ఉంగరం వేలు నుంచే ఆర్థిక లావాదేవీలు.. ఇది ఒక్కటుంటే సరిపోద్ది..
అగ్రదేశం అమెరికా కొంత ఇబ్బంది ఎదుర్కొంటుంటే.. చైనా, జపాన్ లాంటి దేశాలు అభివృద్ధికి సరిపడా వనరులు లేక కొట్టుమిట్టాడుతున్నాయి.;
వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మొదటి ప్లేస్ లో ఉన్నది భారత్ మాత్రమే. అగ్రదేశం అమెరికా కొంత ఇబ్బంది ఎదుర్కొంటుంటే.. చైనా, జపాన్ లాంటి దేశాలు అభివృద్ధికి సరిపడా వనరులు లేక కొట్టుమిట్టాడుతున్నాయి. ఇక నాలుగో ప్లేస్ లో ఉన్న భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. మరింత ఎదిగేందుకు కావాల్సిన వనరులు పుష్కలంగా ఉన్నాయి. కొత్త కొత్త ఇన్నోవేషన్స్ తో భారత్ ప్రపంచానికి అటెన్షన్ క్రియేట్ చేస్తుంది.
డిజిటల్ ఇండియా విజన్ ఇప్పుడు కొత్త రూపాన్ని సంతరించుకోబోతోంది. ఇప్పటి వరకు లావాదేవీలన్నీ ఫోన్ లో సాగాయి.. కానీ ఇప్పుడు చేతిలో ఫోన్ లేకుండా కేవలం ఉంగరాన్ని తాకించడం ద్వారా చెల్లింపులు చేయగల యుగం మొదలైంది. ఇది కల కాదు మన ముందుకు వస్తున్న నిజం. ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ ‘మ్యూజ్’ సృష్టించిన ‘రింగ్ వన్’ ఆవిష్కరణతో వాస్తవ రూపం దాల్చబోతోంది. మ్యూజ్ స్టార్టప్ సీఈవో కేఎల్‌ఎన్ సాయిప్రశాంత్, సీఓఓ ప్రత్యూష కామరాజుగడ్డ ఈ విషయాన్ని తెలిపారు. ఈ స్మార్ట్ రింగ్ ద్వారా చెల్లింపులు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆధ్వర్యంలో రూపే (RuPay) వ్యవస్థతో నేరుగా అనుసంధానమవుతాయి. ఈ భాగస్వామ్యం భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థను కొత్త దిశకు తీసుకెళ్తుంది.
ఫోన్ పక్కన.. ఫ్యాషన్ థింక్ ముందు..
ఇప్పటి వరకు పేమెంట్ అంటే మొబైల్ యాప్, క్యూఆర్ కోడ్, పాస్‌వర్డ్ లేదా బయోమెట్రిక్ గుర్తింపు. ఇప్పుడు ఆ దారిలో మరోటి ఉండబోతోంది. పేమెంట్ ఒక గెస్టర్ (Gesture) గా మారుతోంది.
ఉంగరాన్ని పాయింట్ ఆఫ్ సేల్ (POS) యంత్రానికి తాకిస్తే చెల్లింపు పూర్తవుతుంది. ఈ పద్ధతి Near Field Communication (NFC) టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. అంటే కేవలం కొన్ని సెంటీ మీటర్ల దూరంలోనే డివైజ్ సిగ్నల్ అందుకొని లావాదేవీలను పూర్తి చేస్తుంది.
ఇది కేవలం సౌకర్యం కాదు, భద్రతకు విప్లవం కూడా.
కార్డ్ బయట పెట్టాల్సిన అవసరం లేదు, పాస్‌వర్డ్ చెప్పాల్సిన అవసరం లేదు.. ఫోన్ ఆన్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. చెల్లింపు సెకన్లలో, కానీ భద్రత మాత్రం మరో లెవల్ అనే చెప్పవచ్చు.
‘రింగ్‌వన్’ వెనుక తెలుగువారి మేధస్సు
ఇది భారతీయ ఆవిష్కరణకు గర్వకారణం. మ్యూజ్ అనే స్టార్టప్ ఐఐటీ మద్రాస్‌లో పుట్టింది, తెలుగు యువ శాస్త్రవేత్తలు కేఎల్‌ఎన్ సాయిప్రశాంత్, ప్రత్యూష కామరాజుగడ్డ భారతీయ మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ సాంకేతికతను వృద్ధి చేశారు. వారి లక్ష్యం ఒకటే ‘చెల్లింపులు ఎంత వేగంగా, సులభంగా, భద్రంగా ఉండాలి’ అని. దేశంలో రూపే కార్డులు కోట్లాది మంది వద్ద ఉన్నాయి. ఇప్పుడు అదే వ్యవస్థను ఈ ఉంగరంతో అనుసంధానం చేయడం ద్వారా దేశ వ్యాప్తంగా ఈ టెక్నాలజీని పెద్ద ఎత్తున విస్తరించే అవకాశం ఉంది.
సౌకర్యం నుంచి సంస్కృతి వరకు..
ఇలాంటి ఆవిష్కరణలు కేవలం టెక్నాలజీ సౌకర్యాన్ని కాదు.. అవి మన ఆర్థిక సంస్కృతిని కూడా మార్చేస్తాయి. నగదు వినియోగం తగ్గి, పారదర్శక లావాదేవీలు పెరుగుతాయి. చిన్న వ్యాపారాల నుంచి పెద్ద రిటైల్ చెయిన్ల వరకు ఈ స్మార్ట్ పేమెంట్ రింగ్ వినియోగించవచ్చు. ఇదే కాదు.. దీనితో చాలా చేయవచ్చు..
*ట్రైన్ టికెట్ బుక్ చేయవచ్చు,
*కాఫీ కొనే చెల్లింపు చేయవచ్చు,
*పెట్రోల్ బంక్‌లో చెల్లించవచ్చు,
*షాపింగ్ మాల్‌లో స్కాన్ చేయించవచ్చు.
మరో కోణంలో..
ప్రతి ఆవిష్కరణకు రెండు కోణాలుంటాయి ఒకటి సౌకర్యం, రెండు బాధ్యత.
రింగ్‌వన్ లాంటి స్మార్ట్ పేమెంట్ టెక్నాలజీలు సౌకర్యంతో కూడుకుంటాయి. కానీ వాటి భద్రతా ప్రమాణాలు అత్యున్నతంగా ఉండాలి.
ఎన్‌పీసీఐ, రూపే ఇప్పటికే ప్రపంచ స్థాయి భద్రతా మోడళ్లను అనుసరిస్తున్నందున, ఈ కొత్త పద్ధతిని మరింత భద్రంగా తయారు చేయాలి.
కానీ, ప్రజల డేటా సురక్షితంగా ఉండడం, బయోమెట్రిక్ లింక్‌లు దుర్వినియోగం కాకుండా ఉండడం అనేది భవిష్యత్ సవాల్.
టెక్నాలజీ అభివృద్ధి మనిషిని మరింత మానవీయంగా చేయాలి.
అంటే సౌకర్యం మాత్రమే కాదు, భద్రత కూడా పెంచాలి.
ప్రపంచానికి మార్గదర్శకం
భారత ఐఐటీలు కేవలం ఇంజినీర్లను మాత్రమే అందంచడం లేదు.. ప్రపంచ స్థాయి ఆవిష్కర్తలను కూడా అందిస్తుంది. మ్యూజ్ వంటి స్టార్టప్‌లు ఆ శ్రేణిలో నిలుస్తున్నాయి. భారతీయ మేధస్సు ఇప్పుడు గ్లోబల్ ఫిన్‌టెక్ రంగాన్ని సవాల్ చేస్తోంది. ఒక ఉంగరం కూడా బ్యాంక్‌గా, వాలెట్‌గా, భద్రతా సంకేతంగా పనిచేసే దేశం మనదే అంటే ఆశ్చర్యం కలుగకమానదు.
‘రింగ్‌వన్’ కేవలం ఒక ఉత్పత్తి కాదు.. అది ఒక ఆలోచన. మనిషి టెక్నాలజీకి కాకుండా, టెక్నాలజీ మనిషికి సేవ చేసే దిశలో ఇది ఒక మైలురాయి అని చెప్వచ్చు. ఫోన్‌ను తీయకుండా, కేవలం ఉంగరాన్ని తాకించి చెల్లించే రోజు ఎంతో దూరంలో లేదు.