జైలుకు జోగి.. రిమాండు రిపోర్టులో కీలక విషయాలు!
అనంతరం ఈ ఉదయం 5 గంటల సమయంలో మేజిస్ట్రేట్ తన తీర్పునిస్తూ, మాజీ మంత్రి రమేష్ తోపాటు ఆయన సోదరుడు రాముకు 12 రోజుల పాటు రిమాండ్ విధించారు. అనంతరం కేసును వాయిదా వేశారు.;
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత జోగి రమేశ్ 12 రోజుల రిమాండ్ విధిస్తూ విజయవాడ ఆరో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ లెనిన్ బాబు తీర్పునిచ్చారు. కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి ఏ18గా, ఆయన సోదరుడు జోగి రమేష్ ను ఏ19గా చేర్చారు. ఆదివారం ఉదయం ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రిని ఆయన నివాసంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ తూర్పు పోలీసుస్టేషన్ కు తరలించారు. అక్కడ సిట్ ఎస్పీ కడియం చక్రవర్తి సాయంత్రం 4 గంటల వరకు విచారించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచే నిమిత్తం రాత్రి 9.45 నిమిషాలకు వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
వైద్య పరీక్షల అనంతరం అర్ధరాత్రి సమయంలో ఆరో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ లెనిన్ బాబు 11.30 నిమిషాలకు కోర్టు హాలుకు వచ్చారు. అప్పటికే వైసీపీ నేతలు, కార్యకర్తలతో కోర్టు హాలు నిండిపోవడంతో మేజిస్ట్రేట్ తన చాంబరుకు వెళ్లిపోయారు. కోర్టు హాలులో న్యాయవాదులు తప్ప, మరెవరూ ఉండకూడదని సూర్యారావుపేట సీఐ మహ్మద్ అలీకి సూచించడంతో ఆయన వైసీపీ నేతలు, కార్యకర్తలను ఖాళీ చేయించారు. అనంతరం కోర్టుకు హాలుకు వచ్చిన న్యాయమూర్తి సిట్ పోలీసులు, మాజీ మంత్రి జోగి రమేష్ తరఫు న్యాయవాదుల వాదనలు విన్నారు. అనంతరం ఈ ఉదయం 5 గంటల సమయంలో మేజిస్ట్రేట్ తన తీర్పునిస్తూ, మాజీ మంత్రి రమేష్ తోపాటు ఆయన సోదరుడు రాముకు 12 రోజుల పాటు రిమాండ్ విధించారు. అనంతరం కేసును వాయిదా వేశారు.
కాగా, కోర్టుకు తరలించకముందు మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు రామును పోలీసులు విడివిడిగా విచారించారు. దాదాపు 12 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు, ఆయన సోదరుడు, మరో నిందితుడు జగన్మోహనరావుతో ఉన్న వ్యాపార సంబంధాలపై ఆరా తీశారని సమాచారం. ఇక కోర్టుకు సమర్పించిన రిమాండు రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. అరెస్టు సమయంలో ఏ1 అద్దేపల్లి జనార్దనరావు ఇచ్చిన వాంగ్మూలంతోపాటు ఇటీవల కస్టడీలో రాబట్టిన సమాచారం ఆధారంగా మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాముపై అభియోగాలు మోపినట్లు తెలిపారు.
మాజీ మంత్రి రమేష్ సూచనలతోనే ఏ1 నిందితుడు తొలుత ములకలచెరువులో కల్తీ మద్యం తయారీని ప్రారంభించాడని, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఈ పని మొదలుపెట్టారని ఆరోపించారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలోనూ కల్తీ మద్యం చేయించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడానికి ఇద్దరూ కలిసి కుట్ర పన్నారని పోలీసులు రిమాండు రిపోర్టులో పేర్కొన్నారు. మరోవైపు మాజీ మంత్రిని కోర్టుకు తరలించే సమయంలో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో హైడ్రామా చోటుచేసుకుంది. జోగి అనుచరులను నిలువరించే ప్రయత్నంలో వైసీపీ కార్యకర్తలు, మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ప్రోద్బలంతో ఆస్పత్రి అద్దాలు ధ్వంసం చేయడంతోపాటు మాచవరం ఎస్ఐపై దాడి చేశారని మరో కేసు నమోదైంది.