నర్శీపట్నంలో సై అంటున్న చింతకాయల తోటికోడళ్ళు

నర్శీపట్నం అంటేనే స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సొంత ఇలాకా అని చెప్పాల్సి ఉంటుంది.

Update: 2026-10-16 02:33 GMT

నర్శీపట్నం అంటేనే స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సొంత ఇలాకా అని చెప్పాల్సి ఉంటుంది. పాతికేళ్ళ ప్రాయంలోనే ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచిన ఇపుడు ఏడు పదుల వయసులో కూడా ఎమ్మెల్యేగా గెలిచి స్పీకర్ పదవిలో ఉన్నారు అంటే ఇంతటి సుదీర్ఘ రాజకీయ జీవితం అంతా నర్శీపట్నం ప్రజలు చూపించిన ఆదరాభిమానాలే అని ఆయన చెబుతారు. ఇక నర్శీపట్నం నియోజకవర్గానికి గుండెకాయ నర్శీపట్నం మునిసిపాలిటీ. అంతకు ముందు ఇది గ్రామ పంచాయతీగా ఉన్నప్పటి నుంచే చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబం చేతిలో ఉండేది. అయ్యన్న పాత్రుడి తాత లచ్చాపాత్రుడు చాలా ఏళ్ల పాటు సర్పంచు గా పనిచేశారు. అయ్యన్న తల్లి కూడా సర్పంచ్ గా ఎంతో కాలం ఉన్నారు. ఇక అయ్యన్న కుటుంబం అంతా ఒక్కటిగా ఉన్నపుడు ఆయన తమ్ముడు సన్యాసిపాత్రుడు భార్య అనిత చైర్ పర్సన్ గా అయిదేళ్ల పాటు సేవలు అందించారు.

వైసీపీలోకి తమ్ముడు :

అయితే రాజకీయంగా తేడాలు రావడంతో అయ్యన్న తమ్ముడు సన్యాసిపాత్రుడు 2019కి ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఆయన సతీమణి అనితకు వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖ జిల్లా కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పదవి లభించింది. వైసీపీలో ఈ దంపతులు కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల బరిలో మాజీ చైర్ పర్సన్ అనితను పోటీలో దించేందుకు వైసీపీ హైకమాండ్ నిర్ణయించింది. గతంలో ఒకసారి చైర్ పర్సన్ గా పనిచేసిన అనుభవం అనితకు ఉంది. దాంతో ఆమె పేరుని పార్టీ తొలి జాబితాలో ప్రకటించింది. పైగా చింతకాయల ఫ్యామిలీ ఆధిపత్యం ఉన్న నర్శీపట్నంలో అయ్యన్న కుటుంబాన్ని ఢీ కొట్టేందుకు అనిత సరైన అభ్యర్ధిగా వైసీపీ భావించి ఈ ఎంపిక చేసింది అని అంటున్నారు.

అయ్యన్న సతీమణి :

ఇదిలా ఉంటే టీడీపీ కూటమి నుంచి అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి చైర్ పర్సన్ గా పోటీ చేస్తారు అని అంటున్నారు. ఆమె పేరుని అధినాయకత్వం ఖరారు చేసింది. ఆమె రంగంలోకి దిగడంతో ఈ పోటీ అందరినీ ఆకర్షిస్తోంది. 2021 ఎన్నికల్లో పద్మావతి నర్శీపట్నం 26వ వార్డు నుంచి కౌన్సిలర్ గా టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ అనుభవం ఆమెకు ఉంది. అప్పట్లో వైసీపీ నర్సీపట్నం మునిసిపాలిటీ గెలుచుకుంది. అయితే ప్రతిపక్ష పాత్రను పద్మావతి పోషించారు. ఇపుడు ఆ అనుభవంతో ఆమె ప్రత్యక్ష ఎన్నికలు కావడంతో బరిలోకి దిగుతున్నారు. మరో వైపు చూస్తే టీడీపీకి పట్టు ఉన్న ప్రాంతం కావడంతో నర్శీపట్నం లో వైసీపీ కూడా ధీటుగా పోటీ ఇవ్వాలని చొస్తోంది.

ఇద్దరూ ఇద్దరే :

ఇక తోడి కోడళ్ళు ఇద్దరూ సమర్ధులైన వారే అని అంటున్నారు. నర్శీపట్నం సర్పంచ్ గా గతంలో సన్యాసిపాత్రుడు పనిచేశారు. మునిసిపాలిటీ అయ్యాక వైస్ చైర్మన్ గా కూడా పనిచేశారు. నిజానికి అయ్యన్న రాష్ట్ర నాయకుడిగా ఉంటే నర్శీపట్నం రాజకీయాలు మునిసిపాలిటీ వ్యవహారాలు అన్నీ తమ్ముడు సన్యాసిపాత్రుడే చూసుకునేవారు. ఆ విధంగా ఆయనకు ప్రతీ గల్లీలో పట్టు ఉంది. అందుకే తన సతీమణిని గెలిపించుకునేందుకు ఆయన నేరుగా రంగంలోకి దిగారు. మరో వైపు అయ్యన్న కుమారుడు ఎంపీ విజయ్, అలాగే చిన్న కుమారుడు మాజీ కౌన్సిలర్ రాజేష్ కూడా తల్లి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. తోడి కోడళ్ల మధ్య సమరం అయితే మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాను ఆకట్టుకునేలా ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News