H1B ఫీజు పెంపు వేళ మోడీ సంచలన పిలుపు

అమెరికా తాజాగా హెచ్‌-1బీ వీసా దరఖాస్తు రుసుమును భారీగా పెంచుతున్నట్లు ప్రకటించిన వేళ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.;

Update: 2025-09-20 11:57 GMT

అమెరికా తాజాగా హెచ్‌-1బీ వీసా దరఖాస్తు రుసుమును భారీగా పెంచుతున్నట్లు ప్రకటించిన వేళ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. శనివారం గుజరాత్‌లో పర్యటించిన ఆయన, అక్కడి బహిరంగ సభలో మాట్లాడుతూ, విదేశాలపై ఆధారపడటం మనకు అతిపెద్ద శత్రువు అని స్పష్టం చేశారు.

"నేడు భారత్‌ 'విశ్వబంధు' స్ఫూర్తితో ముందుకు సాగుతోంది. ప్రపంచంలో మనకు ప్రధాన శత్రువులు ఎవరూ లేరు. కానీ మనకు అతిపెద్ద శత్రువు విదేశాలపై ఆధారపడటమే. దీన్ని మనం ఓడించాలి. ఇతర దేశాలపై ఎక్కువగా ఆధారపడితే దేశ అభివృద్ధి ఆగిపోతుంది. మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది. భావితరాల భవిష్యత్తును మనం ఫణంగా పెట్టలేం," అని మోదీ అన్నారు.

షిప్పింగ్‌ రంగంపై విమర్శలు

ఈ సందర్భంగా మోదీ మన దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో షిప్పింగ్‌ రంగం గురించీ ప్రస్తావించారు. 50 ఏళ్ల క్రితం భారత్‌లో తయారు చేసిన నౌకలనే మనం ఎక్కువగా ఉపయోగించేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. కానీ కాంగ్రెస్‌ పాలనలో ఆ రంగం పూర్తిగా నాశనమైందని ఆరోపించారు.

వారి హయాంలో స్వదేశీ నౌకల తయారీని ప్రోత్సహించకుండా, విదేశీ నౌకలకు అద్దెలు చెల్లించడానికే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. ఫలితంగా, ఇప్పటికీ మన వాణిజ్యంలో 90 శాతం విదేశీ నౌకలపైనే ఆధారపడుతున్నామని, ఇందుకోసం ఏటా ₹6 లక్షల కోట్లు చెల్లించాల్సి వస్తోందని వివరించారు. ఈ మొత్తం దేశ రక్షణ బడ్జెట్ కంటే ఎక్కువని ఆయన తెలిపారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యం

ఈ పర్యటనలో భాగంగా, ప్రధాని మోదీ భావ్‌నగర్‌లో ₹34,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. దేశాన్ని ఆత్మనిర్భర్‌గా తీర్చిదిద్దడం కోసం ప్రతి రంగంలో స్వదేశీ సామర్థ్యాలను పెంపొందించడం అత్యవసరమని ఆయన పునరుద్ఘాటించారు.

హెచ్‌–1బీ వీసా ఫీజు పెంపు నేపథ్యంలో మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు, భారత్‌ విదేశాలపై ఆధారపడకూడదన్న ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని మరోసారి బలోపేతం చేశాయి. దేశ ఆర్థిక వ్యవస్థ, సాంకేతిక రంగం, భద్రత, మరియు అభివృద్ధికి స్వయం-సమృద్ధి ఎంత ముఖ్యమో ఆయన మాటలు గుర్తు చేశాయి. భారతదేశం తన సొంత శక్తి సామర్థ్యాలను గుర్తించి, వాటిని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని ఈ వ్యాఖ్యలు నొక్కి చెప్పాయి.

Tags:    

Similar News