నేపాల్ తగలబడడానికి ‘నెపోకిడ్స్’ విలాసాలే కారణం

రాజకీయ నాయకులు దశాబ్దాలుగా ప్రజా సంక్షేమం పేరుతో కుర్చీలను దక్కించుకున్నారు. అయితే, వారసత్వ రాజకీయాన్ని ఒకవైపు భద్రపరుస్తూ, మరోవైపు విలాసాలకు విరాళమిచ్చారు.;

Update: 2025-09-12 12:30 GMT

నేపాల్‌ రాజకీయాలపై ఇటీవలి పరిణామాలు ఒక గట్టి హెచ్చరికను అందిస్తున్నాయి. అధికారం కేవలం కుటుంబాల చుట్టూ తిరిగితే.. ప్రజలు నిర్లక్ష్యానికి గురైతే, అసమానతలు విపరీతంగా పెరిగితే యువత మౌనంగా ఉండదు. అదే జరిగింది కాఠ్మండూ వీధుల్లో అని నిరూపితమైంది. నేపాల్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు కేవలం ఒక ప్రభుత్వ పతనంగా మాత్రమే చూడలేం. ఇవి దేశ రాజకీయ–సామాజిక వ్యవస్థలో లోతైన మార్పుల అవసరాన్ని సూచిస్తున్నాయి.

రాజకీయ నాయకులు దశాబ్దాలుగా ప్రజా సంక్షేమం పేరుతో కుర్చీలను దక్కించుకున్నారు. అయితే, వారసత్వ రాజకీయాన్ని ఒకవైపు భద్రపరుస్తూ, మరోవైపు విలాసాలకు విరాళమిచ్చారు. ఈ రాజకీయ నేతల పిల్లలు “నెపో కిడ్స్” లగ్జరీ జీవితాన్ని ప్రదర్శించగా, దేశంలోని యువత ఉద్యోగాల కోసం తలుపులు తట్టుకుంటూనే ఉన్నారు. సోషల్ మీడియా ఈ రెండు ప్రపంచాల మధ్య ఉన్న అసమానతను బహిర్గతం చేసింది. చివరికి, అది తిరుగుబాటు చిచ్చు పెట్టింది.

ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయడం ఒక ముఖ్యమైన సంఘటన. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే ఇది కేవలం వ్యక్తిగత రాజీనామా వరకే పరిమితమా? లేక వ్యవస్థను కదిలించే దిశగా మొదటి అడుగా? యువత డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయి. అవినీతి నిర్మూలన, రాజ్యాంగ మార్పులు, ఆర్థిక సమానత్వం. ఇవి నెరవేరకపోతే, ఈ అగ్ని మళ్లీ రగులుతుందనే సందేహం లేదు.

రాజకీయ కుటుంబాల విలాసాలు – ప్రజల కోపానికి కేంద్రబిందువు

నేపాల్‌లో నేతల కుటుంబాలు, ముఖ్యంగా వారి పిల్లలు, “నెపో కిడ్స్” పేరుతో విలాసవంతమైన జీవనశైలిని ప్రదర్శించడం యువతలో అసహనాన్ని పెంచింది. సాధారణ ప్రజలు నిరుద్యోగం, పేదరికంతో అల్లాడుతుంటే, రాజకీయ వారసుల ఖరీదైన దుస్తులు, లగ్జరీ టూర్లు, సోషల్ మీడియాలో షో ఆఫ్ చేయడం కోపాన్ని రగిలించింది.

జెన్‌జెడ్‌ పాత్ర – సోషల్ మీడియా నుంచి వీధుల వరకు

సోషల్ మీడియా నిషేధం యువతను కట్టడి చేయడానికి ప్రభుత్వ ప్రయత్నంగా కనిపించినా, అదే నిర్ణయం తిరుగుబాటుకు చిచ్చు పెట్టింది. #NepoBabiesNepal వంటి క్యాంపెయిన్‌లు ఆగ్రహాన్ని ఒకే దిశలో కేంద్రీకరించాయి. ఆన్‌లైన్ నుంచి ఆఫ్‌లైన్‌కి మారిన ఈ ఆందోళనలు, జెన్‌జెడ్‌ సమూహాన్ని ఒక కొత్త రాజకీయ శక్తిగా నిలిపాయి.

* నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు – మూల కారణాలు

నేపాల్‌లో 15–24 ఏళ్ల యువతలో 20% కంటే ఎక్కువ మంది నిరుద్యోగులు. వార్షిక ఆదాయం తక్కువగా ఉండడం, వలసల పెరుగుదల, అవినీతి ఇవన్నీ అసంతృప్తికి కారణమయ్యాయి. ఈ క్రమంలో, నెపో కిడ్స్ విలాసాలు సామాజిక అసమానతకు బలమైన ప్రతీకగా మారాయి.

హింసాత్మక నిరసనలు – ప్రభుత్వ వైఫల్యం

ప్రదర్శనలను అణచడానికి ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపడం, కర్ఫ్యూలు విధించడం ఆందోళనలను మరింత పెంచింది.. 20 మందికి పైగా మరణించడం, వేలాది గాయపడడం ఇది ప్రభుత్వ అణచివేత విధానాన్ని బయటపెట్టింది. చివరికి, ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయక తప్పలేదు.

భవిష్యత్తు దిశ – మార్పు కోసం అవకాశమా?

మాజీ చీఫ్ జస్టిస్ సుషీలా కార్కి తాత్కాలిక ప్రధానిగా ఎంపిక అవుతారనే వార్తలు యువతలో ఆశలను రేకెత్తిస్తున్నాయి. కానీ ప్రధాన సవాలు ఏమిటంటే.. ఈ ఆగ్రహాన్ని రాజ్యాంగ మార్పులు, అవినీతి విచారణలు, ఆర్థిక సంస్కరణలు వంటి వ్యవస్థాగత మార్పులుగా మలచగలరా అన్నది.

నేపాల్‌లో “నెపో కిడ్స్” పై తిరుగుబాటు కేవలం రాజకీయ వారసత్వాన్ని ప్రశ్నించడం మాత్రమే కాదు; అది సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం కోసం యువత పోరాటం. ఈ సందర్భం దక్షిణాసియా రాజకీయాలకు ఒక గట్టి హెచ్చరిక.. అసమానతలు పెరిగితే, యువత సామాజిక మాధ్యమాలనుంచి వీధుల్లోకి వస్తారు.

Tags:    

Similar News