పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే దిగువకు.. మీడియా స్వేచ్ఛలో పడిపోయిన భారత ర్యాంక్

ప్రపంచ మీడియా స్వేచ్ఛ సూచీలో భారతదేశం మరోసారి వెనకడుగు వేసింది. గతంలో 151వ స్థానంలో ఉన్న దేశం.. తాజా నివేదిక ప్రకారం 157వ స్థానానికి పడిపోయింది.

Update: 2026-06-02 13:30 GMT

ప్రపంచ మీడియా స్వేచ్ఛ సూచీలో భారతదేశం మరోసారి వెనకడుగు వేసింది. గతంలో 151వ స్థానంలో ఉన్న దేశం.. తాజా నివేదిక ప్రకారం 157వ స్థానానికి పడిపోయింది. ప్రభుత్వ ప్రకటనలు, ప్రచారాలు దేశంలో అంతా సవ్యంగానే ఉందని చెబుతున్నప్పటికీ అంతర్జాతీయ సంస్థల అంచనాలు మాత్రం భిన్నమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నాయి.

ర్యాంకింగ్స్ పతనానికి ప్రధాన కారణాలు ఇవే..

మీడియా విశ్లేషకుల ప్రకారం.. దేశంలో జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపై పెరుగుతున్న ఒత్తిళ్లే ఈ పతనానికి ప్రధాన కారణం.. ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ ప్రశ్నలు అడిగే జర్నలిస్టులపై వరుస కేసులు నమోదు అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసే యాక్టివిస్టులను చట్టపరమైన విచారణలతో ఇబ్బంది పెట్టడం... వార్తలు రాయడానికి లేదా ప్రసారం చేయడానికి ముందే లీగల్ నోటీసులు వస్తాయేమోననే భయం మీడియా వర్గాల్లో నెలకొనడం... కొంతమంది జర్నలిస్టులు ఇప్పుడేకంగా తమ మెయిల్‌ బాక్సుల్లో లీగల్ నోటీసుల కోసం ప్రత్యేక ఫోల్డర్లు కూడా క్రియేట్ చేసుకుంటున్నారనే వ్యంగ్య వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

పొరుగు దేశాల కంటే వెనుకబడిన భారత్

ఈ సూచీలో అత్యంత ఆశ్చర్యకరమైన, ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. ఆర్థిక, సామాజిక సంక్షోభాల్లో ఉన్నాయనుకునే మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు కూడా ఈ జాబితాలో భారత్ కంటే మెరుగైన స్థానాల్లో నిలవడం గమనార్హం.

సోషల్ మీడియాలో సెటైర్లు

ఈ పరిణామంపై నెటిజన్లు సోషల్ మీడియాలో గట్టిగానే స్పందిస్తున్నారు. "దేశం 'విశ్వగురు' కావాలంటే ముందు ప్రశ్నలు అడిగేవారిని గురువుల్లా గౌరవించాలి గానీ నిందితుల్లా చూడకూడదు" అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

ప్రభుత్వం ఏమంటోంది?

ఈ ర్యాంకింగ్‌పై అధికార వర్గాల స్పందన ఎప్పటిలాగే చాలా సాధారణంగా ఉంది. "దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది.. ఇలాంటి అంతర్జాతీయ ర్యాంకులు వస్తుంటాయి.. పోతుంటాయి. వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు" అనే సమాధానం అధికార వర్గాల నుంచి వినిపిస్తోంది.

మీడియా స్వేచ్ఛ అంటే ఏమిటి?

మీడియా స్వేచ్ఛ అంటే ప్రభుత్వం ఇచ్చే ప్రెస్ నోట్లను, ప్రకటనలను యథాతథంగా ప్రచురించడం లేదా భజన చేయడం కాదు. ప్రజాస్వామ్యంలో లోపాలను ఎత్తిచూపడం, పాలకులను నిలదీయడం అవసరమైనప్పుడు ప్రశ్నించడం మీడియా కర్తవ్యం..

ఈ తాజా ర్యాంకింగ్ ద్వారా భారత్ ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చినట్లయింది.. ‘‘ప్రశ్నలు అడగడం మీ స్వేచ్ఛ కావచ్చు... కానీ ఆ సమాధానాలు వినడం పాలకులకు ఇష్టం ఉండకపోవచ్చు!" అని అర్థమవుతోంది..

Tags:    

Similar News