32 కార్లతో దేశవ్యాప్తంగా సీరియల్‌ దాడుల కుట్ర: ఎన్‌ఐఏ దర్యాప్తులో సంచలనం!

పేలుడు జరిగిన హ్యుందయ్ ఐ20 కారుతో పాటు, మారుతి బ్రీజా, స్విఫ్ట్ డిజైర్, ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ వంటి వాహనాలను కూడా ఈ దాడుల్లో ఉపయోగించాలని కుట్ర పన్నారు.;

Update: 2025-11-13 13:30 GMT

ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సంచలన విషయాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో వరుస బాంబు దాడులు జరపడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో బయటపడింది. ముఖ్యంగా బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన రోజున డిసెంబర్ 6న ఈ దాడులను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

* కుట్రకు 32 కార్లు సిద్ధం

ఉగ్రవాదులు ఈ భారీ ఆపరేషన్ కోసం మొత్తం 32 కార్లను సిద్ధం చేసినట్లు విచారణ వర్గాలు తెలిపాయి. పేలుడు జరిగిన హ్యుందయ్ ఐ20 కారుతో పాటు, మారుతి బ్రీజా, స్విఫ్ట్ డిజైర్, ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ వంటి వాహనాలను కూడా ఈ దాడుల్లో ఉపయోగించాలని కుట్ర పన్నారు. ఈ కార్లు చాలా వరకు పాతవి కావడం, పలుమార్లు యాజమాన్యం మారడం వల్ల వాటి ప్రస్తుత యజమానులను గుర్తించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.

* అల్-ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా ఉగ్రచర్యలు?

ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ నబీకి చెందిన కారు హర్యానాలోని ఫరీదాబాద్ – మేవాట్ ప్రాంతంలోని అల్-ఫలాహ్ యూనివర్సిటీలో లభించింది. ఈ ప్రాంతమే ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మారి ఉండవచ్చని ఎన్‌ఐఏ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ కోణంలో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. పేలుడు పదార్థాలు దాచిపెట్టడంలో సాయపడిన మతబోధకుడు మౌల్వీ ఇష్తియాఖ్ను పోలీసులు అరెస్ట్ చేయడంతో కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది.

* వైద్యుల ముసుగులో విధ్వంస ప్లాన్

అతివాద భావజాలానికి లోనైన పలువురు వైద్యులు, విద్యార్థులు ఈ కుట్రలో భాగమయ్యారని దర్యాప్తులో తేలింది. వీరు విద్యాసంస్థల పేరుతో కార్యకలాపాలు నడిపి, యువతను రాడికలైజ్ చేసిన పక్కా ఆధారాలు నిఘా సంస్థలకు లభించాయి.

* 200 ఐఈడీల తయారీ: భారీ విధ్వంస లక్ష్యం

ఉగ్ర మాడ్యూల్ సభ్యులు ఇప్పటికే 200కి పైగా శక్తివంతమైన ఐఈడీలు తయారీలో నిమగ్నమై ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. వీటిని ఉపయోగించి దేశంలోని కీలక ప్రదేశాల్లో భారీ విధ్వంసం సృష్టించాలని పన్నాగం పన్నారు.

టార్గెట్ చేసిన ప్రదేశాలు

ఢిల్లీలోని: ఎర్రకోట, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీ శంకర్ ఆలయం... గురుగ్రామ్, ఫరీదాబాద్, దేశంలోని కీలక ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, పలు మాల్స్ ను వీరు టార్గెట్ చేశారు. ఘటనాస్థలంలో అమ్మోనియం నైట్రేట్‌తో పాటు కొత్త రకం రసాయనపు ఆనవాళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రస్తుతం ఎన్‌ఐఏ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అప్రమత్తమై, అనుమానాస్పదంగా ఉన్న 32 కార్లను గుర్తించడానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో "కార్ల వేట" ముమ్మరం చేశాయి. ఈ కుట్ర వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను ఛేదించే పనిలో దర్యాప్తు సంస్థలు నిమగ్నమై ఉన్నాయి.

Tags:    

Similar News