అంబానీ కా హాత్.. నా సీటు భద్రం.. రిలయన్స్ ను బతిమిలాడుతున్న ట్రంప్ సారూ..

మరి ఈ మంటలు చల్లార్చాలంటే మన "డొనాల్డ్ మామ"కి ఎవరి వైపు చూడక తప్పడం లేదట? ఇంకెవరు.. సరిగ్గా మన గుజరాత్‌లోని జామ్‌నగర్ వైపు...

Update: 2026-10-19 07:09 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ గారికి మునుపెన్నడూ లేని కొత్త "లారీ" తలనొప్పి వచ్చి పడింది. అదేనండీ.. అక్కడ విపరీతంగా మండిపోతున్న డీజిల్ ధరలు. సూపర్ పవర్ దేశంలో డీజిల్ గ్యాలన్ ధర కాస్త పైకి లేచిందంటే చాలు.. రేపు రాబోయే మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ఓటర్లు ఎక్కడ తమ సీటు కింద బాంబు పెడతారోనని వైట్ హౌస్‌లో చమటలు పడుతున్నాయి. మరి ఈ మంటలు చల్లార్చాలంటే మన "డొనాల్డ్ మామ"కి ఎవరి వైపు చూడక తప్పడం లేదట? ఇంకెవరు.. సరిగ్గా మన గుజరాత్‌లోని జామ్‌నగర్ వైపు...

అవును.. అమెరికాలో ట్రక్ డ్రైవర్లు డీజిల్ కొట్టించలేక దిగులుగా ఉంటే ఆ సరకు రవాణా భారం పడి టమోటాల నుంచి పిజ్జాల వరకు అన్నీ ప్రియమైపోతున్నాయి. దాంతో జనాలు ముక్కూ మొహం చిట్లించేసరికి ట్రంప్ సర్కార్ కళ్ళు పక్కదేశాలపై పడ్డాయి. మరి ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం మన రిలయన్స్ అంబానీ గారి వద్ద సిద్ధంగా ఉందిగా.. జామ్‌నగర్ రిఫైనరీ అంటే మామూలు విషయం కాదు.. ఏ రకం ముడిచమురునైనా నమిలి మింగేసి, అత్యంత నాణ్యమైన డీజిల్‌ను టన్నుల కొద్దీ బయటకు వదిలే రాక్షస సామర్థ్యం దానికి ఉంది.

ఇప్పుడు ప్రచారం ఏమిటంటే.. "ఏమయ్యా అంబానీ.. కాస్త డీజిల్ పంపించవయ్యా.. మా ఓటర్లను కాపాడుకోవాలి" అని అమెరికా దండం పెడుతోందట.. అయితే మాటల్లో చెప్పుకోవడం తేలికే కానీ గుజరాత్ నుంచి డీజిల్ ఓడల్లో నింపుకుని, సముద్రాలు దాటుకుని.. అమెరికా తీరానికి చేరుకునేసరికి ఆ డీజిల్ ధర అమెరికన్లకు చుక్కలు చూపించదా అన్నదే పెద్ద సందేహం. ఓడల అద్దెలు, రవాణా ఆలస్యం, నాణ్యతా ప్రమాణాల లొసుగులు ఇవన్నీ దాటుకుని రావడం చుక్కలు చూడటమే..

అయినా సరే సొంత దేశంలో రిఫైనరీలు చాలక.. రష్యా-ఉక్రెయిన్ లొల్లి మధ్య ఇరుక్కుపోయిన అమెరికాకు ఇప్పుడు జామ్‌నగరే దిక్కనే వార్తలు వింటుంటే మనోళ్లకు కాస్త గర్వంగానే ఉంది. పొరపాటున ఇండియా నుంచి పోయే డీజిలే అక్కడ ట్రంప్ ఓటు బ్యాంకును కాపాడితే గనక.. రేపు పొద్దున్న ట్రంప్ గారు తన ప్రచారంలో "అంబానీ కా హాత్.. నా సీటు భద్రం" అని నినాదాలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.. ఏది ఏమైనా "మేడ్ ఇన్ ఇండియా" డీజిల్ అమెరికా లారీల్లో పడితే.. అక్కడ ట్రంప్ బండి మళ్ళీ గీత దాటి ముందుకు సాగుతుందో లేదో చూడాలి..

Tags:    

Similar News