మారేడుమిల్లి ఎదురుకాల్పుల్లో సంచలనం.. మోస్ట్ వాంటెడ్ మద్వి హిడ్మా హతం

అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటరులో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత మద్వి హిడ్మా మరణించారు.;

Update: 2025-11-18 07:38 GMT

అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటరులో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత మద్వి హిడ్మా మరణించారు. మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా, మృతుల్లో మవోయిస్టు అగ్రనేత హిడ్మా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ ఎన్ కౌంటర్ తీవ్రసంచలనమైంది. హిడ్మాతోపాటు ఆయన భార్య, అనుచరులు ఈ ఎన్కౌంటరులో ప్రాణాలు కోల్పోయారు. చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన హిడ్మా గెర్లిల్లా యుద్ధంలో ఆరితేరిన మావోయిస్టు నేతగా పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టు గెరిల్లా ఆర్మీకి అతడే సారథ్యం వహిస్తున్నట్లుగా చెబుతున్నారు.

హిడ్మా స్వస్థలం సుక్మా చిల్లాలోని పర్వతి గ్రామం. ఆదివాసీ మూరియా తెగకు చెందిన హిడ్మా 1981లో జన్మించాడు. 2000 సంవత్సరలో మావోయిస్టు ఉద్యమంలో చేరి అంచెలంచెలుగా ఎదిగాడు. తన యుద్ధవ్యూహాలతో దాడులకు తెగబడి ఉద్యమంలోని అగ్రనేతల్లో ఒకడిగా ఎదిగాడు. ప్రస్తుతం మావోయిస్టు పీఎల్జీఏ బెటాలియన్-1 కమాండర్ గా దండకారణ్య ప్రాంతంలో హిడ్మా పనిచేస్తున్నాడు. 2010లో దంతేవాడ దాడిలో హిడ్మానే ప్రధాన నిందితుడు. ఆ సమయంలో హిడ్మా నేతృత్వంలోని మావోయిస్టుల దాడికి 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు నేలకొరిగారు. ఇక 2013లో జీరామ్ ఘాటి నరమేధానికి హిడ్మానే సూత్రధారిగా ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఏడాది దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా హిడ్మాకు పదోన్నతి ఇచ్చినట్లు చెబుతున్నారు. హిడ్మాను పట్టుకునేందుకు పోలీసులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఆయన తల్లితో హిడ్మా లొంగుబాటుకు పిలుపునిస్తూ వీడియో కూడా రిలీజ్ చేశారు. దండకారణ్యంపై పూర్తిగా పట్టున్న హిడ్మా గెరిల్లా యుద్ధ వ్యూహాలు, స్థానిక నెట్ వర్కుతో పోలీసులకు కొరకరాని కొయ్యిగా మారాడు. అయితే ఆపరేషన్ కగార్ తర్వాత దండకారణ్యంపై పోలీసులకు పట్టుపెరగడంతో హిడ్మా అక్కడి నుంచి షెల్టర్ జోన్ కు వచ్చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

2004 నుంచి ఇప్పటివరకు సుమారు 20కిపైగా ప్రధాన దాడుల్లో హిడ్మా హస్తం ఉన్నట్లు భద్రతాదళాలు చెబుతున్నాయి. వేలాది మందితో చేపట్టిన ఎన్నో ఆపరేషన్ల నుంచి హిడ్మా తప్పించుకున్నాడు. ఎట్టకేలకు ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి వచ్చి దొరికిపోయాడు. హిడ్మా షెల్టర్ లో ఉన్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో పోలీసులు చుట్టుముట్టారు. ఆయన లొంగుబాటుకు ప్రయత్నించినా, ఫలితం లేకపోవడంతో కాల్పులు జరపాల్సివచ్చిందని బలగాలు చెబుతున్నాయి. మంగళవారం వేకువజామున జరిగిన ఎన్ కౌంటరులో హిడ్మాతో పాటు మరో ఐదుగురు మరణించినట్లు పోలీసులు ప్రకటించారు.

Tags:    

Similar News