హోర్ముజ్‌లో 'సూసైడ్ డాల్ఫిన్లు'.. ఇరాన్ సీక్రెట్ వార్ ప్లాన్?

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలక మార్గంగా భావించే హోర్ముజ్ జలసంధి మరోసారి అంతర్జాతీయ చర్చకు కేంద్రబిందువైంది.;

Update: 2026-05-06 15:34 GMT

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలక మార్గంగా భావించే హోర్ముజ్ జలసంధి మరోసారి అంతర్జాతీయ చర్చకు కేంద్రబిందువైంది. ఇరాన్ సైన్యం ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాల్ఫిన్‌లను సముద్ర యుద్ధ తంత్రాల్లో వినియోగిస్తోందా? అనే అనుమానాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా “సూసైడ్ డాల్ఫిన్లు” లేదా “కామికేజ్ డాల్ఫిన్లు” అనే పదాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ అంశంపై ఆసక్తి మరింత పెరిగింది.

ఈ చర్చకు కారణం అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ చేసిన వ్యాఖ్యలే. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ డాల్ఫిన్‌లను మోహరిస్తోందా? అనే ప్రశ్నకు ఆయన నవ్వుతూ “అలాంటి కమికేజ్ డాల్ఫిన్‌లు ఉన్నాయో లేదో నేను ధృవీకరించలేను.. ఖండించలేను” అని సమాధానం ఇవ్వడం పెద్ద ఎత్తున ఊహాగానాలకు దారితీసింది. అయితే రక్షణ రంగ నిపుణులు మాత్రం ఈ అంశంపై కొంత స్పష్టత ఇస్తున్నారు.

సముద్ర యుద్ధాల్లో డాల్ఫిన్‌ల వినియోగం కొత్త విషయం కాదని వారు చెబుతున్నారు. అమెరికా నావికాదళం 1959 నుంచే “మెరైన్ మమ్మల్ ప్రోగ్రామ్” పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బాటిల్‌నోస్ డాల్ఫిన్‌లు, సీ లయన్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అయితే వీటిని సినిమాల్లో చూపినట్లుగా ఆత్మాహుతి దాడుల కోసం ఉపయోగించరని స్పష్టం చేస్తున్నారు.

డాల్ఫిన్‌లకు సహజసిద్ధంగా ఉండే “బయో సోనార్” సామర్థ్యం అత్యంత అధునాతన టెక్నాలజీ కంటే సమర్థంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. నీటి అడుగున ఉన్న మైన్లు, శత్రు డైవర్లు లేదా అనుమానాస్పద వస్తువులను ఇవి చాలా వేగంగా గుర్తించగలవు. ముఖ్యంగా బురదగా, చీకటిగా ఉండే సముద్ర ప్రాంతాల్లో కూడా ఇవి అద్భుతంగా పనిచేస్తాయి.

సైనిక కార్యకలాపాల్లో డాల్ఫిన్‌లు సాధారణంగా శత్రు మైన్లను గుర్తించి ఆ ప్రాంతంలో మార్కర్ బోయీలను ఉంచుతాయి. ఆ తర్వాత మానవ డైవర్లు వెళ్లి వాటిని నిర్వీర్యం చేస్తారు. 2003 ఇరాక్ యుద్ధం అనంతరం కీలక ఓడరేవుల్లో మైన్ల గుర్తింపులో అమెరికా నేవీకి ఈ డాల్ఫిన్‌లు ఎంతో సహకరించాయి.

రష్యా కూడా తన నౌకాదళ స్థావరాల రక్షణ కోసం ఇలాంటి సముద్ర క్షీరదాలను వినియోగిస్తున్నట్లు గతంలో నివేదికలు వచ్చాయి. ఇరాన్ కూడా కొన్ని సంవత్సరాల క్రితం శిక్షణ పొందిన డాల్ఫిన్‌లను కొనుగోలు చేసిందనే వార్తలు వెలువడ్డాయి. అయితే ప్రస్తుతం అవి యుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయనే విషయానికి ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవు.

అయినా డాల్ఫిన్‌ల వీపుకు లేదా ముక్కుకు పేలుడు పదార్థాలు అమర్చి శత్రు నౌకలను ఢీకొట్టేలా శిక్షణ ఇస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతోంది. అయితే రక్షణ నిపుణులు దీన్ని ఎక్కువగా అతిశయోక్తిగా భావిస్తున్నారు. అత్యంత తెలివైన సముద్ర జీవులను “సూసైడ్ వెపన్స్”గా ఉపయోగించడం సాంకేతికంగా కూడా చాలా క్లిష్టమని వారు చెబుతున్నారు.

ఇక జంతు ప్రేమికులు, పర్యావరణవేత్తలు మాత్రం సముద్ర జీవులను సైనిక అవసరాల కోసం వినియోగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మానవ యుద్ధాల్లో నిరపరాధ జంతువులను భాగస్వామ్యం చేయడం అనైతికమని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, హోర్ముజ్ జలసంధి చుట్టూ జరుగుతున్న ఈ ప్రచారం అంతర్జాతీయ స్థాయిలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Tags:    

Similar News