జగన్ తో అంబటి రాంబాబు కీలక భేటీ.. ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘ చర్చ!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు కలిశారు.;

Update: 2026-02-20 06:37 GMT

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టు అయిన అంబటి రాంబాబు రెండు రోజుల క్రితం జైలు నుంచి విడుదల అయ్యారు. శుక్రవారం తాడేపల్లిలోని మాజీ సీఎం నివాసంలో ఆయనను కలిశారు. వీరిద్దరి భేటీ రాష్ట్ర రాజకీయ వర్గాలను ఆకర్షించింది. 18 రోజుల పాటు రాజమండ్రి జైలులో ఉన్న అంబటి రాంబాబు బెయిల్ లభించిన అనంతరం గురువారం స్వస్థలం గుంటూరు చేరుకున్నారు. ఈ రోజు మాజీ సీఎం జగన్ ను కలిసి కీలక విషయాలపై చర్చించారు.

మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి అంబటి భేటీ సుమారు గంటకు పైగా జరిగింది. ఈ సమావేశంలో జగన్, అంబటి రాంబాబుతోపాటు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ నందిగాం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ ఉన్నారు. మాజీ మంత్రి అంబటి అరెస్టు తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, అంబటి ఇంటిపై దాడి వంటి విషయాలపై చర్చించినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా కొందరు పోలీసులు వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి అంబటి పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఈ సందర్భంగా పోలీసు కేసులకు భయపడ వద్దని నేతలు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రజల తరఫున పోరాటానికి కార్యకర్తలు ఎప్పుడూ ముందు ఉండాలని జగన్ పిలుపునిచ్చారు. ఇక జైలులో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను అంబటి రాంబాబు పార్టీ అధినేతకు వివరించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వంపై పోరాడటానికి సిద్ధంగా ఉంటానని అంబటి తెలిపారు.

గతనెల 31న గుంటూరు నగరంలోని నల్లపాడు పోలీసులు అంబటి రాంబాబును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అదే రోజు అంబటి ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేయడాన్ని వైసీపీ తీవ్రంగా నిరసించింది. ఇక అంబటిని జైలుకు తరలించిన తర్వాత వైసీపీ అధ్యక్షుడు జగన్ తోపాటు ఆ పార్టీ కీలక నేతలు అందరూ మాజీ మంత్రి అంబటికి సంఘీభావం తెలిపారు. గుంటూరులో అంబటి ఇంటిని సందర్శించి ఆయనకు మద్దతు ప్రకటించారు. అటు రాజమండ్రి జైలులోనూ అంబటితో పలువురు ములాఖత్ అయ్యారు. 18 రోజుల పాటు జైలులో ఉన్న అంబటి బుధవారం సాయంత్రం జైలు నుంచి విడుదల అవ్వగా, గురువారం భారీ ర్యాలీతో గుంటూరు చేరుకున్నారు.

Tags:    

Similar News