దేశంలోనే మరెక్కడా జరగలేదు.. ఓటుకు రూ.70వేలు

మొయినాబాద్ మున్సిపాలిటీ అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న నేపథ్యంలో అక్కడ రియల్ ఎస్టేట్ ప్రభావం అధికంగా ఉంది.;

Update: 2026-02-13 06:07 GMT

ఎన్నికల వేళ ఓటుకు ఎంత ఇస్తారు? వెయ్యి.. రెండు వేలు.. మూడు వేలు.. కాదంటే ఐదు వేలు అన్న మాటే మీ నోటి నుంచి వస్తుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఓటుకు ప్రధాన పార్టీ అభ్యర్థులంతా ఇచ్చింది కలిపితే రూ.10వేలకు మించే అవకాశమే లేదు. కానీ.. తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో ఒక వార్డులో ఓటర్లకు ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ పంచిన పంపకం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. ఎన్నికలు ఏ దిశగా వెళుతున్నాయన్నది ఇప్పుడు చర్చగా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో మొయినాబాద్ మునిపాలిటీలో ఒక వార్డులో ఓటర్లపై కురిసిన కాసుల వర్షం లెక్కలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

స్థానికంగా వస్తున్న సమాచారం ప్రకారం సదరు వార్డులో ఒక్కో ఓటుకు ప్రధాన పార్టీ అభ్యర్థులు.. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అభ్యర్థి కలిపి ఏకంగా రూ.70వేల వరకు ముట్టజెప్పినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అభ్యర్థి ఒకరు ఈ ఎన్నికల కోసం ఏకంగా రూ.7కోట్లు ఖర్చు చేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది. అభ్యర్థులు పంచిన నగదుతో పాటు పట్టుచీర, పాతిక కేజీల బియ్యం, 15 లీటర్ల నూనెడబ్బా, నెలకు సరిపడా పప్పుల పాకెట్లు కూడా పంచినట్లుగా తెలుస్తోంది.

మొయినాబాద్ మున్సిపాలిటీ అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న నేపథ్యంలో అక్కడ రియల్ ఎస్టేట్ ప్రభావం అధికంగా ఉంది. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు భారీగా ఖర్చు చేస్తున్నారు. గెలుపుకోసం ఎంత ఖర్చుకైనా తగ్గని తీరును ప్రదర్శిస్తున్నారు. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన ఒక అభ్యర్థి ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ కు రెండు రోుల ముందు వరకు రూ.5 కోట్లు ఖర్చు చేస్తే.. చివరి రెండు రోజుల్లో ఏకంగా రూ.2 కోట్లు ఖర్చు చేయటం గమనార్హం. ఇంతా చేసి అక్కడ ఉన్న ఓట్లు వెయ్యి వరకు ఉంటాయని చెబుతున్నారు. ఏమైనా ఈ వార్డులో చేసిన ఎన్నికల ఖర్చు దేశంలో మరే ఎన్నికల్లో ఇంత భారీగా ఖర్చు చేసి ఉండరని.. ఒక ఎలక్షన్ లో ఓటరుకు ఇంత భారీగా ముట్టజెప్పిన దాఖలాలు ఉండవన్న మాట బలంగా వినిపిస్తోంది.

Tags:    

Similar News