ఇరాన్ నుంచి మాయం.. ‘మోజ్తబా ఖమేనీ’ ఎక్కడ? తెర వెనుక కథలు..
పశ్చిమాసియాలో రోజుకో కొత్త సీరియల్ ఎపిసోడ్ నడుస్తోంది. తాజాగా ఇరాన్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ బయటకొచ్చింది.
పశ్చిమాసియాలో రోజుకో కొత్త సీరియల్ ఎపిసోడ్ నడుస్తోంది. తాజాగా ఇరాన్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ బయటకొచ్చింది. ఇరాన్ నెక్స్ట్ ‘సుప్రీం బాస్’ రేసులో ఉన్నట్లు చెప్పుకునే మోజ్తబా ఖమేనీ సడన్‌గా మాయమయ్యారట.. ఆయన దేశంలోనే లేరంటూ అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. అయితే ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో "మాకు సంబంధం లేదు.. మాకు తెలియదు" అన్నట్లు మౌనవ్రతం పాటిస్తోంది.
బాస్ ఎక్కడ? ప్రకటనలు ఎవరివి?
సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ ‘అల్ హదత్’ ఒక రేంజ్ ట్విస్ట్ ఇచ్చింది. మోజ్తబా ఖమేనీ పేరుతో వస్తున్న ఘాటైన ప్రకటనలన్నీ ఆయన సొంతంగా రాస్తున్నవి కావట. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కు చెందిన అహ్మద్ వహిదీ ఆఫీసు నుంచి ఆ స్క్రిప్ట్‌లు రెడీ అయి మార్కెట్లోకి వస్తున్నాయని బాంబు పేల్చింది. అంటే.. అక్కడ నడుస్తున్నది "వాయిస్ ఓవర్" రాజకీయం అన్నమాట.. ట్విస్ట్ ఏంటంటే.. అసలు మోజ్తబా ఇరాన్‌లోనే ఉన్నారా లేక ఎక్కడైనా లాంగ్ వెకేషన్‌లో ఉన్నారా అనే దానికి ఇరాన్ దగ్గర ఇప్పటికీ అఫీషియల్ ఆన్సర్ లేదు.
ఇంట్లో ఈగలు.. బయట పులులు
అమెరికాతో కాల్పుల విరమణ, దౌత్య చర్చల విషయంలో ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో పెద్ద కురుక్షేత్రమే నడుస్తోంది. ఒకవైపు "తగ్గేదే లే" అనే హార్డ్‌లైన్ వర్గాలు, మరోవైపు "కొద్దిగా సర్దుకుపోదాం" అనే ప్రభుత్వ వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ గొడవల్లో పాపం ఐఆర్.జీసీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు.
ఇటీవల జరిగిన ఖమేనీ అంత్యక్రియల్లో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీకి ఊహించని షాక్ తగిలింది. కొందరు ఆందోళనకారులు ఆయనపై ఏకంగా రాళ్ల వర్షం కురిపించారు. అమెరికాతో డీల్ కుదుర్చుకున్నందుకు ఆయన్ను "డీల్ మేకర్", "దేశద్రోహి" అంటూ ఘనంగా సన్మానించారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఇరాన్ పాలిటిక్స్ ఎంత ‘హాట్’గా ఉన్నాయో..
తెరపై కొత్త హీరోలు.. ట్రంప్ గారి పాత డైలాగులు!
పాశ్చాత్య మీడియా కథనాల ప్రకారం మోజ్తబా ఖమేనీ పబ్లిక్‌లోకి రావడం ఎప్పుడో అమవాస్యకో, పౌర్ణమికో జరుగుతుందట. ప్రస్తుతం ఇరాన్ గురించిన కీలక నిర్ణయాలన్నీ మాజీ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ భాగేర్ ఘలీబఫ్, అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అరాగ్చీలే చూసుకుంటున్నారట. ఇక ఇవన్నీ చూస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊరుకుంటారా? ఆయన కూడా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి తన మార్కు కామెంట్ చేశారు. ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని సరిగ్గా పాటించకపోయినా మా రూట్ మారదు. మా ఏకైక టార్గెట్.. ఇరాన్ చేతికి అణ్వాయుధాలు చిక్కకుండా చూడడమే!
అంతా సస్పెన్స్!
మోజ్తబా ఖమేనీ మాయమవ్వడం వెనుక అసలు నిజం ఏంటనేది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఇవన్నీ కేవలం అంతర్జాతీయ మీడియా అల్లిన కథలా లేక నిజంగానే ఇరాన్ సర్కార్ ఏదైనా దాస్తోందా అనేది కాలమే నిర్ణయించాలి. ఇరాన్ ప్రభుత్వం నోరు విప్పేంతవరకు ఈ "మిస్టరీ" ఇలాగే కొనసాగుతుంది!