ఆర్థిక రాజధానిలో లోకేశ్.. ఆరుగురు బిగ్ షాట్స్ తో కీలక సమావేశాలు
సోమవారం ముంబై వచ్చిన లోకేశ్ ఆరు ప్రధాన కంపెనీల అధినేతలతో భేటీ అయ్యారు. ట్రాఫిగురా, ఈఎస్ఆర్, రుస్తోంజీ, హెచ్.పీ., బ్లూస్టార్, రహేజా సంస్థల అధినేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు.;
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మంత్రి నారా లోకేశ్ పర్యటన సరికొత్త ఆశలు రేపింది. వారం రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన మంత్రి లోకేశ్ ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ‘ఎయిర్ బస్’ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఏరోస్పేస్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎయిర్‌బస్ బోర్డుకు మంత్రి లోకేశ్ కోరారు. ఇక వచ్చేనెలలో విశాఖలో నిర్వహించే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించేందుకు ముంబై వచ్చిన లోకేశ్ రోజంతా బిజీగా గడిపారు. దేశంలోని ఆరు దిగ్గజ పరిశ్రమల ప్రతినిధులతో భేటీ అయిన మంత్రి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారిని ఆహ్వానించారు.
రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, మరోవైపు మంత్రి లోకేశ్ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు. గత 15 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిన ప్రభుత్వం.. వచ్చేనెలలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో మరిన్ని పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకునే విషయమై ఫోకస్ చేసింది. ఈ కార్యక్రమానికి పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించే ఉద్దేశంతో మంత్రి లోకేశ్ స్వయంగా వారిని కలుస్తున్నారు.
సోమవారం ముంబై వచ్చిన లోకేశ్ ఆరు ప్రధాన కంపెనీల అధినేతలతో భేటీ అయ్యారు. ట్రాఫిగురా, ఈఎస్ఆర్, రుస్తోంజీ, హెచ్.పీ., బ్లూస్టార్, రహేజా సంస్థల అధినేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. అదేవిధంగా టాటాసన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ తోనూ సమావేశమయ్యారు. ప్రధానంగా పోర్టు ఆధారిత మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలని ట్రాఫిగురూ సీఈవో సచిన్ గుప్తాను కోరారు. లాజిస్టిక్సు, చమురు, ఖనిజాలు, ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ఈ సంస్థ ముందజలో ఉన్నట్లు చెబుతున్నారు.
విశాఖ పోర్టు నుంచి బొగ్గు, జింకు, అల్యూమినియం ఎగువతి అవుతున్నందున రాష్ట్రంలో ఎగుమతి ఆధారిత మౌలిక సదుపాయాలకు సంబంధించిన రంగంలో పెట్టుబడులు పెట్టాలని లోకేశ్ ఆహ్వానించారు. ఇక ఆ తర్వాత ఈఎస్ఆర్ గ్రూపు ఇండియా ఇన్వెస్ట్మెంట్ హెడ్ సాదత్ షాను కలిసిన మంత్రి లోకేశ్ ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 4.0పై వారితో చర్చించారు. విశాఖ, కాకినాడ, తిరుపతి వంటి నగరాల్లో 1000 ఎకరాల చొప్పున మెగా ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తున్నామని, ఇందులో భాగస్వాములు కావాలని వారిని కోరారు.
ఇక రహేజా గ్రూపు ప్రెసిడెంట్ నీల్ రహేజాను కలిసి విశాఖలో మైండ్ స్పేస్ బిజినెస్ పార్కు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద డేటా సెంటర్ హబ్ విశాఖలో ఏర్పాటు కాబోతోందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో బ్లూస్టార్ కంపెనీ ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే తగిన సహాయ సహకారాలు అందజేస్తామని ప్రతిపాదించారు. ఆ కంపెనీ ఎండీ వీర్ ఎస్.అడ్వాణీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ పరంపరలోనే హెచ్.పీ. ఇండియా మార్కెట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇప్సితా దాస్ గుప్తాను కలిసి రాష్ట్రంలో త్రీడీ ప్రింటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. ఇలా ఒకే రోజు అటు సీఐఐ సన్నాహాక సమావేశంతోపాటు పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి లోకేశ్ భేటీ కావడం ఇండస్ట్రీ వర్గాలను ఆకర్షించిందని చెబుతున్నారు.