జూబ్లీహిల్స్ ఉప పోరు వేళ.. తాజా ఓటర్ల లెక్క ఇదే

బీఆర్ఎస్ సీనియర్ నేత దివంగత మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది.;

Update: 2025-10-01 06:49 GMT

బీఆర్ఎస్ సీనియర్ నేత దివంగత మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలో జరిగే ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న లోక్ సభ.. అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఓటర్ల సంఖ్యపై తాజాగా స్పష్టత ఇచ్చారు.

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నియోజకవర్గ తుది ఓటరు జాబితాను విడుదల చేశారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి.. జీహెచ్ఎంసీ కమిషన్ తాజాగా విడుదల చేసిన ఓటర్ల జాబితాను అనుసరిస్తే నియోజకవర్గంలో 3.99 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లుగా తేల్చారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 407 పోలింగ్ కేంద్రాల పరిధిలో 3,98,992 మంది ఓటర్లు ఉన్నట్లుగా పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని ఓటర్లు తమ పేరునుఈసీఐ.. సీఈవో వెబ్ సైట్ ద్వారా కానీ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లో కానీ చెక్ చేసుకునే వీలుంది. రాజకీయ పార్టీలు.. ప్రజలు నామినేషన్ దాఖలయ్యే చివరి తేదీ వరకు ఫారం 7, ఫారం 8ద్వారా అభ్యంతరాలు.. మార్పులు.. చేర్పులకు అవకాశం ఉన్నట్లు జీహెచ్ఎంసీ కమిషన్ వెల్లడించారు.

నియోజకవర్గం పరిధిలోని ఎవరైనా జులై ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటర్లుగా అర్హులు. ఇప్పటికి ఓటరుగా నమోదు చేసుకోని వారు ఫారం 6 ద్వారా అప్లై చేసుకునే వీలుంది. ఇక.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికను స్వేచ్ఛాయుత వాతావరణంలో.. పారదర్శకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ ఉప పోరుకు సంబంధించి ఇప్పటివరకు బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను ప్రకటించగా.. కాంగ్రెస్.. బీజేపీలు మాత్రం తమ అభ్యర్థి విషయంలో కసరత్తు చేస్తున్నాయి.

Tags:    

Similar News