హ‌ర్మూజ్ వార్ ఎఫెక్ట్: స‌ముద్రంలో తేలిన ఐఫోన్‌లు.. 2500 కంటైన‌ర్లు చెల్లా చెదురుగా!

అమెరికా- ఇజ్రాయేల్ వ‌ర్సెస్ ఇరాన్ వార్ గురించి ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా చ‌ర్చ జ‌రుగుతోంది.

Update: 2026-10-15 10:34 GMT

అమెరికా- ఇజ్రాయేల్ వ‌ర్సెస్ ఇరాన్ వార్ గురించి ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా చ‌ర్చ జ‌రుగుతోంది. ఆయిల్ పాలిటిక్స్ గురించి.. ఇరాన్ స్వాధీనంలో ఉన్న హ‌ర్మూజ్ జ‌ల‌సంధి గురించి చాలా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతూనే ఉంది. ఇలాంటి స‌మ‌యంలో హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో చోటు చేసుకున్న ఒక విచిత్రమైన ప్రమాదం ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో ప్రధాన వార్తగా నిలిచింది. సముద్రంలో మునిగిపోయిన ఒక భారీ కార్గో నౌకకు సంబంధించిన వస్తువులు నీటిపై తేలుతున్న దృశ్యాలు.. ముఖ్యంగా ఖరీదైన ఐఫోన్లు.. లగ్జరీ పెర్ఫ్యూమ్ బాటిల్స్ నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఇప్ప‌టికే అందిన వివరాల ప్రకారం.. సింగపూర్ జెండా కలిగిన `జిఎఫ్‌ఎస్ ప్రైడ్` కంటైనర్ నౌక దుబాయ్ నుంచి వస్తున్న సమయంలో హోర్ముజ్ జలసంధి వద్ద ప్రమాదానికి గురైంది. ఈ నౌక నావల్ మైన్ (ఇరాన్ వాళ్లు పెట్టిన మైన్‌)ను ఢీకొనడం వల్ల లేదా ఒక అజ్ఞాత క్షిపణి దాడికి గురికావడం వల్ల అకస్మాత్తుగా మంటలు చెలరేగి సముద్రంలో మునిగిపోయినట్లు సముద్రయాన అధికారులు తెలిపారు.

ఈ నౌకలో మొత్తం 2,500కి పైగా కంటైనర్లు ఉన్నాయని.. అందులో ప్రధానంగా అత్యంత ఖరీదైన ఐఫోన్‌ బాక్సులు, విలాసవంతమైన పెర్ఫ్యూమ్ బాటిల్స్ భారీగా ఉన్నాయని సమాచారం. నౌక మునిగిపోయిన తర్వాత ఈ వస్తువులతో కూడిన ప్యాకెట్లు సముద్రంపై తేలుతూ కనిపించాయి. చుట్టుపక్కల ఉన్న చిన్న పడవల్లోని స్థానికులు నీటిపై తేలుతున్న ఈ ఖరీదైన వస్తువులను ఏరుకుంటున్న వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ప్రమాదంలో నౌక పూర్తిగా ధ్వంసమైనా.. అదృష్టవశాత్తూ అందులో ఉన్న 21 మంది సిబ్బందిని సకాలంలో సురక్షితంగా రక్షించగలిగామని సింగపూర్ మెరైటైమ్ అండ్ పోర్ట్ అథారిటీ వెల్లడించింది. ఈ ఘటనలో సిబ్బంది ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం.

ప్రపంచ దేశాలకు చమురు- ఇంధన సరఫరా చేసే అత్యంత కీలకమైన మార్గమైన హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో గత కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్ వ‌ర్సెస్ అమెరికా మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం కారణంగా ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడులు తరచూ జరుగుతున్నాయి. ఈ తాజా నౌకా ప్రమాదం.. దాడుల పరంపర అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతపై తీవ్ర ఆందోళనలను కలిగిస్తోంది.




Tags:    

Similar News