వైద్య విద్య మరీ అంత చులకనా.. ఫెయిల్ అయినా సీట్ లభిస్తుందా?

చెన్నైలో ఇటీవల వెలుగు చూసిన ఒక ఘటన వైద్య లోకాన్ని విస్మయానికి గురిచేసింది.;

Update: 2026-02-20 06:31 GMT

భారతదేశంలో డాక్టర్ చదువు అంటే ఒకప్పుడు అదో పెద్ద కల, క్రమశిక్షణతో కూడిన తపస్సు. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. దేశంలో అత్యంత కఠినమైన నీట్ పరీక్షలో కేవలం 'సింగిల్ డిజిట్' మార్కులు వచ్చిన వారికి కూడా మెడికల్ సీట్లు దక్కుతుండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రతిభకు పట్టం కట్టాల్సిన చోట, పైసల పరపతి రాజ్యమేలుతోందా? వైద్య విద్య నాణ్యత మసకబారుతోందా? అన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

9 మార్కులకే సీటు.. ప్రతిభకు శిక్షేనా?:

చెన్నైలో ఇటీవల వెలుగు చూసిన ఒక ఘటన వైద్య లోకాన్ని విస్మయానికి గురిచేసింది. నీట్ పీజీ పరీక్షలో కేవలం 9 మార్కులు సాధించిన ఒక విద్యార్థి.. కౌన్సెలింగ్‌లో మేనేజ్‌మెంట్ కోటా కింద మెడికల్ సీటు పొందడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కష్టపడి చదివి మంచి మార్కులు సాధించిన విద్యార్థులు సీటు దొరకక ఇబ్బంది పడుతుంటే, కేవలం అర్హత మార్కులు తగ్గించడం వల్ల ఇలాంటి వారు డాక్టర్లుగా మారుతున్నారు. ప్రైవేటు కాలేజీల్లో సీట్లను భర్తీ చేసుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వాలు పదే పదే కటాఫ్ పర్సంటైల్‌ను తగ్గిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మేనేజ్‌మెంట్ కోటా.. డబ్బే పరమావధి:

వైద్య విద్య అనేది ఇప్పుడు ఒక వ్యాపారంగా మారిపోయిందనేది కాదనలేని నిజం. అర్హత మార్కులను సున్నాకు లేదా మరీ కనిష్ట స్థాయికి తీసుకురావడం వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న సీట్లను ఎలాగైనా నింపాలనే తాపత్రయంతో, కౌన్సెలింగ్ నిబంధనలను సడలిస్తున్నారు. ఇక దీనివల్ల చదువులో వెనుకబడిన వారు కూడా కోట్ల రూపాయలు కుమ్మరించి మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లు దక్కించుకుంటున్నారు. ఇలాంటి విధానం వల్ల రేపటి రోజున సమాజానికి ఎలాంటి వైద్యులు అందుబాటులోకి వస్తారో అని మెడికల్ అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

వైద్య రంగం భవిష్యత్తు ప్రమాదంలో ఉందా?

మెడికల్ సీటు అనేది కేవలం ఒక డిగ్రీ కాదు, అది కొన్ని లక్షల మంది ప్రాణాలకు సంబంధించిన బాధ్యత. ప్రతిభను పక్కన పెట్టి, కేవలం డబ్బున్న వారికే సీట్లు కట్టబెడితే వైద్య విద్య నాణ్యత దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంది.ఇక ఒకవైపు ప్రపంచస్థాయి ప్రమాణాలు కావాలని కోరుకుంటూనే, మరోవైపు ఇలాంటి అరకొర మార్కుల వారికీ అవకాశం ఇవ్వడం ద్వంద్వ నీతి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో వైద్య విద్య ప్రమాణాలు పెరగాలంటే, ప్రవేశ పరీక్షల్లో కచ్చితమైన మెరిట్ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే 'వైద్యో నారాయణో హరిః' అన్న మాటకు అర్థం లేకుండా పోతుంది.

డబ్బుతో సీటు కొనవచ్చు కానీ, ప్రతిభను కొనలేము. వైద్య విద్యలో ఇలాంటి సడలింపులు కొనసాగితే, భవిష్యత్తులో ప్రజల ఆరోగ్య భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రభుత్వం, మెడికల్ కౌన్సిల్ ఈ విషయంలో పునరాలోచించి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి.

Tags:    

Similar News