మావోయిస్టు అగ్రనేతల్లో మిగిలింది ఎందరు?

దేశంలో మావోయిస్టు ఉద్యమం సమాప్తమయ్యే గడియలు దగ్గరపడ్డాయా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది.;

Update: 2025-10-17 13:30 GMT

దేశంలో మావోయిస్టు ఉద్యమం సమాప్తమయ్యే గడియలు దగ్గరపడ్డాయా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నతోపాటు వందల మంది దళ సభ్యులు అడవిని వీడి జనజీవన స్రవంతిలో కలవడంతో ఉద్యమంపై కొత్త చర్చ జరుగుతోంది. ఆపరేషన్ కగార్ తో మావోయిస్టు విప్లవాన్ని కేంద్ర ప్రభుత్వం దెబ్బతీసింది. ఆధునిక సాంకేతికత సాయంతో అడవులను జల్లెడ పడుతున్న ప్రత్యేక భద్రతా బలగాలు మావోయిస్టుల ఏరివేతలో విజయం సాధిస్తున్నాయి. దీంతో ప్రాణభయంతో మావోయిస్టులు ఉద్యమం వదిలి జన జీవనంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం గత 22 నెలల్లో సుమారు 2100 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇక శుక్రవారం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న నాయకత్వంలో 208 మంది పోలీసుల సమక్షంలో ఉద్యమాన్ని వీడుతున్నట్లు ప్రకటించారు.

వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు ఉద్యమం లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతినబూనింది. ఆపరేషన్ కగార్ ప్రారంభించి పెద్ద ఎత్తున ఎన్ కౌంటర్లకు ఆదేశాలిచ్చింది. 'కగార్' అంటే తెలుగులో 'అంతం' లేదా 'చివర' అని అర్థం. ఈ పేరుకు తగ్గట్టే ఆపరేషన్ కగార్.. మావోయిస్టుల అంతాన్ని చూసిందని అంటున్నారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని దండకారణ్యం, అబూజ్‌మడ్‌ వంటి ప్రాంతాలలో మావోయిస్టు స్థావరాలను ధ్వంసం చేసిన భద్రతా బలగాలు వారిని నిలువ నీడలేకుండా చేయడంలో సక్సెస్ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో యుద్ధం చేయలేక మావోయిస్టులు లొంగుబాట పట్టారని అంటున్నారు.

ఆపరేషన్ కగార్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మావోయిస్టు పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. 2004లో పీపుల్స్ వార్, ఎంసీసీ గ్రూపులు విలీనంతో మావోయిస్టు పార్టీ ఆవిర్భవించిందని విప్లవోద్యకారులు ప్రకటించారు. అప్పట్లో సుమారు 42 మందిని కేంద్ర కమిటీ సభ్యులుగా నియమించారు. అయితే దశల వారీగా జరిగిన ఎన్ కౌంటర్లతో కేంద్ర కమిటీ బాగా బక్క చిక్కిపోయింది. ఈ పరిస్థితుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీలో ఇంకా ఎందరు ఉద్యమంలో కొనసాగుతున్నారు? ఇతర విభాగాల బాధ్యతలు ఎవరు చూస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

గత ఏడాది కాలంలో జరిగిన పోలీసు కాల్పుల్లో సుమారు 8 మంది మావోయిస్టు అగ్రనేతలు, కేంద్ర కమిటీ సభ్యులు మరణించారని పోలీసువర్గాలు చెబుతున్నాయి. వీరిలో మావోయిస్టు పార్టీ ప్రధాన నంబాళ్ల కేశవరావుతోపాటు పార్టీ అగ్రనేతలు చలపతి, చంద్రన్న, సుధాకర్, గాజర్ల రవి, బాలక్రిష్ణ, కట్టా రామచంద్రారెడ్డి, కాదరి సత్యనారాయణ ఉన్నారు. ఇక కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల సుజాత గత నెలలో తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోగా, తాజాగా మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ సమక్షంలోను ఉద్యమాన్ని వీడారు. అదేవిధంగా తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న ఆధ్వర్యంలో 208 మంది ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ఎదుట లొంగిపోయారు.

దీంతో మావోయిస్టు ఉద్యమం చివరి దశకు చేరుకున్నట్లేనని అంచనా వేస్తున్నారు. ఇంకా మావోయిస్టు కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో వంటి అత్యున్నత పదవుల్లో నలుగురు మాత్రమే మిగిలి ఉన్నట్లు పోలీసు రికార్డులు సూచిస్తున్నాయి. ప్రధానంగా పార్టీ సిద్ధాంతకర్త ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియాస్ గణపతి, పార్టీ ప్రధాన కార్యదర్శిగా భావిస్తున్న తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్, జార్ఖండ్‌కు చెందిన నేత మిసిర్ బేస్రా అలియాస్ భాస్కర్, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) కి కమాండర్-ఇన్-చీఫ్‌ మాడ్వి హిద్మా అలియాస్ హిద్మన్న మాత్రమే అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరి ఆచూకీ కోసం భద్రతా దళాలు దృష్టి సారించాయి.

Tags:    

Similar News