ఆసియా నం.1 ధ‌నికుడు అదానీ.. మూడో స్థానానికి ప‌డిపోయిన‌ అంబానీ!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో దూసుకుపోతున్న చైనా టెక్ దిగ్గజం `బైట్‌డ్యాన్స్` వాల్యుయేషన్ ఊహించని స్థాయిలో పెరగడంతో ఆసియా సంపన్నుల జాబితాలో పెద్ద మార్పు చోటుచేసుకుంది.

Update: 2026-06-03 05:23 GMT

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో దూసుకుపోతున్న చైనా టెక్ దిగ్గజం `బైట్‌డ్యాన్స్` వాల్యుయేషన్ ఊహించని స్థాయిలో పెరగడంతో ఆసియా సంపన్నుల జాబితాలో పెద్ద మార్పు చోటుచేసుకుంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. బైట్‌డ్యాన్స్ (ఇందులో టిక్ టాక్ ఒక కంపెనీ) సహ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్.. భారతీయ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి ఆసియాలోనే రెండో అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ప్రస్తుతం జాంగ్ నికర ఆస్తి విలువ 92.8 బిలియన్ డాలర్ల(భార‌తీయ క‌రెన్సీలో 8.9 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల)కు చేరుకోవడంతో ఆయన చైనాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. బ్లూమ్‌బెర్గ్ 2019 మార్చిలో ఆయన సంపదను ట్రాక్ చేయడం ప్రారంభించినప్పుడు 13 బిలియన్ డాలర్లుగా ఉన్న జాంగ్ ఆస్తులు కేవలం ఏడేళ్లలోనే ఏడు రెట్లకు పైగా పెరగడం విశేషం.

ఈ అసాధారణ వృద్ధికి బైట్‌డ్యాన్స్ యాజమాన్యంలోని పాపులర్ వీడియో యాప్ `టిక్‌టాక్` విజయంతో పాటు... సంస్థ తాజాగా తీసుకొచ్చిన `దౌబావో AI చాట్‌బాట్` సాధిస్తున్న విజయాలే ప్రధాన కారణం. చైనాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ AI యాప్ నెలకు దాదాపు 300 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లను కలిగి ఉంది. దీనితో పాటు అమెరికాలో ఎదుర్కొంటున్న రాజకీయ, నియంత్రణపరమైన సవాళ్లను అధిగమించేందుకు బైట్‌డ్యాన్స్ తన యూఎస్ వ్యాపారంలోని కొన్ని భాగాలను అమెరికన్ ఇన్వెస్టర్లకు బదిలీ చేయడం కూడా కంపెనీకి సానుకూలంగా మారింది. బైట్‌డ్యాన్స్ బలమైన పునాదులు..`దౌబావో` వంటి యాప్‌ల సక్సెస్ ఈ సంప‌ద‌ల‌ వాల్యుయేషన్ జంప్‌లో ప్రతిబింబిస్తోందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గతంలో అమెరికా ప్రతినిధుల సభ `టిక్‌టాక్‌`ను నిషేధించాలని లేదా విక్రయించాలని బిల్లు పాస్ చేసినప్పుడు.. బ్లూమ్‌బెర్గ్ సంస్థ బైట్‌డ్యాన్స్ వాల్యుయేషన్‌పై 25 శాతం రిస్క్ డిస్కౌంట్‌ను విధించింది. అయితే ఒరాకిల్ కార్పొరేషన్, సిల్వర్ లేక్, అబుదాబికి చెందిన ఎంజీఎక్స్ లతో కూడిన కన్సార్టియానికి అమెరికా కార్యకలాపాలను విజయవంతంగా బదిలీ చేయడంతో జూన్ 2 నాటికి ఆ రిస్క్ డిస్కౌంట్‌ను 10 శాతానికి తగ్గించారు. బ్లాక్‌రాక్, ఫిడెలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్, టి. రో ప్రైస్ గ్రూప్ వంటి ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్టర్లు సంస్థకు ఇచ్చిన తాజా వాల్యుయేషన్లను విశ్లేషించిన తర్వాత జాంగ్ సంపద ఒక్కసారిగా 24 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. అమెరికా వివాదం సద్ధుమణగడంతో బైట్‌డ్యాన్స్ అసలు విలువ మార్కెట్లో వెలుగుచూసిందని ఇది ఓవ‌రాల్ సంప‌ద‌ను అమాంతం పెంచింద‌ని విశ్లేషకులు చెబుతున్నారు.

మరోవైపు ఈ మార్పుల కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 86.9 బిలియన్ డాలర్ల (8.3ల‌క్ష‌ల కోట్లు) నికర ఆస్తితో ఆసియాలోనే మూడో స్థానానికి పడిపోయారు. కాగా అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ 117.4 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలోనే అగ్రస్థానాన్ని (నెం.1) నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం చైనాలోనే అత్యధిక ప్రొఫైల్ ఉన్న ప్రైవేట్ కంపెనీగా బైట్‌డ్యాన్స్ కొనసాగుతోంది. చైనా మార్కెట్లో సాధారణంగా ఆన్‌లైన్ సేవల కోసం యూజర్లు డబ్బులు చెల్లించడానికి ఇష్టపడరు. కానీ దౌబావో సాధించిన సక్సెస్‌తో బైట్‌డ్యాన్స్ త్వరలోనే సబ్‌స్క్రిప్షన్ ఫీజులను వసూలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇది భవిష్యత్తులో కంపెనీ పబ్లిక్ ఇష్యూ (ఐపివో) కి వెళ్లేందుకు బలమైన పునాదిగా మారనుంది.

ప్రస్తుతం బీజింగ్ ఆధారిత సోషల్ మీడియా లీడర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంపై భారీగా బెట్టింగ్ కాస్తోంది. చైనా AI మార్కెట్లో అగ్రగామిగా నిలవడంతో పాటు... అంతర్జాతీయంగా అమెరికా టెక్ దిగ్గజాలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఈ ఏడాది ఏకంగా 70 బిలియన్ డాలర్లు ఖర్చు చేసే యోచనలో ఉంది. 2025లో ఈ సంస్థ సంపాదించిన సుమారు 50 బిలియన్ డాలర్ల లాభాల నుంచే ఈ పెట్టుబడులలో ఎక్కువ భాగం సమకూరనుంది. అమెరికా నుంచి ఇబ్బందులు తొలగిపోవడంతో కంపెనీ ఫండమెంటల్స్ పరంగా మరింత బలంగా మారిందని.. ప్రస్తుతం ఉన్న వాల్యుయేషన్ కూడా దాని అసలు సామర్థ్యం కంటే తక్కువగానే కనిపిస్తోందని టెక్ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News