‘నా ఫ్యామిలీని టార్గెట్ చేసి కేసులు పెట్టారు’ మాజీ సీజేఐ సంచలనం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు.;
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఈ తరహా వ్యాఖ్యలు చేయటం ఆయన నైజం కాదు. అలాంటిది తాజాగా మాత్రం ఆయన తన మనసులోని బాధనంతా వెళ్లగక్కినట్లుగా కనిపిస్తోంది. ఆయన ఆవేదనకు అమరావతిలోని విట్ ఏపీ యూనివర్సిటీ వేదికైంది. విట్ అమరావతి స్నాతకోత్సవానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని క్రిమినల్ కేసులు పెట్టారని.. తనపై ఒత్తిడి తీసుకురావటానికే అలా చేశారన్నారు. రైతుల తరఫు మాట్లాడిన వారందరినీ భయపెట్టే ప్రయత్నం చేశారన్నారు.
చాలామంది రాజకీయ నాయకులు మౌనంగా ఉన్న సమయంలో న్యాయమూర్తులు.. న్యాయవాదులు రాజ్యాంగానికి అండగా నిలబడ్డారన్న ఎన్వీ రమణ.. ‘‘మన చరిత్ర.. సంస్క్రతి నిలువుటద్దం. నవ్యాంధ్రప్రదేశ్ ఆకాంక్షలకు ప్రతీక అమరావతి. దానిని రాజధానిగా నిలబెట్టుకోవటానికి ఈ ప్రాంత రైతులు ఐదేళ్ల పాటు ఎన్నోకష్టాలు పడ్డారు. అణచివేతకు గురయ్యారు. అయినా వారు ధైర్యంగా.. శాంతియుతంగా సాగించిన పోరాటం చరిత్రలో నిలుస్తుంది. స్వాతంత్ర్య పోరాటం తర్వాత దక్షిణ భారతదేశంలో జరిగిన సుదీర్ఘ పోరాటం. ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఒత్తిళ్లు వచ్చినా వెనుకడుగు వేయని అమరావతి రైతుల ధైర్యానికి సెల్యూట్. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచినందుకు థ్యాంక్స్’’ అంటూ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.
తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారంటూ పేర్కొన్న ఆయన.. ‘‘నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని క్రిమినల్ కేసులు పెట్టారు. నాపై ఒత్తిడి తీసుకురావటానికే అలా చేశారని మీ అందరికీ తెలుసు. నన్నే కాదు.. రైతుల పక్షాన మాట్లాడిన వారందరినీ భయపెట్టే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో రాజ్యాంగ విలువలు కాపాడిన న్యాయమూర్తులకు బదిలీలు.. ఒత్తిళ్లు.. వేధింపులు ఎదురయ్యాయి. వారి కుటుంబాలను రాజకీయ కుట్రలకు బలి చేశారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో న్యాయమూర్తులు.. న్యాయవాదులు రాజ్యాంగానికి అనుగుణంగా పని చేశారు’’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఇదంతా వైఎస్ జగన్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న పరిణామాలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేసిన వైనం తెలిసిందే. అతేకాదు.. ప్రభుత్వం మారినప్పుడు పాత విధానాల్ని రద్దు చేయటం సరికాదన్న ఆయన.. ‘అలా చేస్తే డెవలప్ మెంట్ ఆగిపోతుంది. ప్రజలు ఇబ్బంది పడతారు. అందుకు అమరావతి అనుభవమే సాక్ష్యం. అధికార వ్యవస్థను ప్రతీకార రాజకీయాలకు వాడకూడదని నేను ఒక తీర్పులో చెప్పాను. ప్రభుత్వాలు మారినా న్యాయస్థానాలు.. చట్టపరిపాలన దేశానికి స్థిరమైన ఆధారం. అందుకే ప్రజలు న్యాయవ్యవస్త మీద విశ్వాసం ఉంచాలి’ అంటూ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.