ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి పోలీసులు.. ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ ఇదే..

రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది.

Update: 2026-05-26 10:54 GMT

రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. అలాంటి ఘటన ఏదీ జరగలేదని స్పష్టం చేయడమే కాకుండా ఉద్దేశపూర్వకంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా నాగేశ్వర్ ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు చెబుతున్నారు.

అంతా అసత్య ప్రచారం

గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్ట్ చేస్తారంటూ తీవ్రస్థాయిలో ఊహాగానాలు వ్యాప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటికి ఏపీ పోలీసులు వెళుతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం ప్రారంభమైంది. దీనిపై స్పందించిన ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఇదంతా పూర్తిగా అసత్య ప్రచారమని కొట్టిపారేసింది. కొందరు ఉద్దేశపూర్వకంగానే, పనిగట్టుకుని ఈ తరహా తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారని పేర్కొంటూ ఎక్స్ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రజలు ఇలాంటి పుకార్లను నమ్మవద్దని కోరింది.

నాగేశ్వర్ ఇంటి వద్ద భద్రత

మరోవైపు ప్రొఫెసర్ అరెస్ట్ వార్తల ప్రచారం నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ నాగేశ్వర్ నివాసం వద్ద ఒక్కసారిగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఘర్షణలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. నాగేశ్వర్ ఇంటి పరిసర ప్రాంతాల్లో తెలంగాణ పోలీసు సిబ్బంది భారీగా మోహరించినట్లు చెబుతున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏపీ రాజకీయాలపై చేసిన ఓ విశ్లేషణ తీవ్ర దుమారం రేపింది. దీనిపై అధికార కూటమిలోని జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రొఫెసర్ పై పోలీసులకు ఫిర్యాదులు చేశాయి. ఇదే సమయంలో పార్టీకి చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణను తప్పుపట్టారు. దీంతో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రొఫెసర్ ప్రకటించారు. ఈ వివాదానికి ముగింపు పలకాలని ఆయన కోరారు. కానీ, సోషల్ మీడియాలో ప్రొఫెసర్ నాగేశ్వర్ లక్ష్యంగా ఏదో ఒక ప్రచారం జరుగుతోంది. దీంతో తాజాగా ఆయన అరెస్టు కాబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగగా, ఏపీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. దీంతో ప్రొఫెసర్ పై ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు లేవని స్పష్టమైందని అంటున్నారు.

Tags:    

Similar News