పుండుపై కారం చల్లిన కంగనా.. కనీస సామాజిక స్పృహ లేకపోతే ఎలా మేడం?
చాలా మంది సెలబ్రిటీలు తమకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకొని అటు రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టిన వారు ఉన్నారు.;
చాలా మంది సెలబ్రిటీలు తమకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకొని అటు రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టిన వారు ఉన్నారు. అయితే అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. అలాంటివారిలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కూడా ఒకరు. బీజేపీ తరపున పోటీచేసి.. ఎంపీ గా బాధ్యతలు చేపట్టిన ఈమె...మండి పార్లమెంటు నియోజవర్గం నుంచి గెలిచింది. అంతేకాకుండా ఈ మధ్య సినిమాలు తగ్గించి మరీ పొలిటికల్ కెరియర్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా తాను ఉన్నానంటూ భరోసా కల్పిస్తూ ముందుకు వెళుతున్న కంగనా రనౌత్ తాజాగా చేసిన పనికి విమర్శలు ఎదుర్కొంటోంది.
ఈ ఏడాది క్లౌడ్ బరస్ట్ కారణంగా హిమాచల్ ప్రాంతంలో చాలా వరదలు వచ్చేసాయి. దీంతో అక్కడ ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అకస్మాత్తుగా వరదలు రావడం.. కొండ చరియలు విరిగి పడడంతో వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. కంగనా నియోజకవర్గంలో కూడా భారీ నష్టం వాటిల్లింది. అయితే నిన్నటి రోజున తన నియోజకవర్గంలో పర్యటించిన కంగనా రనౌత్ కి ఎదురుదెబ్బ తగిలింది."గో బ్యాక్ కంగనా" అంటూ చాలామంది నిరసనలు వ్యక్తం చేశారు.. భారీగా నష్టం ఏర్పడింది. ఇంత ఆలస్యంగానా వచ్చేది అంటూ ఆమెపై ఫైర్ అయ్యారు అక్కడి స్థానిక ప్రజలు.
ఇదంతా పక్కన పెడితే.. రావడమే ఆలస్యంగా వచ్చింది. ఇలాంటి సమయంలో వరద బాధితులను పరామర్శిస్తూ.. వారికి అండగా నిలవాల్సింది పోయి.. తన బాధను ఎవరికి చెప్పుకోవాలి అంటూ కౌంటర్ గా చేసిన కామెంట్లు ఇప్పుడు ఆమెపై పూర్తి వ్యతిరేకతను కలిగిస్తున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా నిట్ట నిలువు ఆశ్రయాన్ని కోల్పోయిన వరద బాధితులు తమ బాధను తమ అధికారితో చెప్పుకోవడానికి ముందుకు వస్తే.. ఈమె అవేవీ పట్టించుకోకుండా.. తన సొంత రెస్టారెంట్ స్టోరీ చెబుతూ.. నిన్నటి రోజున నా రెస్టారెంట్లో అమ్మకాలు కేవలం రూ. 50 రూపాయలు మాత్రమే వచ్చాయి. అయినా ప్రతినెలా కూడా ఉద్యోగులకు 15 లక్షల రూపాయలు ఇస్తున్నాను.. దయచేసి నా బాధ కూడా మీరు అర్థం చేసుకోవాలంటూ " రివర్స్ గా మాట్లాడడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
వరదలు వచ్చి అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. కంగనా మాత్రం తన రెస్టారెంట్ బాధలను చెప్పుకోవడం చూసి.."పుండు మీద కారం చల్లినట్లు అనిపిస్తోంది. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదా.. కనీసం సామాజిక స్పృహ కూడా లేకపోతే ఎలా మేడం" అంటూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ ఏడాది మొదట్లో కంగనా మనాలి లో "ది మౌంటెన్" అనే రెస్టారెంట్ ను ప్రారంభించింది.. ఈ రెస్టారెంట్ ద్వారా.. హిమాచల్ ప్రదేశ్ ప్రాంతానికి చెందిన కొన్ని అద్భుతమైన వంటకాలను కస్టమర్లకు అందించేలా ప్లాన్ చేసింది. అయితే ఈ రెస్టారెంట్ కేవలం అక్కడ పర్యటకులకు మాత్రమే ఉపయోగపడుతోంది. గత కొద్దిరోజులుగా భారీ వర్షాల కారణం చేత కొండ చరియలు విరిగిపడడంతో.. ఆ వ్యాపారం కూడా నడవలేదని.. ఈ నేపథ్యంలోనే వరద బాధితులను ఆదుకోవాల్సిన సమయంలో.. తన ఆర్థిక కష్టాలను చెప్పుకోవడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది అని చెప్పవచ్చు.