కేటీఆర్ కు కవిత రాఖీ కడుతుందా?

రాఖీ పండుగ సమీపిస్తున్న వేళ.. కల్వకుంట్ల కవిత, కేటీఆర్ మధ్య బంధం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.;

Update: 2025-08-04 12:33 GMT

రాఖీ పండుగ సమీపిస్తున్న వేళ.. కల్వకుంట్ల కవిత, కేటీఆర్ మధ్య బంధం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కవిత మాట్లాడుతూ.. "రాజకీయాలు వేరు, బంధాలు వేరు. ఈ ఏడాది అన్నయ్య కేటీఆర్‌కు రాఖీ కట్టుతాను" అని స్పష్టం చేశారు. అయితే ఆ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన కొన్ని విషయాలు, ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆమె మనసులో మాత్రం అసంతృప్తి ఉన్నట్టుగా కనిపిస్తోంది. గతేడాది ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉండటం వల్ల కవిత తన అన్నయ్యకు రాఖీ కట్టలేకపోయారు. ఇప్పుడు ఆమె బయటకు వచ్చి రాజకీయంగా చురుగ్గా ఉన్నప్పటికీ, పార్టీలో ఆమె పరిస్థితి మాత్రం ప్రశ్నార్థకంగా మారింది.

పార్టీలో మౌనంపై అసంతృప్తి

ఇంటర్వ్యూ తర్వాత రోజునే కవిత తన అన్న కేటీఆర్‌ను ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడినట్టుగా కనిపించింది. “తీన్మార్ మల్లన్న చేసిన వ్యక్తిగత వ్యాఖ్యల్ని ప్రజలు తీవ్రంగా ఖండించారు. కానీ మా పార్టీ నాయకులు మాత్రం మౌనంగా ఉన్నారు” అని మీడియా ముందు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పార్టీలోని సీనియర్ నేతలే తనపై కుట్రలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో బీఆర్‌ఎస్ లోపలి విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యాఖ్యలు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావుల వైపు ఆమె అనుమానాలు ఉన్నట్టుగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాఖీ వేడుకకు ముందు ఆమె ఇలా పరోక్షంగా విభేదాలను ప్రస్తావించడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది.

- జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు, కవిత కౌంటర్

ఇదే సమయంలో బీఆర్‌ఎస్ నేత జగదీశ్ రెడ్డి కవితను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. “కవిత మేము పట్టించుకోవాల్సినంత నాయకురాలు కాదు. కేసీఆర్ వల్లే ఆమెకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఆమె స్థానిక ఎన్నికల్లో కూడా గెలిచే స్థాయి లేదు” అని ఆయన అన్నారు. దీనిపై కవిత తీవ్రంగా స్పందిస్తూ జగదీశ్ రెడ్డిని 'లిల్లిపుట్ లీడర్' అంటూ విమర్శించారు. నల్గొండ జిల్లాలో పార్టీ ఘోర పరాజయానికి ఆయనే కారణమని కూడా ఆరోపించారు.

కవిత అభిప్రాయం ప్రకారం జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు కేటీఆర్ అనుమతితోనో లేదా ఆయన మెప్పు పొందేందుకో చేస్తున్నట్టుగా ఆమె అనుమానిస్తున్నారు. ఈ రెండింటిలో ఏది నిజమైనా సరే.. అన్న-చెల్లెళ్ల మధ్య అంతర్గత విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది రాఖీ పండగ రోజున కవిత నిజంగా కేటీఆర్‌కు రాఖీ కడతారా, లేదా ఈ రాజకీయ విభేదాల వల్ల వారి బంధం మరింత దూరం అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ఆ రోజు వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News