25 ఏళ్లుగా ప్రభుత్వ అధినేతగా.. ఎక్స్ లో ప్రధాని ట్వీట్..
2001లో గుజరాత్ భూకంపం, ఆర్థిక వెనుకబాటు, రాజకీయ అస్థిరత అన్నింటినీ ఎదుర్కొని ఆయన ‘గుజరాత్ మోడల్’ను దేశం దృష్టికి తీసుకువచ్చారు.;
నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ఈ వ్యక్తి ఒక్క భారత్ కు సొంతమైన వ్యక్తి కాదు.. ఇతను ప్రపంచానికి సైతం సొంతమైన వాడు. ఆయన గురించి ప్రపంచంలోని ప్రతి దేశానికి.. అందులోని ప్రతి పౌరుడికి తెలుసు. ఎందుకంటే ఆయన ప్రభావం అంతటిది. యుద్ధాలు చేసే కాలం కాదని, ఇది అభివృద్ధికి బాటలు వేసే కాలమని ఉక్రెయిన్ కు రష్యాకు చెప్పిన మహోన్నత వ్యక్తి. తాను ఏ దేశం వైపునా నిలబడనని చెప్పిన శాంతి కాముకుడు. తమ జోలికి వస్తే రుధ్రుడిని అవుతానని పాకిస్తాన్ కు ప్రతాపం చూపిన వ్యక్తి. ఆయన రాజకీయంలోకి అడుగు పెట్టింది ఈ రోజే (అంటే ఇదే తేదీ.. సంవత్సరం మాత్రం 2001). తనను ప్రజలకు మరింత దగ్గర చేసిన ఈ రోజున గుర్తు చేసుకున్నారు. ఎక్స్ లో పోస్ట్ చేశారు.
కొనసాగుతున్న సుదీర్ఘ ప్రయాణం..
మోడీ జీవితం భారత రాజకీయ చరిత్రలో సుదీర్ఘ ప్రయాణం. ఒక వ్యూహాత్మక దిశా నిర్దేశం, ఒక బ్రాండ్ అని కూడా చెప్పవచ్చు. 2001, అక్టోబర్ 7న మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణస్వీకారం చేశారు. మంగళవారం ఆయన ఆ రోజు నాటి చిత్రాలను, ఆలోచనలను సోషల్ మీడియాలో పంచుకోవడం కేవలం జ్ఞాపకాల కోసం కాదు.. ఆయన రాజకీయ యాత్రకు స్మరించుకునే క్షణం కూడా.
ఎక్స్ లో పోస్ట్..
‘ప్రజల మద్దతు వల్లే ఈ ప్రయాణం సాధ్యమైంది’ అని ఆయన తన పోస్ట్‌లో రాసిన మాటల్లో కృతజ్ఞతా భావం కనిపించినా, ఆ మాటల వెనుక ఒక శాస్వత సంకల్పం దాగి ఉంది. ప్రజల జీవితాలను మెరుగుపరచడం, దేశ పురోగతికి నిత్యం నడిచే యంత్రంగా తాను నిలవడం.
ఇదే రోజు సీఎంగా ప్రమాణ స్వీకారం..
అక్టోబర్ 7, 2001 రోజు గుజరాత్ సీఎంగా మోదీ రాజకీయ పదవీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 దశాబ్దాలకుపైగా ఆయన అధికారంలోనే ఉన్నారు. మొదట రాష్ట్రాన్ని పునర్నిర్మించిన నేతగా, తర్వాత దేశాన్ని మార్చే ప్రధానిగా ఎదిగారు. ప్రస్తుతం ప్రభుత్వాధినేతగా 25వ ఏడాదిలోకి అడుగుపెట్టడం మోదీకి వ్యక్తి గతంగా గౌరవ సూచక మైలురాయిగా చెప్పుకోవచ్చు.
దేశం దృష్టిని ఆకర్షించిన ‘గుజారాత్ మోడల్’
2001లో గుజరాత్ భూకంపం, ఆర్థిక వెనుకబాటు, రాజకీయ అస్థిరత అన్నింటినీ ఎదుర్కొని ఆయన ‘గుజరాత్ మోడల్’ను దేశం దృష్టికి తీసుకువచ్చారు. ఆ నమూనానే ఆయనను 2014లో ప్రధానమంత్రి కుర్చీ వరకు తీసుకెళ్లింది. వరుసగా మూడు సార్లు అధికారంలో కొనసాగడం ఆయన నేతృత్వానికి లభించిన ప్రజాభిమానాన్ని సూచిస్తుంది.
కొనసాగుతున్న ప్రభ..
ఈ నిరంతర విజయప్రయాణం మధ్య 2024లో మాత్రమే ఆయనకు కాస్తంత ఎదురుగాలి వీచింది. ఆయన పార్టీ బీజేపీకి పార్లమెంట్ లో కొన్ని సీట్లు తగ్గాయి. కానీ ప్రభావం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కాస్త ఎదురుగాలి అనే చెప్పాలి. ఆర్థిక వ్యవస్థపై విమర్శలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ప్రజాభిప్రాయాన్ని కొంత ఆలోచనలో పడేశాయి. అయినప్పటికీ, మోదీ నాయకత్వం భరోసా, స్థిరత్వం, మరియు దేశ దిశను నిర్ధేశించే శక్తిగా కొనసాగుతూనే ఉంది. 2001లో ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు 25వ ఏటకు చేరింది. కేవలం ఒక నాయకుడి యాత్రగా కాకుండా ఇది భారత రాజకీయ వ్యవస్థలో నిరంతర ప్రజామోదిత పాలనకు ప్రతీకగా నిలుస్తోంది.