దోసెలమ్ముతూ నెలకు లక్షల్లో ఆదాయం.. ఆదర్శంగా మారిన చిరు వ్యాపారి జీవితం!

ఒకప్పుడు బోణీ అవ్వడమే కష్టమైన ఆ చిన్న బండి దగ్గర, ఇప్పుడు రోజుకు సగటున 400 మందికి పైగా కస్టమర్లు క్యూ కడుతున్నారు.

Update: 2026-06-12 23:30 GMT

నెల తిరిగేసరికి చేతికి వచ్చే జీతం, ప్రశాంతమైన ఉద్యోగం.. చాలామంది కోరుకునే సురక్షితమైన జీవితం ఇది. కానీ ముంబైకి చెందిన గణేష్ సాఠే మాత్రం ఈ రొటీన్‌కు భిన్నంగా ఆలోచించాడు. కేవలం రూ. 50 వేల అప్పుతో రోడ్డు పక్కన మొదలైన ఒక చిన్న దోసె బండి, ఈరోజు నెలకు ఏకంగా రూ. 12 లక్షల లాభాన్ని ఆర్జిస్తోందంటే నమ్ముతారా? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ ముంబై కుర్రాడి వైరల్ స్టోరీ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.ఆ వివరాలు చూద్దాం..

రూ. 50 వేల అప్పుతో మొదలైన కల:

ముంబైలోని థానేకు చెందిన గణేష్ సాఠే చార్టర్డ్ అకౌంటెంట్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న రోజుల్లోనే తనకు 9గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం సెట్ కాదని ఫిక్స్ అయ్యాడు. సొంతంగా ఏదైనా చేయాలనే కసితో ఫ్యామిలీ దగ్గర రూ. 50,000 అప్పు తీసుకుని ఫుడ్ బిజినెస్‌లోకి దిగాడు. ఇక తన తల్లి చేతి వంట అయిన కరకరలాడే 'బెన్నె దోసె' రుచిని ముంబై ప్రజలకు పరిచయం చేయాలని డిసైడ్ అయ్యాడు.

చెల్లెలి సాయంతో వీధి పక్కన బండి:

అనుకున్నదే తడవుగా తన సోదరి సప్న సాయంతో ఒక పాత బండిని చిన్న స్టాల్‌గా మార్చాడు. పూణే నుండి స్పెషల్‌గా తెప్పించిన అసలైన తెల్ల వెన్నతో, క్వాలిటీలో ఎక్కడా తగ్గకుండా 'ది బెన్నె' అనే పేరుతో దోసెల అమ్మకం స్టార్ట్ చేశాడు. అయితే చుట్టుపక్కల పిజ్జాలు, మోమోస్ వంటి మోడ్రన్ ఫుడ్ ట్రక్కులు ఉండటంతో మొదట్లో ఈ సాంప్రదాయ దోసెలను ఎవరూ పట్టించుకోలేదు.

రోజుకు రూ. 200 సంపాదన.. మూసేద్దాం అనుకున్న తరుణంలో:

వ్యాపారం మొదలుపెట్టిన కొత్తలో కస్టమర్లు లేక రోజువారీ అమ్మకాలు కేవలం రూ. 200కి పడిపోయాయి. అసలు బిజినెస్ నడుస్తుందా లేదా అనే అనుమానంతో స్టాల్ మూసేయాలనే ఆలోచన కూడా వచ్చింది. కానీ ఆ ఇద్దరు తోబుట్టువులు ధైర్యం కోల్పోకుండా రూట్ మార్చారు. ఈ కాలంలో జనాన్ని ఆకర్షించాలంటే సోషల్ మీడియానే కరెక్ట్ ఆయుధం అని నమ్మారు.

సోషల్ మీడియా తెచ్చిన లక్.. రాత్రికి రాత్రే వైరల్:

ఇంట్లో తల్లి, చెల్లెలు తాజా పిండి రెడీ చేస్తుంటే.. గణేష్ స్టాల్ దగ్గర దోసెలు వేస్తూ ఆ మేకింగ్ వీడియోలను, తన రోజువారీ కష్టాలను రీల్స్ రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడం స్టార్ట్ చేశాడు. ఈ వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అంతే.. ఆ రుచిని చూడటానికి జనం ఒక్కసారిగా 'ది బెన్నె' స్టాల్ వైపు అడుగులు వేశారు.

రోజుకు రూ. 40 వేల కలెక్షన్.. నెలకు రూ. 12 లక్షల లాభం:

ఒకప్పుడు బోణీ అవ్వడమే కష్టమైన ఆ చిన్న బండి దగ్గర, ఇప్పుడు రోజుకు సగటున 400 మందికి పైగా కస్టమర్లు క్యూ కడుతున్నారు. ఇక క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందంటే సాయంత్రం అవ్వకముందే దోసెలు అయిపోతున్నాయి. ప్రస్తుతం ఈ చిన్న స్టాల్ రోజుకు రూ. 40 వేల బిజినెస్ చేస్తూ, నెలకు అక్షరాలా రూ. 12 లక్షల నికర లాభాన్ని గడిస్తూ సరికొత్త రికార్డు సృష్టిస్తోంది.

ఒక సాధారణ మధ్యతరగతి యువకుడు రిస్క్ తీసుకుని, నమ్మిన ఆలోచనతో ముందడుగు వేస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చెప్పడానికి గణేష్ సాఠే జీవితమే ఉదాహరణ. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, టెక్నాలజీని వాడుకుని సక్సెస్ అయిన ఈ ‘దోసె కింగ్’ వైరల్ స్టోరీ ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఎంతో మంది యువతకు ఫుల్ జోష్ ఇస్తోంది.

Tags:    

Similar News