభ స్పీకర్ గా కార్యక్రమాలు నడుపుతున్నారు. గత టెర్మ్ లో కూడా సాగు నీటి చట్టాల మీద అనేక సెషన్లలో అధికార ఎన్ డీయే విపక్ష ఇండియా కూటమి మధ్య తీవ్రమైన గ్యాప్ ఏర్పడి సభా కార్యక్రమాలు మొత్తం వాయిదాలతోనే సాగాయి. అయినా ఓం బిర్లా మీద విపక్షాల చూపు పడలేదు, ఈసారి మాత్రం కేవలం ఇరవై నెలల వ్యవధిలోనే ఓం బిర్లా మీద అవిశ్వాసం అంటే ఆయన ఎంతో నొచ్చుకున్నట్లుగా చెబుతున్నారు. దాంతో ఇది కూడా రికార్డుగానే ఉంది. ఇక పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అయితే ఇది లోక్ సభ స్పీకర్ ఆఫీసు గౌరవాన్ని తగ్గించడమే అని ఫైర్ అయ్యారు.

లోపాలతోన్న నోటీసు :

ఇదిలా ఉంటే స్పీకర్ మీద విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులో ఎన్నో లోపాలు ఉన్నాయని లోక్ సభ ఆఫీసు గుర్తించింది. మామూలుగా అయితే ఈ నోటీసుని తిరస్కరిస్తారు. కానీ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మాత్రం అలా చేయవద్దని నోటీసులో ఉన్న లోపాలను సవరించాలని లోక్ సభ సెక్రటేరియట్ కి సూచించారు అని అంటున్నారు. ఇంతకీ నోటీసులో లోపాలు ఏమిటి అంటే కొన్ని విషయాలను కొన్ని సందర్భాలను అనేక సార్లు పదే పదే సభ్యులు ప్రస్తావించారు అని అంటున్నారు.

సవరించిన తరువాత డేట్ :

ఇక లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆ నోటీసుని సవరించిన తరువాత నిబంధనల ప్రకారం దానిని పరిశీలిస్తామని అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. మార్చి 9 నుంచి పార్లమెంట్ రెండవ విడత బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతోంది. దాంతో తొలి రోజునే స్పీకర్ మీద అవిశ్వాసం తీర్మానం చర్చ ఉంటుందని అంటున్నారు. ఒక రోజా లేదా రెండు రోజులా అన్నది కూడా నిర్ణయిస్తారు. ఆ మీదట ఫలితం బట్టి లోక్ బిర్లా తిరిగి స్పీకర్ చెయిర్ లో ఆశీనులు అవుతారు అని అంటున్నారు.

ప్యానల్ స్పీకర్లతోనే :

ఇక ఓం బిర్లా బుధవారం నుంచి సభకు దూరంగా ఉండడంతో ప్యానల్ స్పీకర్లతో సభ నడుస్తోంది. బడ్జెట్ మీద చర్చకు ప్యానల్ స్పీకర్ చెయిర్ అనుమతించింది. ఓం బిర్లా తప్పుకున్న తరువాత చర్చకు విపక్షాలు కూడా అంగీకరించి ప్రసంగాలు చేయడం విశేషం. ఇక బడ్జెట్ మీద చర్చలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొని రిప్లై ఇచ్చారు. ఇక ఎన్ డీయే నుంచి మంత్రులు హాజరైనా అగ్ర నేతలు అమిత్ షా రాజ్ నాధ్ సింగ్ లాంటి వారు అయితే సభకు రాలేదని అంటున్నారు.

Tags:    

Similar News