జంతర్ మంతర్: సీజేపీ నేతలకు రిమాండ్ !

దీనికి ప్రత్యామ్నాయంగా ఇతర ప్రాంతాలను సూచించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెంట్రల్ ఢిల్లీలోని రామ్ లీలా మైదానం, నార్త్ వెస్ట్ ఢిల్లీ లోని బురారి మైదానం, ఈస్ట్ ఢిల్లీ లోని సీబీడీ మైదానాలను సూచించారు.

Update: 2026-10-14 05:49 GMT

జంతర్ మంతర్ లో నిరసన ప్రదర్శనల్లో తరచుగా హింస, పోలీసులకు గాయాలు, ట్రాఫిక్, అత్యవసర సేవలకు ఇబ్బందులు, ఇతర పౌరుల హక్కులపై ప్రభావం చూపుతుందని, ఇక్కడ ఆందోళనలు చేసే వారికి మరుగుదొడ్లు, నీరు, వైద్య సౌకర్యాలు అందుబాటులో లేవని అక్టోబర్ 12న ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ ప్రాంతాన్ని డిజిగ్నేటెడ్ ప్రొటెస్ట్ సైట్ జాబితా నుండి డీ నోటిఫై చేశారు.

దీనికి ప్రత్యామ్నాయంగా ఇతర ప్రాంతాలను సూచించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెంట్రల్ ఢిల్లీలోని రామ్ లీలా మైదానం, నార్త్ వెస్ట్ ఢిల్లీ లోని బురారి మైదానం, ఈస్ట్ ఢిల్లీ లోని సీబీడీ మైదానాలను సూచించారు. అయితే ఇక్కడ ఆందోళనలు చేయాలన్నా ముందస్తు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో సీజేపీ దీనిని వ్యతిరేకిస్తూ ‘దేశం మొత్తం జంతర్ మంతర్ అవుతుంది. జంతర్ మంతర్ డీ నోటిఫై చేయగలరు. కానీ నిరసనలు డీ నోటిఫై చేయలేరు’ అంటూ జంతర్ మంతర్ తిరిగి స్వాధీనం పేరుతో సీజేపీ నేతలు బారికేడ్లను దాటి, జేడీ యూ కార్యాలయం గేట్లు దూకి జాతీయ జెండాలతో జంతర్ మంతర్ లోకి ప్రవేశించి సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఆందోళనలు చేశారు.

దీంతో పోలీసులు సీజేపీ కో కన్వీనర్, ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా, అజింక్యా శిందే లతో పాటు 11 మంది వాలంటీర్లతో కలిపి 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. శాంతి నిర్వహణ హామీతో అజింక్య శిందేను విడుదల చేయగా, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు కోర్టు 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

ఢిల్లీలోని జంతర్ మంతర్ చాలా కాలంగా ప్రధాన నిరసన వేదిక. గతంలో కూడా ఇక్కడ నిషేధం విధించడం, తిరిగి పునరుద్ధరించడం జరిగింది. సుప్రీంకోర్టు గతంలో శాంతియుత నిరసన హక్కును గుర్తించింది. తాజాగా తిరిగి అక్కడ నిషేధం విధించడంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News