'రెండు కౌన్సిళ్ల‌'కే.. రేవంత్‌పై వ్య‌తిరేక‌తా?!

తాజాగా తెలంగాణ‌లో రెండు మునిసిప‌ల్ స్థానాల్లో అధికారం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్‌కు ద‌క్కింది.;

Update: 2026-04-05 03:00 GMT

తాజాగా తెలంగాణ‌లో రెండు మునిసిప‌ల్ స్థానాల్లో అధికారం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్‌కు ద‌క్కింది. వీటిలో రంగారెడ్డి జిల్లాలో ని ఇబ్ర‌హీంప‌ట్నం, మంచిర్యాల జిల్లాలోని క్యాత‌న‌ప‌ల్లి ఉన్నాయి. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఈ రెండు చోట్లా మునిసిప‌ల్ చైర్మ‌న్లుగా బీఆర్ ఎస్‌కు చెందిన వారు విజ‌యం ద‌క్కించుకున్నారు. వాస్త‌వానికి ఎప్పుడో జ‌ర‌గాల్సిన ఈ ఎన్నిక‌లు వివిధ కార‌ణాల‌తో వాయిదా ప‌డుతూ వ‌చ్చాయి.

అయితే.. తాజా విజ‌యంపై బీఆర్ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌త‌నానికి ఈ విజ‌యం నాంది అని పేర్కొన్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌న‌డానికి కూడా ఈ తాజా తీర్పు సంకేత‌మ‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అణిచివేత‌ల ప్ర‌భుత్వం కొన‌సాగుతోంద‌ని.. దీనిని ప్ర‌జ‌లు తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నార‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

కేసీఆర్ పై న‌మ్మ‌కంతోనే .. ఇక్క‌డి ప్ర‌జ‌లు బీఆర్ఎస్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చార‌ని తెలిపారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచ‌కాలు చేసినా.. ఎవ‌రూ ప‌ట్టించుకోలేదేన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ పెద్ద‌ల‌కు కూడా చెంప పెట్టులాంటి తీర్పు అని వ్యాఖ్యానించారు. బీఆర్ ఎస్ పార్టీకి ప్ర‌జ‌లు అండ‌గా ఉన్నార‌ని చెప్ప‌డానికి ఇది మ‌రింత సాక్ష్య‌మ‌ని వ్యాఖ్యానించారు. ఈ విష‌యంతో బీఆర్ ఎస్ శ్రేణులు మ‌రింత ఉత్సాహంతో ప‌నిచేయాల‌ని పిలుపునిచ్చారు.

అయితే.. గ‌త ఏడాది నుంచిఇప్ప‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ గ్రాఫ్‌ను గ‌మ‌నిస్తే.. అనేక ప‌త‌నాలు.. పెద్ద పెద్ద ప‌రాజ‌యాలు క‌నిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో సిట్టింగ్ సీటును బీఆర్ ఎస్ కోల్పోయింది. సొంత పార్టీ కి చెందిన నాయ‌కురాలు క‌విత వేరు కుంప‌టి పెట్టుకున్నారు. ఇక‌, పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో చావు త‌ప్పిన‌ట్టు పార్టీ ప‌రిస్థితి మారిపోయింది. ఇక‌, మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపించింది.

సో.. ఇన్ని ప‌రాజ‌యాలు మోస్తున్న బీఆర్ఎస్‌.. తాజాగా రెండు కౌన్సిళ్ల‌ను ద‌క్కించుకోగానే కాంగ్రెస్ ప‌రిస్థితి అయిపోయింద‌ని.. రేవంత్ గ్రాఫ్‌ప‌డిపోయింద‌ని వ్యాఖ్యానించ‌డంపై ఆ పార్టీ నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

Tags:    

Similar News