సచ్చింది గొర్రె.. ఇక్క ఇరానీ చాయ్ రూ.80లా?

నగరంలోని అత్యంత ప్రసిద్ధ కేఫ్‌లలో ఒకటైన 'కేఫ్ నీలోఫర్' తమ టీ ధరలను భారీగా పెంచడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Update: 2026-05-25 07:09 GMT

హైదరాబాద్ అంటే బిర్యానీ తర్వాత వెంటనే గుర్తొచ్చేది ఇరానీ చాయ్. ఉదయం మొదలుకుని అర్థరాత్రి వరకు నగరంలోని కేఫ్‌లలో చాయ్ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం భాగ్యనగర సంస్కృతిలో ఒక భాగమైపోయింది. టెకీలు, విద్యార్థులు, ఉద్యోగులు, దినసరి కూలీలు.. ఇలా ప్రతి వర్గానికీ ఇరానీ చాయ్‌తో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ చాయ్ ప్రేమికులకు ఊహించని షాక్ తగిలింది. నగరంలోని అత్యంత ప్రసిద్ధ కేఫ్‌లలో ఒకటైన 'కేఫ్ నీలోఫర్' తమ టీ ధరలను భారీగా పెంచడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

సరికొత్త ధరల వివరాలు ఇవే!

1978 నుంచి హైదరాబాద్ ప్రజలకు ప్రత్యేకమైన రుచిని అందిస్తూ విశ్వసనీయ బ్రాండ్‌గా ఎదిగింది కేఫ్ నీలోఫర్. అయితే తాజా ధరల పెంపుతో సాధారణ ప్రజలు అవాక్కవుతున్నారు. ఫుల్ టీ ధర: రూ. 80.. సింగిల్ టీ ధర: రూ. 60గా ఉంది. ఇంతకాలం సామాన్యుడికి అందుబాటులో ఉన్న ఇరానీ చాయ్ ధర ఒక్కసారిగా ఈ స్థాయికి చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఉదయం వేళల్లో కేఫ్ ముందు కనిపించే భారీ క్యూలు, ఒక కప్పు చాయ్ కోసం గంటల తరబడి ఎదురుచూసే అభిమానుల జ్ఞాపకాలు.. ఈ ధరల పెంపుతో మరోసారి వార్తల్లో నిలిచాయి.

ధరలు ఎందుకు పెంచాల్సి వచ్చింది? యాజమాన్యం వివరణ

టీ ధరల పెంపుపై కేఫ్ యాజమాన్యం స్పందించింది. ప్రస్తుతం పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వారు వెల్లడించారు. అందుకు వారు చెబుతున్న ప్రధాన కారణాలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 3,000 మార్కును దాటడం, మార్కెట్లో ఎల్పీజీ కొరత ఏర్పడటం... పాలు, నాణ్యమైన టీ పొడి, చక్కెర ధరలు భారీగా పెరగడం. ఉద్యోగుల జీతాలు, విద్యుత్ చార్జీలు, బిల్డింగ్ రెంట్లు కూడా గతంతో పోలిస్తే విపరీతంగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో పాత రేట్లతోనే నాణ్యమైన చాయ్ అందించడం సాధ్యం కాకే ధరలను సవరించినట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ ధరల పెంపుపై సోషల్ మీడియా వేదికగా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెజారిటీ వినియోగదారులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

సామాన్యుడి పానీయం.. ఇక 'లగ్జరీ డ్రింక్' కానుందా?

హైదరాబాద్‌లో ఇరానీ చాయ్ అనేది కేవలం ఒక పానీయం కాదు అదొక ఎమోషన్. పొగలు గక్కే చాయ్ కప్పుతో రోజును ప్రారంభించే హైదరాబాద్ వాసులకు ఈ ధరల పెంపు మింగుడుపడటం లేదు. బ్రాండ్, లొకేషన్ పేరుతో చాయ్ ధరలను ఇలాగే పెంచుకుంటూ పోతే, భవిష్యత్తులో ఇరానీ చాయ్ సామాన్యుడికి దూరమై "లగ్జరీ డ్రింక్"గా మారిపోతుందా? అన్న ఆందోళన నగరవ్యాప్తంగా వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News