హ్యుందాయ్ కూడా వచ్చేస్తుందా? ఏపీని ఊరిస్తున్న మరో భారీ పెట్టుబడి
కొత్త పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షిస్తూ దేశంలో మిగిలిన రాష్ట్రాలను వెనక్కి నెడుతున్న ఏపీని మరో భారీ పెట్టుబడి ఊరిస్తోంది.;
కొత్త పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షిస్తూ దేశంలో మిగిలిన రాష్ట్రాలను వెనక్కి నెడుతున్న ఏపీని మరో భారీ పెట్టుబడి ఊరిస్తోంది. ఇప్పటికే ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, స్టీల్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో భారీ పెట్టుబడులను సాధించిన రాష్ట్రం ఇప్పుడు ఆటోమొబైల్ పరిశ్రమపై ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. 16 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు 11.50 లక్షల కోట్లు పెట్టుబడులను తీసుకువచ్చారు. రెండు రోజుల క్రితం దిగ్గజ ఐటీ కంపెనీ గూగుల్ తో విశాఖలో రూ.1.36 లక్షల కోట్లతో డేటా సెంటర్, ఏఐ హబ్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారు. ఇదే సమయంలో దేశంలో రూ.45 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు హ్యుందాయ్ మోటార్ చేసిన ప్రకటనను ఏపీ ప్రభుత్వం అవకాశంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమలో విస్తరించాలని భావిస్తున్న దక్షిణకొరియా కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ 2029-30 నాటికి రూ.45 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో పర్యటిస్తున్న హ్యుండాయ్ మోటార్స్ సీఈవో జోస్ మునోజ్ ఈ ప్రకటన చేయడంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయిందని అంటున్నారు. గతంలో కియా మోటార్స్ ను ఏపీకి తీసుకువచ్చిన చంద్రబాబు ప్రభుత్వం హ్యుందాయ్ మోటార్ ఇండియాను రాష్ట్రానికి రప్పించేలా అడుగులు వేసేందుకు సిద్ధమవుతోందని అంటున్నారు. చంద్రబాబు గత ప్రభుత్వంలో అంటే 2014-19 మధ్య అనంతపురంలో కియా మోటార్స్ ఏర్పాటైంది. పెనుగొండ సమీపంలో నిర్మించిన కియా మోటార్స్ వల్ల కరువు సీమ అయిన అనంతపురం జిల్లాలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని స్థానికులు చెబుతున్నారు. కియాకు అనుబంధంగా మరికొన్ని పరిశ్రమలు రావడంతో స్థానికులకు మెరుగైన ఉపాధి అవకాశాలు వచ్చాయని అంటున్నారు.
దీంతో హ్యుందాయ్ పరిశ్రమ ఏర్పాటుకు కూడా అనంతపురం అనువైన ప్రదేశంగా ప్రతిపాదనలు పంపాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. భారత ఆటోమొబైల్ ఎగుమతుల్లో హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ వాటా 30 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఐదేళ్లలో తమ కంపెనీ ఆదాయాన్ని 1.5 రెట్లు పెంచుకుని రూ.లక్ష కోట్ల టర్నోవర్ మైలురాయిని దాటాలని భావిస్తోంది. ఇందుకోసం 2029-2030 ఆర్థిక సంవత్సరం నాటికి మరో 26 కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. అంతేకాకుండా తమ కంపెనీ ఉత్పత్తి చేస్తోన్న ఎలక్ట్రిక్ ఎస్.యూ.వీ.ని స్థానికంగా తయారు చేయాలని భావిస్తోంది. దీంతో కొత్త ఎలక్ట్రిక్ పరిశ్రమకు అనువైన ప్లాన్ తో ఏపీ రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు.
ఇదే సమయంలో హ్యుందాయ్ ఏపీకి వచ్చేందుకు కూడా కొన్ని అనువైన పరిస్థితులు ఉన్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. హ్యుందాయ్ ఇండియాకు కొత్త సీఈవోగా తరుణ్ గార్గ్ కు పదోన్నతి కల్పించింది. ఈయన హ్యుందాయ్ మోటార్ ఇండియాకు తొలి భారతీయ సీఈవోగా చెబుతున్నారు. ప్రస్తుతం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా ఉన్న తరుణ్ గార్గ్ కు స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన ఉన్నందున ఆయనను ఒప్పించడం ఏపీ ప్రభుత్వానికి తేలికైన పని అవుతుందని అంటున్నారు.