వాహనదారులు బీ అలర్ట్.. ఆ తప్పు చేస్తే లైసెన్స్ రద్దు!

ఇకపై రోడ్డు మీద ఇష్టమొచ్చినట్టు డ్రైవింగ్ చేస్తామంటే కుదరదు.. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులకు చుక్కలు చూపించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త 'గ్రేడ్ పాయింట్ల' విధానాన్ని తీసుకువస్తోంది.;

Update: 2026-02-27 00:30 GMT

ఇకపై రోడ్డు మీద ఇష్టమొచ్చినట్టు డ్రైవింగ్ చేస్తామంటే కుదరదు.. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులకు చుక్కలు చూపించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త 'గ్రేడ్ పాయింట్ల' విధానాన్ని తీసుకువస్తోంది. కేవలం జరిమానాలతో వదిలిపెట్టకుండా, మీరు చేసే తప్పులకు పాయింట్లు కట్ చేస్తూ చివరికి మీ లైసెన్స్‌నే రద్దు చేసేలా నితిన్ గడ్కరీ ప్లాన్ సిద్ధం చేశారు. మీ లైసెన్స్ మీ చేతిలో ఉండాలంటే ఇకపై రూల్స్ పాటించడం తప్పనిసరి. ఆ కొత్త రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

డ్రైవింగ్ లైసెన్స్‌కు గ్రేడ్ పాయింట్లు.. ఇదో కొత్త పరీక్ష:

తాజాగా జరిగిన ఒక కాన్ఫరెన్స్‌లో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ డ్రైవింగ్ లైసెన్స్ వ్యవస్థలో రాబోతున్న విప్లవాత్మక మార్పుల గురించి వివరించారు. దీని ప్రకారం ప్రతి డ్రైవింగ్ లైసెన్స్‌కు కొన్ని గ్రేడ్ పాయింట్లు కేటాయిస్తారు. మీరు రాంగ్ రూట్‌లో వెళ్లినా, హెల్మెట్ లేకపోయినా, అతివేగంతో వెళ్లినా మీ ఖాతాలో ఉన్న పాయింట్లు తగ్గిపోతూ ఉంటాయి. ఇలా తప్పులు చేస్తూ పోయి పాయింట్లన్నీ సున్నాకి చేరితే, మీ లైసెన్స్‌ను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తారు లేదా శాశ్వతంగా రద్దు చేస్తారు. చట్టం అంటే భయం లేని వారిని దారిలోకి తెచ్చేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

ప్రమాదాల్లో యువతే టార్గెట్.. గణాంకాలు ఏం చెబుతున్నాయి?:

దేశంలో ఏటా సుమారు 1.8 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండటంపై గడ్కరీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో దారుణమైన విషయం ఏంటంటే, మరణిస్తున్న వారిలో 72 శాతం మంది 18 నుండి 45 ఏళ్ల మధ్య వయసున్న యువకులే ఉండటం. మద్యం సేవించి నడపడం, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడటం, అతివేగం వంటి కారణాలే ఈ మరణాలకు ప్రధాన కారణమని గుర్తించారు. అందుకే కేవలం రోడ్లు బాగు చేయడం మాత్రమే కాదు, డ్రైవర్ల ప్రవర్తనలో మార్పు తేవడం కోసం ఈ గ్రేడింగ్ పాయింట్ల విధానాన్ని త్వరలోనే దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నారు.

బాధితులకు అండగా పీఎం రాహత్ స్కీమ్.. రూ.1.5 లక్షల సాయం:

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం పౌరులను ప్రోత్సహిస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు డబ్బులు లేవని భయపడాల్సిన అవసరం లేదని, 'పీఎం రాహత్ స్కీమ్' ద్వారా రూ.1.5 లక్షల వరకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ అంటే నగదు రహిత క్లెయిమ్ అందుబాటులో ఉంటుందని మంత్రి వెల్లడించారు. ఎవరైనా ప్రమాద బాధితులకు సాయం చేస్తే వారిని ఇబ్బంది పెట్టవద్దని అధికారులకు సూచించారు. ప్రాణాలు కాపాడటమే పరమావధిగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

Tags:    

Similar News